• facebook
  • whatsapp
  • telegram

AP Schools: పాఠశాలల నిర్వహణ నిధుల్లో కోత

రూ.135 కోట్లకు... రూ.20 కోట్లే విడుదల
కొన్నింటికి ఇప్పటికీ జమ కాలేదు
చాక్‌పీసులు, రిజిస్టర్‌లు, విద్యుత్తు బిల్లులకు ప్రధానోపాధ్యాయుల జేబుల నుంచే ఖర్చు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చే నిర్వహణ (కాంపొజిట్‌) నిధుల్లోనూ పాఠశాల విద్యాశాఖ కోతలు విధిస్తోంది. నిధుల కొరత పేరుతో ఈ ఏడాది ఇప్పటి వరకు 20 శాతమే విడుదల చేసింది. దాంతో చాక్‌పీసులు, రిజిస్టర్ల కొనుగోలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఖాతాలకు జమైతే బిల్లులు పెట్టుకుందామనుకుంటున్నా... కొన్నింటికి ఇప్పటివరకు డబ్బులు అందలేదు. గతంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒకేసారి విడుదల చేసే వారు. ఈ ఏడాది విడతల వారీగా ఇస్తున్నారు. ఇలా.. జాప్యం జరిగితే చివరికి మొత్తం నిధులు విడుదలయ్యే పరిస్థితి ఉండదని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి. కేంద్రం తన వాటాగా ఇస్తున్న 60శాతం నిధుల్లోనూ రాష్ట్ర స్థాయిలో కోతలు విధించడం గమనార్హం.   కొన్ని పాఠశాలలకు 2020-21, 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి సరిగా ఇవ్వలేదు. ఇచ్చిన వాటి నుంచి విద్యా సంవత్సరం ముగింపులో మిగిలిన మొత్తాలను వెనక్కి తీసేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,729 ప్రాథమిక పాఠశాలలు, 7,073 ఉన్నత పాఠశాలలకు కలిపి ఈ ఏడాది రూ.135.35 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. మొదటి విడతగా కేవలం రూ.20.07 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ మేరకు ఆగస్టు 29న ఉత్తర్వులు ఇవ్వగా.. ఇంతవరకు చాలా పాఠశాలలకు జమ కాలేదు. జిల్లాల్లోని అదనపు ప్రాజెక్టు సమన్వయ అధికారుల(ఏపీసీ)కు మొత్తాలను పంపించామని ఉన్నతాధికారులు చెబుతుండగా.. కొన్నిచోట్ల రాలేదని ఏపీసీలు సమాధానమిస్తున్నారు. విడతలవారీగా అంటూ కోతలు విధించడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క పాఠశాలలకు ఏటా రూ.60 కోట్లకుపైగా విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. మీటర్లు కేటగిరి-2లో ఉన్నందున బిల్లు మొత్తాలు అధికంగానే వస్తున్నాయి. వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఏడాదికి కేవలం రూ.లక్ష ఇస్తున్నారు. ఇందులోనూ 10శాతం  నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛత కార్యాచరణ కోసం వ్యయం చేయాలనే నిబంధన విధిస్తున్నారు. దీని వల్ల విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పీజీ విద్యార్థినుల‌కు యూజీసీ ప్రోత్సాహం

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ మైనారిటీ బాలిక‌ల‌కు ఉప‌కార వేత‌నాలు

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.