• facebook
  • whatsapp
  • telegram

MOU: బైజూస్‌తో ఒప్పందం.. ఉపాధ్యాయులకు సంకటం

విద్యార్థుల ఫోన్‌ నంబర్లు నమోదు చేయలేదంటూ చర్యలు

ఈనాడు, అమరావతి: బైజూస్‌ సంస్థతో పాఠశాల విద్యాశాఖ కుదుర్చుకున్న ఒప్పందం ఉపాధ్యాయులకు గుదిబండగా మారింది. బైజూస్‌ కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇచ్చేందుకు విద్యార్థుల ఫోన్‌ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదనే కారణంతో ఉపాధ్యాయులకు విద్యాశాఖ షోకాజ్‌ నోటీసులు జారీచేస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలకు ఆన్‌లైన్‌ తరగతులు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కావని తెలిసినా ప్రభుత్వం... విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ అందించేందుకు ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తోంది. 5-10 తరగతి వరకు బైజూస్‌ కంటెంట్‌ను అందిస్తున్న ప్రభుత్వం ఎనిమిదో తరగతి వారికే  ట్యాబ్‌లను అందిస్తోంది. మిగతా వారికి ఎలాంటి ఉపకరణాలూ ఇవ్వడం లేదు. ఇంటివద్ద ఉండే ఫోన్లలోనే బైజూస్‌ కంటెంట్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు డౌన్‌లోడ్‌ చేసి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ వద్దనున్న విద్యార్థుల ఫోన్‌ నంబర్ల వివరాలను ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయులకు పంపించింది. వీటిల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించింది. స్మార్ట్‌ఫోన్లు ఎంతమందికి ఉన్నాయనే వివరాలను నమోదు చేయాలని తెలిపింది. సెల్‌ఫోన్ల వివరాలను నమోదు చేయలేదనే కారణంతో ఇప్పుడు షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారు.
ఫోన్లు లేకపోతే ఏం చేయాలి?
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న కొంతమందికి స్మార్ట్‌ఫోన్లు లేవు. ఇలాంటి వారి వివరాలను సేకరించడం ఉపాధ్యాయులకు కష్టంగా మారింది. కొందరికి సాధారణ ఫోన్లు ఉన్నాయి. వీటి విషయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తల్లిదండ్రులు పనుల నిమిత్తం వలసలు వెళ్లిపోతారు. పిల్లల్ని ఇంటి దగ్గర ఉండే వృద్ధుల, బంధువుల ఇంటి వదిలి వెళ్తారు. పిల్లలు అక్కడి నుంచే పాఠశాలలకు వస్తారు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు అప్‌డేట్‌ చేయడానికి వివరాలు లభించని పరిస్థితి. కానీ, ఉన్నతాధికారులు మాత్రం వివరాలు నమోదు చేయడంతోపాటు బైజూస్‌ కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసి, ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైజూస్‌ కంటెంట్‌ను ఫోన్లలో వినాలంటే ఇంటర్నెట్‌ సదుపాయం కావాలి. ఇందుకు నెలకు ఇంటర్నెట్‌కు అదనంగా రూ.200 వ్యయం చేయాల్సిన దుస్థితి.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పీజీ విద్యార్థినుల‌కు యూజీసీ ప్రోత్సాహం

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ మైనారిటీ బాలిక‌ల‌కు ఉప‌కార వేత‌నాలు

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఉద్యోగ సంస్థల్లో ఆన్‌లైన్‌ శిక్షణ

‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.