కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల హుకుం
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్‌టుడే, ఉప్పల్: కూకట్‌పల్లికి చెందిన రమేశ్‌కు ఇద్దరు కుమారులు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో 5, 7 తరగతులు చదువుతున్నారు. రెండో విడత ఫీజు రూ.13వేలు చొప్పున చెల్లించలేదని పాఠశాల యాజమాన్యం పరీక్షలు రాయించబోమంటోంది. నాలుగు రోజుల్లో చెల్లిస్తానని రమేశ్ చెప్పినా.. పాఠశాల యాజమాన్యం కరుణించడంలేదు.
‣ ప్రైవేటు పాఠశాలలు మళ్లీ ఫీ‘జులుం’కు తెరలేపాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 70 శాతం ఫీజులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నాయి. నగరంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజుల వసూళ్లకు పరీక్షలను లంకె పెడుతున్నాయి. నేటి నుంచి ఎస్ఏ-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఈనెల ఒకటినుంచే ప్రారంభం కావాల్సి ఉన్నా, విద్యాశాఖ వాయిదా వేసింది. ఈ పరీక్షలు రాయాలంటే ఫీజులు కట్టాల్సిందేనని పాఠశాలలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరీక్షలు రాయాలంటే రెండు విడతల ఫీజులు చెల్లించాలని చెబుతున్నాయి. పాఠశాలల హుకుంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పర్యవేక్షణేది..?
నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ఫీజుల నియంత్రణకు గతంలో తిరుపతిరావు కమిటీ వేయగా.. చేసిన సూచనలు అమల్లోకి రాలేదు. మార్గదర్శకాలు లేకపోవడంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయి.
కళాశాలలదీ అదే దారి
ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనిచ్చేది లేదని జూనియర్ కళాశాలలు చెబుతున్నాయి. ఉప్పల్ సమీపంలోని ఓ కళాశాల విద్యార్థులను హాస్టల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. నగరం, శివారుప్రాంతాల్లో 220 జూనియర్ కళాశాలున్నాయి. వివిధ ప్రాంతాల విద్యార్థులను తల్లిదండ్రులు రెసిడెన్షియల్లో చదివిస్తుంటారు. ట్యూషన్ ఫీజు, విడిగా హాస్టల్ ఫీజు వసూలు చేస్తారు. ఇప్పుడు రెండోటర్మ్ ఫీజు కడితేనే హాస్టల్లో ఉండనిస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. టర్మ్ పరీక్షలు రాయనిచ్చేది లేదని బెదిరిస్తున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.