• facebook
  • whatsapp
  • telegram

Medical Education: వైద్య విద్యలో నూతన శకం

ఒకేసారి 8 కొత్త కళాశాలలు అందుబాటులోకి..
ఈ ఏడాది నుంచే తరగతులు
నేడు ప్రారంభించనున్న సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్యవిద్య పరుగులు పెడుతోంది. ఒకే ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాకో వైద్య కళాశాలను నెలకొల్పాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం సాకారమయ్యే దిశగా మరో అడుగు పడుతోంది. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, రామగుండం వైద్య కళాశాలల్లో 2022-23 వైద్యవిద్య సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా 1,150 సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. నూతన వైద్య కళాశాలల్లో తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి ఆన్‌లైన్‌లో ఒకేసారి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన ఎల్‌ఈడీ తెరలను ఆయా వైద్య కళాశాలల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు.
8 ఏళ్లలో 12 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఉస్మానియా(1946), గాంధీ(1954) వైద్య కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించే నాటికే ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1959లో కాకతీయ వైద్య కళాశాల.. అనంతరం ఆదిలాబాద్‌లో రిమ్స్‌, నిజామాబాద్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పారు. తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం జిల్లాకొక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. మొదటి దశలో మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటలో అందుబాటులోకి వచ్చాయి. రెండో దశలో ఈ ఏడాది నుంచే మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, సంగారెడ్డి కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గడిచిన ఎనిమిదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. వచ్చే ఏడాది 9, ఆ మరుసటి సంవత్సరం మరో 8 ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపింది.
పేదలకు చేరువగా స్పెషాలిటీ వైద్యం
జిల్లాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో.. ప్రజలు హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడం ద్వారా రానున్న రోజుల్లో వీటిలో పీజీ వైద్య సీట్లు వస్తాయి. సూపర్‌ స్పెషాలిటీ సేవలు కలుపుకొని.. మొత్తం 35 విభాగాలు సేవలందిస్తాయి. 24 గంటలూ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు లభిస్తాయి. ప్రతి బోధనాసుపత్రిలోనూ సుమారు 449 మంది వైద్యులు, 600 మందికి పైగా పారామెడికల్‌ సిబ్బంది ఉంటారు. స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం కొంతమేరకైనా తగ్గుతుంది. చైనా, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలకు వెళ్లి.. రూ.లక్షలు ఖర్చు పెట్టి వైద్యవిద్య అభ్యసించే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. వైద్య కళాశాలలకు అనుబంధంగా అనేక వసతులు ఏర్పడతాయి. బోధనాసుపత్రి అభివృద్ధి చెందుతుంది. కొత్తగా మానవ వనరుల అవసరం ఏర్పడి.. నూతన నియామకాలు చేపడతారు. స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
వైద్య విప్లవానికి తెలంగాణ శ్రీకారం: మంత్రి హరీశ్‌రావు
దేశంలోనే వైద్య రంగంలో నూతన విప్లవానికి తెలంగాణ శ్రీకారం చుట్టబోతోంది. మంగళవారం ఒకేసారి 8 వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం కాబోతుండటం దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టం. మెడికల్‌ కాలేజీలు లేక, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజలు ఎన్నో కష్టాలు పడేవారు. ఏదైనా పెద్ద వ్యాధి వస్తే చికిత్స కోసం హైదరాబాద్‌కు పరిగెత్తాల్సి వచ్చేది. వందల కిలోమీటర్లు, గంటలపాటు ప్రయాణించి రాజధానికి చేరుకుని.. వారాలు, నెలల పాటు ఉండాల్సి వచ్చేది. కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోవడంతో పాటు తీవ్ర అవస్థల పాలయ్యేవి. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కష్టాలను కళ్లారా చూశారు. దేశవ్యాప్తంగా కేంద్రం 157 వైద్య కళాశాలలు ఇచ్చినా తెలంగాణకు మొండిచేయి చూపింది. రాష్ట్రానికి ఒక్కటీ మంజూరు చేయలేదు. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలను చేరువ చేయడంతో పాటు విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. కొత్తగా బోధనాసుపత్రుల రాకతో ఇకనుంచి పెద్ద వ్యాధులకూ సమీపంలోనే నాణ్యమైన వైద్యం అందుతుంది. వచ్చే రెండేళ్లలో అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలను నెలకొల్పడానికి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.