మౌలిక వసతులు లేక ఈ ఏడాది ప్రవేశాల రద్దు
న్యూస్‌టుడే, లేబర్‌కాలనీ: వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఈఏడాది మొదటి సంవత్సర ప్రవేశాలు నిలిచిపోయాయి. అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లేమి కళాశాలకు శాపంగా పరిణమించాయి. కేంద్రం అధీనంలో పని చేసే దిల్లీలోని నేషనల్ కమిషనర్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్(ఎన్సీఐఎస్ఎం) ప్రవేశాలు ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇదే విధంగా ఉంటే.. మూతపడే పరిస్థితి ఎంతో దూరంలో లేదు. హైదరాబాద్ తరువాత అంతటి చరిత్ర కలిగిన వరంగల్‌లో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, కళాశాల అందుబాటులో ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరం.
‣ వరంగల్ లేబర్ కాలనీలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు 2023 విద్యా సంవత్సరం సీట్ల రద్దుకు అనేక కారణాలున్నాయి. కళాశాలలో విద్యా బోధనకు సరిపడా అధ్యాపకులు లేక పోవడం, కళాశాలలో మౌలిక సదుపాయాల కొరత అడ్డంకులుగా మారాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్న కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు. దీంతో 2023 విద్యా సంవత్సరం సీట్ల రద్దుకు ఎన్సీఐఎస్ఎం నిర్ణయం తీసుకుంది. 2014లోనే ఈ కళాశాలకు సీట్ల కేటాయించే విషయంలో సంస్థ అభ్యంతరాలు తెలిపింది. కళాశాల తీరు మార్చుకుంటామని హామీ ఇచ్చి ఎనిమిదేళ్లుగా అనుమతులు సాధిస్తూ వచ్చారు. కళాశాలలో అధ్యాపకుల పెంపు, సౌకర్యాల కల్పన వంటి ఏ విషయంలోనూ మార్పు రాకపోవడంతో ఈ ఏడాది సీట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 63 మంది విద్యార్థులు బీఏఎంఎస్‌లో చేరే సదవకాశాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
ఇతర సౌకర్యాలూ కరవే..
బస్ సౌకర్యం లేకపోవడం.. గ్రంథాలయంలో పుస్తకాల కొరత విద్యార్థులను వేధిస్తోంది. చిన్న గదులు అందుబాటులో ఉన్నా ఒక గదిలో 40 మంది కూడా కూర్చునే అవకాశం లేదు. ప్రస్తుతం 150 మంది విద్యార్థులున్న కళాశాలలో ఒకటే వాష్‌రూం అందుబాటులో ఉంది. వాచ్మెన్ లేడు. కశాశాలలోకి పందులు, కుక్కలు యథేచ్ఛగా వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కళాశాలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహంలో స్నానాల గదులకు తలుపులు లేవు. బాలురు, బాలికల వసతి గృహాల్లో వంటవారి నుంచి వంటసామగ్రి, వంట సామాను వరకు అన్ని విద్యార్థులే తెచ్చుకోవాలి. విద్యాబోధనకు పరికరాలు లేవు. మైక్రోస్కోప్, బ్లౌజులు, డెడ్‌బాడీ పరిరక్షణకు రసాయనాలు అందుబాటులో లేవు. కళాశాల పరిసర ప్రాంతాలలో విద్యార్థినులు పోకిరీల బెడదతో అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ చేయూత అవసరం
వరంగల్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన విషయంలో పదేళ్లుగా సమస్యలు వేధిస్తున్నా ప్రభుత్వం దృష్టి సారించలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండానే నడిపిస్తూ వచ్చింది. ఈ ఏడాది సీట్ల రద్దు అంశం ముందుగా తెలిసినా, ప్రభుత్వం నుంచి తక్షణ చర్యలు కానరాలేదు. కళాశాల ప్రిన్సిపల్ రవీందర్‌గౌడ్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణం చర్యలు చేపడితే అమూల్యమైన ఆయుర్వేద వైద్య విద్యకు వరంగల్ కేరాఫ్‌గా నిలవనుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.