ఈనాడు, మచిలీపట్నం: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా ఉంటోంది. చాలా కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం.. జీరోకు చేరింది. కేవలం రిజిస్టర్లలో మాత్రమే విద్యార్థులు కనిపిస్తారు. ఎవరూ కళాశాలలకు రారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులను సైతం విచ్చలవిడిగా చేర్చేసుకుంటున్నారు. వారు చేరినప్పుడే కళాశాలకు రావాల్సిన అవసరం లేదని, తామే హాజరు వేయించేస్తామనే ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. డిసెంబర్ 1 నుంచి ఫేస్ రికగ్నేషన్ పద్ధతిలో విద్యార్థుల హాజరు తప్పనిసరిగా అమలు చేయాలనడం ఇబ్బందిగా మారింది. ఎలాగైనా ఈ నిబంధనను మార్పించాలని కళాశాలల నిర్వాహకులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.’
‣ కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో 22 బీఈడీ కళాశాలలున్నాయి. వీటిలో కొన్ని కళాశాలలో 50, మరికొన్నింటిలో వంద వరకూ విద్యార్థులకు అనుమతి ఉంది. రెండేళ్లకు కలిపితే.. 100 నుంచి 200 ఉంటారు. మొత్తంగా మూడు వేల మంది వరకూ విద్యార్థులుంటారు. కానీ.. ఈ కళాశాల్లో చాలావాటిలో అసలు విద్యార్థులు కనిపించరు. కేవలం పరీక్షల సమయంలోనే విద్యార్థులు వచ్చి రాసి వెళ్లిపోతారు. ఆ ప్రశ్నపత్రాల మూల్యాంకనం సైతం అవకతవకలుగా జరుగుతుంది. వేల మందికి సంబంధించిన ప్రశ్నపత్రాలను కేవలం మూడే రోజుల్లో దిద్దేసి వెళ్లిపోతుంటారు. విద్యార్థులు ఏం రాశారు అనేది చూసే పరిస్థితే ఉండదు. ఒక్కో పేజీకి పలానా ఇన్ని మార్కులని వేసేస్తుంటారు. అందుకే.. బీఈడీలో చేరితే చాలు కళాశాల ముఖం చూడకుండానే ఉత్తీర్ణులైపోతారు.
రెండేళ్ల కోర్సుగా మారిన తర్వాతే..
2014 నుంచి బీఈడీ రెండేళ్ల కోర్సుగా మారింది. అంతకుముందు ఒక ఏడాది మాత్రమే ఉండేది. రెండేళ్ల కోర్సుగా మారిన తర్వాత నుంచి ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో చాలా యాజమాన్యాలు పక్కరాష్ట్రాల నుంచి విద్యార్థులను తెచ్చి చేర్చుకోవడం ఆరంభించాయి. హాజరు వేసేందుకు రూ.10 నుంచి రూ.15వేలు అదనంగా తీసుకోవడం మొదలుపెట్టారు. ఒక్క విద్యార్థి కూడా రాని కళాశాలలు చాలానే ఉన్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు రాకపోవడంతో.. కళాశాలలకు నిర్వహణ వ్యయం కూడా ఏమీ ఉండదు. పైగా.. వాళ్లు రానందుకు అదనంగా హాజరు వంటి వాటి కోసం వసూళ్లు చేసుకుంటున్నారు.
కొందరికే పరిమితం చేయాలనే ప్రయత్నం..
తాజాగా ఫేస్ రికగ్నేషన్ ప్రకంపనలు బీఈడీ కళాశాలల్లో మామూలుగా లేవు. విద్యార్థులు ఖచ్చితంగా కళాశాలకు రావాల్సి ఉంటుంది. దీంతో ప్రవేశాలు భారీగా తగ్గిపోతాయి. విద్యార్థులు తగ్గిపోవడంతో పాటు తమకు వచ్చే అదనపు ఆదాయం కూడా ఆగిపోతుంది. ఫేస్ రికగ్నేషన్ హాజరుకు ఫీజు రీయంబర్స్మెంట్ను కూడా ప్రభుత్వం అనుసంధానం చేసింది. ఏటా ఒక్కో విద్యార్థికి రూ.12వేల నుంచి రూ.15 వేల వరకూ బోధనరుసుం కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. ఖచ్చితమైన హాజరు అంటే అసాధ్యం కావడంతో బోధనరుసుం ఆగిపోతుంది. పైగా.. హాజరు లేకపోతే.. పరీక్షలకు కూడా అనుమతించేది లేదని విద్యాశాఖ చెబుతోంది. ప్రస్తుతం ఈ నిబంధన అమలు జరగకుండా చేసేందుకు పలు రకాల మార్గాలను కళాశాలల యాజమాన్యాలు వెతుకుతున్నాయి. దీనిలో భాగంగా.. కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా చేరే విద్యార్థులకు మాత్రమే.. ఫేస్ రికగ్నేషన్ను అమలు చేయాలనే ప్రతిపాదన కూడా ముందుకు తెచ్చాయి. మేనేజ్మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు ఈ నిబంధన లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కన్వీనర్ కోటా వారికే ఫీజు రీయంబర్స్మెంట్ ఉంటుంది కనుక..మిగతా వారిని ఈ హాజరు పరిధిలోనికి తేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ.. దీనిపై కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి ఇప్పటికే తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఫీజు వాళ్లే కడుతున్నారా, తాము కట్టడం లేదా అని నిలదీస్తున్నారు. ప్రభుత్వం కడితే మాత్రం డబ్బులు కాదా.. అని అడుగుతున్నారు. విద్యార్థుల్లో కొందరు కళాశాలకు రావాల్సిన పనిలేదని, మిగతా వాళ్లు మాత్రం రావాలని నిబంధన పెడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. కళాశాలలకు రావాల్సిన పనిలేదంటూ.. ఇప్పటికే చేర్చుకున్న విద్యార్థులను ఎలా రప్పించాలనేదే.. ఇప్పుడు యాజమాన్యాలకు అతిపెద్ద తలనొప్పిగా మారింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.