ఈనాడు, అమరావతి: ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం నిబంధనల కత్తి దూస్తోంది. గత రెండేళ్లుగా విద్యార్థుల ప్రవేశాలు తగ్గిన ఎయిడెడ్ పాఠశాలల అనుమతులను జిల్లా విద్యాధికారులు రద్దు చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాలు పెంచుకోవాలని, తగ్గితే చర్యలు తీసుకుంటామని గతంలో నోటీసులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం పమిడిపాడు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 2020-21లో 31మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం ఐదుగురే ఉన్నారని, రెండేళ్లుగా పిల్లల సంఖ్య తగ్గిపోయినందున అనుమతులు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు. 2021 సెప్టెంబరు 30లోపు తరగతికి 30 నుంచి 40మంది విద్యార్థులకు పెంచుకునేందుకు అవకాశం కల్పించినా యాజమాన్యం విఫలమైందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలోని ఎయిడెడ్ పోస్టులను జిల్లాలోని మరో బడికి సర్దుబాటు చేయాలని సూచించారు. రికార్డులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు అప్పగించాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలల అనుమతుల రద్దుకు అన్ని జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
వ్యవస్థపై దాడి..
రాష్ట్రంలో 40మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారంటూ గతంలో 418 పాఠశాలలకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వీటన్నింటికీ అనుమతులు రద్దు చేయబోతున్నారు. కొన్ని జిల్లాల్లో విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరికొందరు కసరత్తు చేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలలను విలీనం చేసేందుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించడం, లేదంటే ఆస్తులతో సహా విద్యా సంస్థలను అప్పగించేందుకు ఐచ్ఛికాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,988 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా.. వీటిలో 83 సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి ఇచ్చాయి. మరో 753 యాజమాన్యాలు సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాయి. మిగతా 1,152 పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నందున 418 అనుమతులను ప్రభుత్వమే రద్దు చేస్తోంది. ఎయిడెడ్లో పోస్టులను భర్తీ చేయకుండా క్రమంగా వీటి ఉనికినే కోల్పోయేలా చేస్తోంది. విద్యార్థులు తగ్గిపోయారని ఎయిడెడ్ పాఠశాలల అనుమతులు రద్దు చేస్తున్న అధికారులు.. ప్రభుత్వ బడులకు మాత్రం దీన్ని అమలు చేయడం లేదని ఎయిడెడ్ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో చాలా ఫౌండేషన్ బడుల్లో ఐదులోపు విద్యార్థులు మిగిలారని, వీటిని మాత్రం కొనసాగిస్తూ తమపైనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.