పరీక్ష సమయం 4 గంటలు
విద్యాశాఖ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే ప్రత్యేక అవసరాల పిల్లలు (సీడబ్ల్యూఎస్ఎన్) వార్షిక పరీక్షల్లో 100కు 20 మార్కులు సాధిస్తే చాలు.. ఉత్తీర్ణులైనట్లే. అందులోనూ ఆటిజం, మానసిక వ్యాధులతో బాధపడేవారు 10 మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లుగానే పరిగణిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నవంబరు 7న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యాసంవత్సరం (2022-23) నుంచే ఉత్తీర్ణత మార్కులతో పాటు వారికి మరికొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో అంధులు, చెవిటి, మూగ విద్యార్థులతోపాటు సెరిబ్రల్ పాల్సీ, తలసేమియా తదితర 21 విభాగాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఊరట కలిగినట్లయింది. రాష్ట్రంలో 6-10 తరగతుల్లో ప్రత్యేక అవసరాల పిల్లలు 22,315 మంది ఉన్నట్లు తాజా యూడైస్ నివేదిక వెల్లడించింది. వారికి పరీక్ష రాసే సమయం కూడా పెంచారు. సాధారణ విద్యార్థులకు పరీక్ష సమయం 3 గంటలు మాత్రమే. సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు గంటకు 20 నిమిషాల చొప్పున 60 నిమిషాలు అదనంగా (మొత్తం 4 గంటలు) సమయం కేటాయిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులే వారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు.
మరికొన్ని మినహాయింపులు:
‣ పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్లకు అనుమతి.
‣ ప్రత్యేక జవాబు పత్రాల అందజేత.
‣ మూడు భాషా సబ్జెక్టుల్లో ఒక దానికి మినహాయింపు. అంటే తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ఏదైనా ఒక దాన్ని చదవకుండా, పరీక్ష రాయకుండా మినహాయింపు.
‣ పరీక్ష రుసుం ఉండదు.
‣ తరగతులకు 50 శాతం హాజరు ఉంటే పరీక్షలు రాయవచ్చు. కేటగిరీల వారీగా మరికొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.