యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కార్యక్రమంలో ప్రదర్శన
బహుమతులు గెలుచుకుని సత్తాచాటిన విద్యార్థినులు
రాయదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల నూతన ఆవిష్కరణల పోటీల్లో అమ్మాయిలు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల మండలి (టీఎస్ఐసీ), ఇన్‌క్వి ల్యాబ్ ఫౌండేషన్, వై-హబ్, యువా, యునిసెఫ్ సంస్థలు సంయుక్తంగా ‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’ పేరిట నిర్వహించిన పోటీలో తొలి మూడు బహుమతులతో పాటు ప్రత్యేక బహుమతి మహిళా కళాశాలలకే దక్కాయి. రైతులు, కార్మికులు, ప్రజలు ఎదర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏదో ఒకటి చేయాలని సంకల్పించి, ఆ మేరకు తమ ఆలోచనలకు పదునుపెట్టారు. రాష్ట్రంలోని 490 కళాశాలల్లోని 11,823 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో విద్యార్థి బృందాల నుంచి 824 ఆలోచనలు కమిటీకి అందాయి. తుదిదశకు 10 డిగ్రీ, పాలిటెక్నిక్, ఎస్సీ గురుకుల కళాశాలల విద్యార్థుల ఆవిష్కరణలు ఎంపికయ్యాయి. బుధవారమిక్కడ టీ-హబ్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు.
కర్షకుడికి మేలు చేసే రైతన్న కిట్ (మొదటి బహుమతి)
వరంగల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఈసీఈ ద్వితీయ విద్యార్థినులు చందన, శ్వేతారెడ్డి, లహరిక కలిసి రైతన్న కిట్‌ను ఆవిష్కరించారు. ధాన్యం ఆరబెట్టడమేకాక వర్షం నుంచి రక్షణకు సరికొత్తగా టార్పాలిన్ రూపొందించారు. వర్షం వచ్చినప్పుడు జిప్ లాగి ఆ సంచిని మూసివేయచ్చు. 18 నుంచి 20 అడుగుల విస్తీర్ణంలో భారీ సంచిలా దీన్ని తయారు చేశారు. ఎలుకలు వాటికి రంధ్రాలు చేయకుండా హెర్బల్ ర్యాట్ రెపల్లెంట్ను ఉంచారు. ధాన్యం కుప్ప చేసేందుకు వాడే పారతో టార్పాలిన్ దెబ్బతినకుండా ఈ కిట్‌ను రూపొందించారు.
బొగ్గు గని కార్మికులకు భరోసా.. సురక్షా పరికరం (రెండో బహుమతి)
హైదరాబాద్ నిజాంపేట్‌కు చెందిన బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన దీపిక, విజ్ఞ, గ్రాహ్య, ప్రవళి కలిసి బొగ్గు గని కార్మికుల భద్రతకు బైట్ సిస్టం(సురక్షా పరికరం) పేరిట సృజనాత్మక పరికారాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంలో లోరా వైడ్ఏరియా పేరిట సరికొత్త అంతర్జాల వ్యవస్థ.. దానికి సురక్షా పరికరం, పైన బేస్ స్టేషన్‌లోని కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. ఆ పరికరాన్ని కార్మికులు జేబులకు పెట్టుకుని గనిలోకి వెళ్లాలి. ప్రమాదం జరిగినప్పుడు ఆ పరికరానికి ఉండే మీటను నొక్కిన వెంటనే బేస్ స్టేషన్‌లోని తెరపై కార్మికుడు ఎక్కడ ఉన్నారు? లొకేషన్‌తో సహా ప్రత్యక్షమవుతుంది. వెంటనే అక్కడికి సిబ్బంది చేరుకుని సహాయం అందించొచ్చు. భూగర్భంలోనూ సిగ్నల్స్ అందుకోవడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.
ధాన్యాలకు పురుగు పట్టకుండా మాత్రలు (తృతీయ బహుమతి)
బియ్యం, పప్పులు తదితర ధాన్యాలకు పురుగు పట్టకుండా ఉండేందుకు వరంగల్ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఉమామహేశ్వరి, శన్విత, స్టెల్లా అఫ్రిన్ కలిసి క్రిమి హారిణి మాత్రలను తీసుకొచ్చారు. పూర్తి మూలికలు(హర్బల్)ను వినియోగించి ఈ మాత్రలు తీసుకొచ్చారు. ఒక జనుము బట్టలో చుట్టి ధాన్యంలో వీటిని ఉంచితే నెలలపాటు పురుగు చేరదు.
థర్మాకోల్ స్థానంలో పోర్సిని పార్సెల్.. (ప్రత్యేక బహుమతి)
మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల బీఎస్సీ(బీబీసీ) విద్యార్థినులు ప్రణవి, అనుపమలు.. మష్రూమ్ వేర్లను ఉపయోగించి సరికొత్త పోర్సిని ప్యాకేజింగ్ పదార్థాన్ని తయారు చేశారు. గాజుతో తయారు చేసే గ్లాసులు, తదితరాలను థర్మాకోల్ ప్యాకేజీల్లో రవాణా చేస్తుంటారు. థర్మాకోల్ భూమిలో కరిగేందుకు వేల సంవత్సరాలు పడుతుంది. దాని స్థానంలో వినియోగించేలా మష్రూమ్ వేర్ల(మైసినియా)తో ప్యాకేజింగ్ పదార్థాన్ని రూపొందించారు. దీన్ని ఉపయోగించి సున్నితమైన వస్తువులు రవాణా చేయవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.