విద్యలో సంస్కరణల పేరుతో తరగతి బోధన, అభ్యసన గాలికి
ప్రైవేటు పాఠశాలలకు పెరిగిన వలసలు
పోస్టుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీల్లోనూ సాగదీతే
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ సంస్కరణల కారణంగా పాఠశాల విద్య అస్తవ్యస్తంగా తయారవుతోంది. తరగతి బోధన, పిల్లల అభ్యసనపై పరిశీలన కొరవడింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంనుంచి బోధన, అభ్యసనకు బదులు ఉపాధ్యాయుల ఆందోళనలు, నిరసనలు, మార్పులపై చర్చలే ఎక్కువగా కొనసాగాయి. తరగతుల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ అయోమయ పరిస్థితుల్లో ప్రభుత్వ బడులనుంచి 3.98 లక్షల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. చివరికి పరీక్షల నిర్వహణలోనూ జాప్యం చేశారు. సెప్టెంబరు, అక్టోబరుల్లో ఫార్మెటివ్-1, 2.. నవంబరులో సమ్మెటివ్-1 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆలస్యంగా నవంబరు 2 నుంచి 5 వరకు ఫార్మెటివ్-1 స్థానంలో తరగతి ఆధారిత అంచనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనం, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, 1-8వ తరగతి వరకు ఒకే మాధ్యమంలాంటి అంశాలతోపాటు బదిలీల్లో జాప్యం పాఠశాల విద్యపై తీవ్ర ప్రభావం చూపాయి. బైజూస్ పాఠ్యప్రణాళిక కోసం ఎనిమిదో తరగతి మినహా 5-10 తరగతుల పిల్లలపై సెల్ఫోన్ల భారం మోపారు. సొంతంగా సెల్‌ఫోన్ కొనుక్కునేందుకు రూ.6 వేలు- రూ.8 వేలు, వీటికి ఇంటర్నెట్ కోసం నెలనెలా రూ.200-రూ.300 వరకు వెచ్చించాల్సి వస్తోంది.
ప్రాథమిక విద్యపై విలీనం పోటు
5,250 బడులను విలీనం చేశారు. తరగతి గదులు, కనీస సదుపాయాలు లేకపోయినా విద్యార్థులను తరలించేశారు.
లెక్చరర్లు లేని కళాశాలలు
విద్యా సంవత్సరంతో సంబంధం లేకుండా హడావుడిగా బాలికల జూనియర్ కళాశాలలను ఏర్పాటుచేశారు. కొత్తగా ఏర్పాటుచేసిన 292 బాలికల కళాశాలల్లో, పాఠశాలల్లో పాఠాలు చెప్పేవారు లేరు.
ఇష్టారాజ్యంగా హేతుబద్ధీకరణ
9,10 తరగతుల్లో 60మంది, 6-8 తరగతుల్లో 53మంది విద్యార్థులకు ఒకే సెక్షన్ అమలు చేశారు. ఒక్కో గదిలో 60మంది విద్యార్థులు కూర్చునేందుకు సరిపోవడంలేదు.
1-8 ఒకే మాధ్యమం
ప్రభుత్వ బడుల్లో ఒకేసారి 1-8 తరగతులకు తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల పిల్లలను కలిపేసి పాఠాలు బోధించడంతో ఎవరికి ఏ మాధ్యమం పూర్తిగా అర్థంకాని దుస్థితి.
సిలబస్ సీబీఎస్ఈ
మొదటి విడతగా 3,108 పాఠశాలలకు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేశారు. వీటిలో 1,092కి అనుమతి వచ్చే అవకాశముంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే చాలామంది విద్యార్థులు సీబీఎస్ఈ పాఠాలు చదివి రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయాల్సి వస్తుంది.
ప్రాథమిక విద్యపై విలీనం పోటు
ప్రాథమిక పాఠశాలలనుంచి 3,4,5 తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. మొదట దీన్ని మూడు కి.మీ.లోపు చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులనుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో దీన్ని కిలోమీటరుకు తగ్గించారు. 5,250 బడులను విలీనం చేశారు. తరగతి గదులు, కనీస సదుపాయాలు లేకపోయినా విద్యార్థులను తరలించేశారు.
ఏం జరిగింది?: కొన్నేళ్లుగా గ్రామంలో సమీపంలో ఉన్న బడి ఒక్కసారిగా మాయమైంది. ప్రభుత్వం పాఠశాలను మూసేయలేదని సాంకేతికంగా చెబుతున్నా అక్కడ 3,4,5 తరగతులు లేనందున ఆ విద్యార్థులకు అష్టకష్టాలు మొదలయ్యాయి. ఐదో తరగతి వరకు నడిచిన పాఠశాలను కాపాడుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొన్ని రోజులపాటు ఆందోళన నిర్వహించారు. వారి విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొందరు తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించేశారు. రాష్ట్రంలో 1,2 తరగతులున్న సుమారు 45 శాతం ఫౌండేషన్ బడుల్లో విద్యార్థులు 10 మందిలోపే ఉన్నారు. వీటి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ప్రభుత్వం అధికారికంగా పాఠశాలను మూసేయకపోయినా విద్యార్థులు లేక వాటికవే మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఆరు రకాల పాఠశాలలను తీసుకొచ్చారు. ఇవి ఇప్పటికీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియని దుస్థితి నెలకొంది.
