తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక విద్యాలయం
గ్రామస్థులు, దాతల సహకారంతో అభివృద్ధి
ఇక్కడి చిత్రాల్లో కార్పొరేట్ పాఠశాలను తలపించేలా.. అన్ని రకాల సొబగులతో ఆకట్టుకుంటుంది విజయనగరం జిల్లా కేంద్రంలోని పరిధిలోని జమ్ము ప్రాథమిక పాఠశాల. మన బడిని మనమే చక్కదిద్దుకుందాం అనే లక్ష్యంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు, దాతల సహకారంతో అభివృద్ధికి సంకల్పించారు. ఆ సంకల్పమే ఇప్పుడు స్వచ్ఛ పురస్కారాన్ని సాధించేలా చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓవరాల్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయస్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. నవంబరు 19న దిల్లీలో పురస్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం అయిదు తరగతుల్లో 72 మంది చదువుతున్నారు. 2014లో వచ్చిన హుద్‌హుద్ తుపానుతో తరగతి గదులు.. పచ్చని చెట్లు నేలమట్టమయ్యాయి. ఏడాది పాటు ఒకే గదిలో తరగతులు జరిగేవి. దీంతో గ్రామస్థులు స్పందించారు. దాతలు, ప్రజాప్రతినిధుల సహకారంలో ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.6 లక్షల వరకు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ పథకాలతో అదనపు సౌకర్యాలు సమకూరాయి. చిన్నారులు ఆటలు ఆడుకునేందుకు ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేశామని ప్రధానోపాధ్యాయుడు మంత్రి రామ్మోహనరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఈ పాఠశాలకు గతంలోనూ పలు అవార్డులు వచ్చాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.