బైజూస్ యాప్ డౌన్‌లోడ్‌కు ఉపాధ్యాయుల తంటాలు
‣ చంద్రగిరి మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయులు పాఠశాలకు సెల్‌ఫోన్ తీసుకురావాలని కోరారు. ఇంట్లో తండ్రి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఇస్తేనే పాఠశాలకు వెళ్తానని మారం చేశాడు. ఉన్న ఒకే ఒక్క ఫోన్ ఇవ్వడానికి వారు ఇష్టపడలేదు.
‣ తిరుపతి గ్రామీణ మండలంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు సెల్‌ఫోన్ తీసుకురావాలని ఆరో తరగతి విద్యార్థికి చెప్పారు. ఇంటికి వెళ్లిన ఆ విద్యార్థి సెల్‌ఫోన్ తీసిస్తేనే పాఠశాలకు వెళ్తానంటూ మారాం చేశాడు. అందుకు వారు ఇష్టపడలేదు.
‣ ఇది ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎదురైన పరిస్థితి కాదు. జిల్లాలోని అనేక ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
న్యూస్‌టుడే, తిరుపతి(విద్య), చంద్రగిరి: ప్రభుత్వం పాఠశాలల స్థాయిలో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బైజూస్ సంస్థ రూపొందించిన పాఠ్యాంశాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం పాఠశాల విద్యార్థులకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఎంత మందికి ఉన్నాయనే సమాచారం సేకరించి వారి నంబర్లు ఆన్లైన్లో పొందుపరిచారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన తరగతుల విద్యార్థులకు వారి వ్యక్తిగత సెల్ఫోన్ల నుంచి పాఠాలు వినేలా చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సెల్‌ఫోన్ తీసుకురండి లేదా తల్లిదండ్రులను నేరుగా సెల్‌ఫోన్‌తో రావాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కోరోజు ఒక్కో తరగతి విద్యార్థులకు సూచిస్తున్నారు. పాఠశాలకు వచ్చిన తరువాత బైజూస్ యాప్ డౌన్లోడ్ చేసి ఆ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేస్తున్నారు. విద్యార్థులు ఇంటి వద్దనే చదువుకునే అవకాశం ఉందని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.
ఆందోళనలో తల్లిదండ్రులు
కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు చదువుకు దూరమై సెల్ఫోన్లపై ఆసక్తి పెంచుకున్నారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పుస్తకాల బాట పట్టిన తరుణంలో మళ్లీ సెల్ఫోన్ల ద్వారా పాఠాలు వినాలంటే సెల్ఫోన్లపై ఆసక్తి పెరుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు చాలా మంది పేదవారు కావడంతో వారికి ఉన్న సెల్‌ఫోన్ పాఠశాలకు ఇచ్చి పంపడం.. లేదా కొత్తది కొనుగోలు చేసి ఇవ్వడం, దానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలంటే కష్టంగా మారుతుందన్న అభిప్రాయంలో ఉన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎప్పుడు పంపిణీ చేస్తారనే సమాచారం లేకపోవడంతో సెల్ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా వద్దా అన్న సందేహంలో విద్యార్థులు ఉన్నారు.
70 శాతం అప్డేట్
అక్టోబరు 26వ తేదీ వరకు విద్యార్థుల సెల్‌ఫోన్ నంబర్లు 70 శాతం అప్డేట్ చేశారు. జిల్లాలోని 34 మండలాల్లో 4వ తరగతిలో 18,058 మందికి గాను 16,152 మంది.. 5వ తరగతిలో 18,589 మందికి గాను 16364 మంది అప్డేట్ చేశారు. 27వ తేదీ వరకు 9వ తరగతి విద్యార్థులు 17,673 మందికి గాను 11,543 మంది అప్డేట్ చేసినట్లు తెలిసింది.
గ్రామీణ ప్రాంతాల వారికి కష్టమే
గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులలో ఎక్కువ మందికి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండే పరిస్థితి లేదు. చిన్నపాటి ఫోన్లు ఉన్నా వాటికి టవర్లు సరిగా లేని పరిస్థితి. ఇంట్లో ఉండే ఒకేఒక సెల్‌ఫోన్ పెద్దలు తీసుకెళ్తే ఎప్పుడు వస్తారనేది చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు యాప్ ద్వారా పాఠాలు ఎంత వరకు వినియోగించుకుంటారనేది తెలియాల్సి ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.