ఇబ్బందికరంగా మారిన టాప్-200 నిబంధనలు
కానూరు, న్యూస్‌టుడే: మూడేళ్ల తరువాత ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కొందరికే పరిమితమయ్యింది. క్యూస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-200 లోపు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొంది ఉండాలన్న నిబంధన విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. సర్కారు ఓవైపు భారీ సాయం అందిస్తున్నట్లు చెబుతున్నా.. నిబంధనల పేరుతో అర్హుల జాబితాలో కోత వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‣ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఏటా 2500 మంది విద్యార్థులు విదేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ చదవడానికి వెళుతున్నారు. ఇందులో పీజీ చేసేవారే అధికంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ఉచితంగా విదేశీ విద్యాదీవెన ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెలాఖరు వరకు జరుగుతుంది.
కేవలం 200 విశ్వవిద్యాలయాల్లో మాత్రమే..: క్యూస్ వరల్డు ర్యాంకింగ్‌లో టాప్-100 విశ్వవిద్యాలయాల్లో సీటు సాధిస్తే రూ.కోటి, టాప్ 101-200 లోపు అయితే రూ.50 లక్షలు వరకు పూర్తి ఫీజును ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లిస్తుంది. ఈ పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు అర్హులు కావాలంటే ఈ వర్సిటీల్లో అడ్మిషన్లు పొంది ఉండాలన్న నిబంధన పెట్టారు.
ఏయే దేశాల్లో వర్సిటీలు ఉన్నాయంటే?: అమెరికాలో 45, నెదర్లాండ్సు 8, చైనా 7, సౌత్‌కొరియా 7, యూకే 26, జపాన్ 6, హాంకాంగ్ 5, ఫ్రాన్సు 5, కెనడా 8, మలేషియా 5, స్వీడన్ 5, స్విట్జర్లాండు 5, ఆస్ట్రేలియా 13, ఇండియా 3 (ఐఐటీలు), జర్మనీ 11. ఇవికాకుండా మరో 20 దేశాల్లో 1 నుంచి 3 వరకు టాప్-200 లోపు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
గతంలో అవకాశం పొందినవారు: మన ప్రాంతంలోని విద్యార్థులు ఎక్కువగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా దేశాల్లో విదేశీ విద్యను అభ్యసిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలో గతంలో చేరిన వారు ఒక్కరైతే.. 200లోపు విశ్వవిద్యాలయాల్లో చదివిన వారు 24లోపే ఉన్నారు. ఈ టాప్ వర్సిటీల్లో సీటు రావాలంటే బాగా కష్టపడి చదవాలి. మంచి స్కోరు రావాల్సి ఉంటుంది. ఇటువంటి విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు నిబంధనలు పెట్టడం వల్ల ఎక్కువమందికి అవకాశం రావడం లేదు.
సీటు సాధించాలంటే..: జేవీ మూర్తి, ఎండీ, ఇన్విక్టా కన్సెల్టెన్సీ
ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయాలనుకునే వారు జీఆర్ఈ రాయాల్సి ఉంటుంది. ఎంబీఏ చేయాల్సిన వారు జీఎంఏటీ, రాయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఐఈఎల్టీఎస్, టోఫెల్ పరీక్షలు కూడా రాయాల్సి ఉంటుంది.
‣ జీఆర్ఈ పరీక్షలో 340 మార్కులకు 315 వస్తేనే ఈ టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో సీటు వస్తుంది.
‣ అలానే డిగ్రీ స్థాయిలో 70 శాతం పైబడి మార్కులు ఉండాలి.
‣ విద్యార్థి డిగ్రీ స్థాయిలో చేసే ప్రాజెక్టు, పేపర్ పబ్లికేషన్, ఇంటర్న్‌షిప్‌లను సీటు ఇచ్చే సమయంలో పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
‣ అడ్మిషన్ సమయంలో చక్కని వ్యాసం రాయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం పునరాలోచించాలి: కేఆర్ఎస్ రావు, విద్యావేత్త
విదేశీ విశ్వవిద్యాలయాల సంఖ్య మరింత పెంచాలి. లేకుంటే మధ్య తరగతి, పేద విద్యార్థులకు ఎక్కువ అవకాశం రాదు. టాప్ విశ్వవిద్యాలయాల్లో మన ప్రాంతం నుంచి ఎంపికయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ నిబంధనపై ప్రభుత్వం పునరాలోచించాలి.
ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తే మేలు: ఎల్. మహేష్, సాఫ్టువేర్ ఉద్యోగి
విదేశీ విద్య చదవడానికి గతంలో ఎక్కువ మందికి అవకాశం వచ్చింది. గత మూడున్నర ఏళ్లుగా ఈ పథకానికి వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈసారి నిబంధనతో ఎంత మందికి అవకాశం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అన్ని వర్గాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుంటే మేలు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.