చిన్న పిల్లలకు అన్యాయం: షేక్ సాబ్జీ, ఎమ్మెల్సీ
‘విలీనం కారణంగా 1,2 తరగతుల పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగింది. విద్యార్థులు తగ్గినందున ఇవి కొనసాగుతాయో? లేదో అగమ్యమే. కొన్ని బడుల్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే మిగిలారు. కొన్నిచోట్ల ‘నాడు-నేడు’ కింద ప్రాథమిక బడుల్లో చేసిన వ్యయం వృథా అయింది.’
సిలబస్ సీబీఎస్ఈ
ప్రభుత్వ పాఠశాలల్లో అన్నింటిలో విడతలవారీగా సీబీఎస్ఈ పాఠ్యప్రణాళిక అమలు చేస్తామని హడావుడిగా ప్రకటించారు. రాష్ట్రంలో 44వేల పాఠశాలలుంటే ఈ ఏడాది మొదటి విడతగా 3,108 పాఠశాలలకు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేశారు. మొదటి విడతగా 1,092కి అనుమతి వచ్చే అవకాశముంది. గుర్తింపు వచ్చిన బడుల్లో చదివేవారు మాత్రం 2025లో సీబీఎస్ఈ బోర్డు పదో తరగతి పరీక్షలు రాస్తారు.
ఏం జరిగింది: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు సీబీఎస్ఈ పాఠాలు చదివి రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఈ ఏడాది సీబీఎస్ఈ సిలబస్ కోసం ఎనిమిదో తరగతికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాలను ముద్రించారు. వీటినే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అందించారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చాలావాటికి సీబీఎస్ఈ గుర్తింపు లేకపోయినా సిలబస్ మాత్రం చదవాల్సి వస్తోంది. ఎనిమిదో తరగతికి రాష్ట్ర బోర్డుకు చెందిన ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో చాలా ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం స్థలాలు, సదుపాయాలు లేనందున గుర్తింపు లభించదు. వీటినేం చేస్తారనే దానిపైనా స్పష్టత లేదు. ప్రైవేటు పాఠశాలలదీ ఇదే పరిస్థితి. సీబీఎస్ఈలో అంతర్గత మార్కుల విధానం ఉండగా.. రాష్ట్ర బోర్డు వీటిని రద్దు చేసింది. సీబీఎస్ఈ సిలబస్ చదివినవారికి రాష్ట్ర బోర్డు పరీక్షలు పెడితే అంతర్గత మార్కులు లేనందున విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందే: హృదయరాజు, అధ్యక్షుడు ఏపీటీఎఫ్
‘రాష్ట్ర బోర్డు సిలబస్‌తో పోల్చితే సీబీఎస్ఈ ఎక్కువ ప్రామాణికం (స్టాండర్డ్)గా ఉంటుంది. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థికి ఏ సిలబస్ ఉంటుందో అదే పరీక్ష విధానం ఉండాలి’
లెక్చరర్లు లేని కళాశాలలు
విద్యా సంవత్సరంతో సంబంధం లేకుండా హడావుడిగా బాలికల జూనియర్ కళాశాలలను ఏర్పాటుచేశారు. మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలుంటే ఒకదాన్ని బాలికల కళాశాలగా మార్చాలని నిర్ణయించారు. ఒకవేళ ఒక్కటే ఉంటే ప్రత్యేకంగా మరో బాలికల కళాశాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను ఉన్నతీకరించి బాలికల కళాశాలలను ప్రారంభించారు.
ఏం జరిగింది: కొత్తగా ఏర్పాటుచేసిన 292 బాలికల కళాశాలల్లో, పాఠశాలల్లో పాఠాలు చెప్పేవారు లేరు. స్కూల్అసిస్టెంట్లతోనే నెట్టుకొస్తున్నారు. దాదాపు 242 కళాశాలల్లో 20మందిలోపే పిల్లలు చేరారు. 54 కళాశాలల్లో ఒక్కరు, ఇద్దరే ఉన్నారు. 118 చోట్ల 10 మందిలోపే ఉన్నారు. ఇప్పటివరకు ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించలేదు. ప్రయోగశాలలు లేవు. హైస్కూల్లో చదువుకొని జూనియర్ కళాశాలలో ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల తరగతి గదుల కొరత ఉంది.
