దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘పంచ్ ప్రాణ్’ పేరిట సూచించిన అయిదు సంకల్పాలు, పర్యావరణ హిత జీవనశైలి (లైఫ్) స్ఫూర్తిని ఉన్నతవిద్యలోకి తీసుకువచ్చేలా విధానాలు రూపొందించాలని యూజీసీ ఉన్నత విద్యాసంస్థలను కోరింది. దేశం అమృత కాలంలోకి ప్రవేశిస్తున్నదని, రాబోయే పాతికేళ్ల ప్రణాళికలో భాగంగా ప్రధాని ఈ సూచనలు చేశారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకువెళ్లడం, బానిస జీవనం తాలూకు జాడలను తుడిచిపెట్టడం, భారత వారసత్వాన్ని సగర్వంగా చాటడం, సమైక్యత.. సంఘీభావ బలం ప్రదర్శించడం, జాతి నిర్మాణంలో పౌరుల పాత్రలను ప్రధాని ‘పంచ్ ప్రాణ్’గా అభివర్ణించారు. అలాగే పర్యావరణ హిత జీవనశైలి (లైఫ్) ద్వారా మన గ్రహానికి హాని కలిగించని విధంగా అందరూ జీవించాలని ప్రధాని కోరారు. మన గ్రహం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం నేటి తక్షణావసరమని యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ ఉన్నత విద్యాసంస్థలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ దిశగా చేసిన కృషిని, రూపొందించిన విధానాలను యూజీసీకి చెందిన యూనివర్సిటీ యాక్టివిటీ మానిటరింగ్ పోర్టల్ (యూఏఎంపీ) ద్వారా పంచుకోవాలని ఆయన కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.