• facebook
  • whatsapp
  • telegram

School Students: డ్రాపౌట్లలో 11వ స్థానంలో తెలంగాణ‌

‘2021-22 యూడైస్‌’ను విడుదల చేసిన కేంద్రం
ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల్లో ప్రవేశం పొందుతున్న విద్యార్థులు 9, 10 తరగతులు దాటకుండానే బడి మానేస్తున్నారు. రాష్ట్రంలో ఇలా 13.70 శాతం మంది అర్ధాంతరంగా చదువుకు స్వస్తి పలుకుతున్నారు. మన కంటే ఎక్కువ డ్రాపౌట్లు ఉన్న రాష్ట్రాలు 10 ఉన్నాయి. 2021-22 విద్యా సంవత్సరం ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ(యూడైస్‌)ను కేంద్ర విద్యాశాఖ న‌వంబ‌రు 3న‌ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలు, సౌకర్యాలు, ఉపాధ్యాయులు, డ్రాపౌట్‌ శాతం తదితర అంశాలను అందులో పొందుపరిచారు. తెలంగాణ కంటే ఒడిశా( 27.3), మేఘాలయ(21.7), బిహార్‌(20.5), అస్సాం(20.3), పశ్చిమ్‌బెంగాల్‌(18), గుజరాత్‌(17.9), నాగాలాండ్‌( 17.5), పంజాబ్‌(17.2), ఏపీ(16.3),  కర్ణాటక(14.70)లలో డ్రాపౌట్‌ శాతం ఎక్కువ ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న పాఠశాలలు 30,023 ఉండగా వాటిల్లో కంప్యూటర్‌ సౌకర్యం ఉన్నవి 8,296 మాత్రమే (27.63 శాతం). అంతకంటే తక్కువ శాతం కంప్యూటర్‌ సౌకర్యం ఉన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 11 ఉన్నాయి.
రాష్ట్రంలో కేవలం 2,772 ప్రభుత్వ బడుల్లోనే ఇంటర్‌నెట్‌ సౌకర్యం(9.2 శాతం) ఉంది. ఈ విషయంలో మనకంటే వెనుకబడిన రాష్ట్రాలు యూపీ(8.8), ఒడిశా(8.1), మిజోరం(6), బిహార్‌(5.9) మాత్రమే.
27.4 శాతం ఉన్నత పాఠశాలల్లోనే సైన్స్‌ ల్యాబ్‌లున్నాయి. ఈ అంశంలో కేవలం మూడు రాష్ట్రాలే తెలంగాణ కంటే వెనుక ఉన్నాయి.
752 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోనే డిజిటల్‌/స్మార్ట్‌ బోర్డులు/వర్చువల్‌ తరగతుల సౌకర్యం ఉంది.
2020-21తో పోల్చుకుంటే ఇదీ తేడా..
ఈ సారి ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య 1,827 పెరిగింది. మొత్తం మీద 166 పాఠశాలలు పెరిగాయి. పూర్వ ప్రాథమిక నుంచి ఇంటర్‌ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో 4,06,725 మంది పెరగ్గా.. ప్రైవేట్‌లో 4,50,012 మంది తగ్గారు. కరోనా కారణంగా ఫీజులు చెల్లించలేక ప్రైవేట్‌ నుంచి సర్కారు బడుల్లో చేరడమే అందుకు కారణమని భావిస్తున్నారు. 2020-21లో 9, 10 తరగతుల్లో డ్రాపౌట్‌ రేట్‌ 13.9 శాతం ఉండగా ఈ సారి 0.2 శాతం తగ్గడం విశేషం.
రాష్ట్రంలో పరిస్థితి(ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి.. ఇంటర్‌ వరకు)
‣ పాఠశాలలు, కళాశాలల సంఖ్య: 43,083
 విద్యార్థుల సంఖ్య: 69,15,241(ప్రభుత్వ-33,03,699, ఎయిడెడ్‌-90,601, ప్రైవేట్‌-35,14,338.. ఇతర..)
 ఉపాధ్యాయులు: 3,20,894(వారిలో 1,40,295 మంది ప్రభుత్వ టీచర్లు)
 పురుష, మహిళా టీచర్లు: 1,26,479; 1,94,415
‣ విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి: 22 (ప్రతి 22 మందికి ఒక టీచర్‌)
 సగటున ప్రతి బడికి విద్యార్థుల సంఖ్య: 161
‣ లైబ్రరీ/ బుక్‌ బ్యాంక్‌/రీడింగ్‌ కార్నర్‌ ఉన్న బడులు: 39,510
 ఆట స్థలాలున్న పాఠశాలలు: 31,716
 డిజిటల్‌ లైబ్రరీలు: 772 (అందులో 236 ప్రభుత్వ పాఠశాలలు)
‣ కిచెన్‌ గార్డెన్లు( బడుల్లో తోటల పెంపకం): 4,243
 బాలికల శౌచాలయాలున్న బడులు: 38,802 (వాటిల్లో పనిచేసేవి 33,428)
 బాలుర శౌచాలయాలు: 34,643 (వాటిల్లో పనిచేస్తున్నవి 29,136)
 విద్యుత్తు కనెక్షన్లు: 40,437 (సరఫరా ఉన్నది 38,920)
‣ సౌర విద్యుత్తు: 2011
‣ అంతర్జాల సౌకర్యం: 9,887 (వాటిల్లో 2772 ప్రభుత్వ బడులు)
‣ పూర్వ ప్రాథమిక తరగతులున్న బడులు: 6835 (ప్రభుత్వ బడుల్లో 1061 చోట్ల)
పాఠశాలల పనితీరులో కింది నుంచి 7వ స్థానం
రాష్ట్రానికి 754 పాయింట్లు
2020-21 పీజీఐ నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల పనితీరులో రాష్ట్రం పేలవ ప్రదర్శన చూపింది. అయిదు కొలమానాల ఆధారంగా వెయ్యి పాయింట్లకు 754 సాధించిన తెలంగాణ.. కింది నుంచి 7వ స్థానాన్ని దక్కించుకుంది. అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, సమానత్వం, ప్రభుత్వ పాలన(గవర్నెన్స్‌), విద్యార్థుల నమోదు అనే అయిదు అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా పనితీరు గ్రేడింగ్‌ సూచిక (పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ గ్రేడ్‌-పీజీఐ) ఇస్తున్న విషయం తెలిసిందే. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన నివేదికను న‌వంబ‌రు 3న‌ విడుదల చేసింది. రాష్ట్రం 754 పాయింట్లు మాత్రమే సాధించింది. అంతకంటే తక్కువ పాయింట్లు పొందిన రాష్ట్రాలు కేవలం ఆరు మాత్రమే కాగా.. అవి సిక్కిం(751), మణిపుర్‌(741), నాగాలాండ్‌(728), ఉత్తరాఖండ్‌(719), మేఘాలయ( 716), అరుణాచల్‌ ప్రదేశ్‌(669). మన రాష్ట్రం 2018-19లో 757, 2019-20లో 772 పాయింట్లు  పొందింది. ఈసారి పాయింట్లు తగ్గడం గమనార్హం. ఏకోపాధ్యాయ పాఠశాలలు, సిబ్బంది ఖాళీలు, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, పర్యవేక్షించే వారు లేకపోవడం లాంటి పలు లోపాల వల్ల పాయింట్లు తగ్గాయి. కేరళ, మహారాష్ట్రలు 928 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.