ఎస్ఏలతోనే బోధన: విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ
‘ప్రభుత్వ బడుల్లో పదో తరగతి ఫలితాలు తగ్గడం ప్రవేశాలపై ప్రభావం చూపింది. పాఠాలు చెప్పేందుకు స్కూల్‌అసిస్టెంట్లకు లెక్చరర్లుగా పదోన్నతులివ్వడం లేదు. ఆయా బడుల్లోని ఎస్ఏలతోనే పాఠాలు చెప్పిస్తున్నారు’
ఇష్టారాజ్యంగా హేతుబద్ధీకరణ
9,10 తరగతుల్లో 60మంది, 6-8 తరగతుల్లో 53మంది విద్యార్థులకు ఒకే సెక్షన్ అమలు చేశారు. 6,7,8 తరగతులుండే ప్రీహైస్కూల్‌లో 98 మందికంటే తక్కువగా పిల్లలుంటే ఎస్జీటీలను కేటాయించారు. 3-10 తరగతులుండే ఉన్నత పాఠశాలలో 137 మంది, 6-10 తరగతుల్లో 92 మంది పిల్లలుంటే వీటికి ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడిని ఇవ్వలేదు.
ఏం జరిగింది: ప్రభుత్వం నిర్మించిన ఒక్కో గదిలో 60మంది విద్యార్థులు కూర్చునేందుకు సరిపోదు. దీంతో పిల్లలు ఇరుకిరుకుగా కూర్చోవాల్సి వస్తోంది. పాఠాలూ సరిగా వినిపించవు. 6,7,8 తరగతుల్లో పిల్లలు తక్కువగా ఉన్నారని ఎస్జీటీలతో పాఠాలు చెప్పిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశాలున్నాయి. హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం కారణంగా ఎస్జీటీ పోస్టులు సుమారు 13వేలు మిగులుగా తేల్చారు. ప్రత్యామ్నాయంగా డీఎస్సీ-98 వారిని ఒప్పంద విధానంలో సర్దుబాటు చేయనున్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే భవిష్యత్తులో కొత్త నియామకాలుండే పరిస్థితి లేకుండాపోయింది. తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున ఇస్తున్నారు. ఆయన సెలవు పెడితే ప్రత్యామ్నాయం లేదు.
ఉపాధ్యాయులపై భారం: భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్
‘పోస్టుల హేతుబద్ధీకరణతో ఉపాధ్యాయులపై భారం పడుతుంది. సెక్షన్‌కు ఒక ఉపాధ్యాయుడిని ఇస్తే రోజు మొత్తం తరగతిలోనే ఉండాల్సి వస్తుంది. పాఠం చెప్పేందుకు సన్నద్ధం కావడానికి, ప్రశ్నపత్రాల మూల్యాంకనంలాంటి పనులు చేసేందుకు ఆయనకు సమయం ఉండదు’
1-8 ఒకే మాధ్యమం
ప్రభుత్వ బడుల్లో ఒకేసారి 1-8 తరగతులకు తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటివరకు ఉన్న తెలుగు మాధ్యమ విద్యార్థులను ఆంగ్లమాధ్యమంలో కలిపేశారు. హేతుబద్ధీకరణలో ఉపాధ్యాయ పోస్టులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏం జరిగింది: తెలుగు, ఆంగ్ల మాధ్యమాల పిల్లలను కలిపేసి పాఠాలు బోధించడంతో ఎవరికి ఏ మాధ్యమం పూర్తిగా అర్థంకాని దుస్థితి. కొన్నిచోట్ల తెలుగు, ఆంగ్లంతో కూడిన ద్విభాష పుస్తకాలకు బదులు ఒక్క ఆంగ్ల మాధ్యమం పుస్తకాలనే ఇచ్చారు. దీంతో తెలుగు మాధ్యమం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 4 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఆంగ్లంలో చిన్నవాక్యాన్ని చదవలేకపోతున్నట్లు బేస్‌లైన్ సర్వేలో వెల్లడైంది. వీరు పదో తరగతిలో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలెలా రాస్తారు? బేస్‌లైన్ సర్వే నిర్వహించిన విద్యాశాఖ.. పిల్లల పరిస్థితిపై వారి తల్లిదండ్రులకు వివరాలను అందజేయలేదు. దీంతో తమ పిల్లలేం చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి ఏర్పడింది.
మాధ్యమం ఎంపిక విద్యార్థికి ఇవ్వాలి: సాయి శ్రీనివాస్, అధ్యక్షుడు, ఎస్టీయూ
‘మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశం విద్యార్థికి ఇవ్వాలి. తెలుగు, ఆంగ్ల మాధ్యమం పిల్లల్ని కలిపి ఒకే తరగతిలో కూర్చోబెట్టి ఆంగ్లంలో బోధిస్తే పాఠాలు అర్థంకాక వెనకబడిపోతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు రెండు మాధ్యమాలను కొనసాగించాలి’
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!
‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!
‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.