నిబంధనలను సడలించిన యూజీసీ
ఈనాడు, హైదరాబాద్: డీమ్డ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు మరింత సులభతరం కానుంది. నిబంధనలను సడలిస్తూ యూజీసీ ఇటీవల ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో డీమ్డ్ విశ్వవిద్యాలయాల సంఖ్య దేశంలో భారీగా పెరగనుంది. ఇప్పటివరకు కళాశాలలు డీమ్డ్ వర్సిటీలుగా మారాలంటే వాటిని ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు పూర్తికావాలి. మూడు సార్లు వరుసగా న్యాక్ ‘ఏ’ ప్లస్ గ్రేడ్తోపాటు 4 పాయింట్లకు కనీసం 3.26 పాయింట్లు సాధించాలి. అత్యంత ముఖ్యమైన ఈ నిబంధనలను మారుస్తూ యూజీసీ ఇటీవల ముసాయిదాను విడుదల చేసింది. వాటిపై అభిప్రాయాలను, సూచనలను పంపే గడువు ముగిసినందున త్వరలోనే గెజిట్ జారీ చేయనుంది. ఇప్పటివరకు డీమ్డ్ వర్సిటీల అనుమతి కఠినతరంగా ఉండటం వల్ల చాలా రాష్ట్రాల్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలుగా తమ కళాశాలలను మారుస్తున్నారు. ఇక నుంచి అవి కూడా డీమ్డ్ వైపు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 440 వరకు ప్రైవేట్ వర్సిటీలు ఉండగా...170 వరకు డీమ్డ్ విశ్వవిద్యాలయాలున్నాయి.
న్యాక్ పాయింట్ల తగ్గింపు
ఇప్పటికే నడుస్తున్న కళాశాలలు డీమ్డ్ వర్సిటీగా మారాలంటే పాటించాల్సిన నిబంధనలను యూజీసీ తాజా ముసాయిదాలో పేర్కొంది. ఇక న్యాక్ పాయింట్లు 3.01 వస్తే చాలు. అంటే వరుసగా మూడు సార్లు న్యాక్ ‘ఏ’ గ్రేడ్ పొందితే దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాల ఏర్పాటై 20 సంవత్సరాలు నిండాలన్న నిబంధనను 15ఏళ్లకు కుదించారు. విదేశాల్లోనూ ప్రాంగణాలు పెట్టుకోవచ్చు. కొన్ని ప్రభుత్వ లేదా ఒకే గ్రూపులోని ప్రైవేట్ కళాశాలలు కలిపి కూడా డీమ్డ్ వర్సిటీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కళాశాలలకు అర్హత
వరుసగా మూడు సార్లు న్యాక్ ‘ఏ’ గ్రేడ్ పొందిన ఇంజినీరింగ్ కళాశాలలు ఏపీలో 15, తెలంగాణలో 10 వరకు ఉంటాయని కళాశాలల వర్గాలు చెబుతున్నాయి. వాటితోపాటు డిగ్రీ, ఎయిడెడ్ కళాశాలలు కూడా మరికొన్ని ఉండొచ్చని చెబుతున్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లో డీమ్డ్ వర్సిటీలుగా మారేందుకు కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ఆసక్తి చూపుతున్నాయ’ని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అఖిల భారత ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ భూపాలం అభిప్రాయపడ్డారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.