• facebook
  • whatsapp
  • telegram

JEE Main: జేఈఈ మెయిన్‌ పరీక్ష.. విద్యార్థులూ ఇవి మరిచిపోకండి!

  జేఈఈ మెయిన్‌(JEE main 2023) తొలి విడత పరీక్షకు వేళైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే ఈ పరీక్ష మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్‌టీఏ(NTA) అధికారులు సర్వం సిద్ధంచేశారు. రేపటి నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం సన్నద్ధమైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/నుంచి ఎప్పటికప్పుడు తమ అడ్మిట్ కార్డులు(Admit cards) డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ(National testing agency) అధికారులు సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ కింది సూచనలను దృష్టిలో ఉంచుకోండి.

 

ఇవి మరిచిపోవద్దు..

అడ్మిట్‌ కార్డు: విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా హాల్‌ టికెట్‌ను తమ వెంట తీసుకొని వెళ్లాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్‌ కార్డు లేకపోతే పరీక్ష హాలులోకి అనుమతించరు.

ఫొటో ఐడీ: పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను నిర్దారించే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును పట్టుకెళ్లాలి. 

పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో: పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం మరిచిపోవద్దు. మీరు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్‌ చేసిన ఫొటోను ఎగ్జామ్‌ సెంటర్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని అటెండెన్స్‌ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది. 

బాల్‌ పాయింట్‌ పెన్‌: విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్‌పాయింట్‌ పెన్‌ను తీసుకెళ్లాలి. 

పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌: దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్‌ ఆఫీసర్‌ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

 

ఈ వస్తువులకు నో ఎంట్రీ.. 

* చిరుతిళ్ళు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్స్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్‌ మెటీరియల్‌, వాటర్‌ బాటిళ్లు, మొబైల్‌ఫోన్‌/ఇయర్‌ ఫోన్‌/మైక్రోఫోన్‌/పేజర్‌, కాలిక్యులేటర్‌‌, డాక్యుపెన్‌, కెమెరా, టేప్‌ రికార్డర్‌ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

* వీటితో పాటు హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులు, నగలు, మెటాలిక్‌ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం

* మధుమేహంతో బాధపడే విద్యార్థులైతే షుగర్‌ టాబ్లెట్స్‌/పండ్లు (అరటిపండు/యాపిల్‌/ఆరంజ్‌) వంటివి వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. ట్రాన్స్‌పరెంట్‌ వాటర్‌ బాటిల్‌ను తీసుకెళ్లొచ్చు. చాక్లెట్లు/క్యాండీ/శాండ్‌విచ్‌ వంటి ప్యాక్‌ చేసిన ఆహారపదార్థాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు.

 

మరికొన్ని కొన్ని కీలక సూచనలివే.. 

* పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకొనేలా ప్లాన్‌ చేసుకోండి. అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయండి. పరీక్ష హాలు తెరవగానే మీకు కేటాయించిన సీట్లో కూర్చొని అన్ని సరిచూసుకోండి.

* ట్రాఫిక్‌ జామ్‌, రైలు/బస్సు ఆలస్యం వంటి కారణాల వల్ల పరీక్ష కేంద్రానికి చేరుకోవడం కొంచెం ఆలస్యమైనా అక్కడ ఇన్విజిలేటర్లు ఇచ్చే ముఖ్యమైన సూచనల్ని మిస్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ఆలస్యానికి ఎన్‌టీఏ బాధ్యత వహించదు. 

* ఏదైనా సాంకేతిక సాయం/ఎమర్జెన్సీ, పరీక్షకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఎదురైతే పరీక్ష సెంటర్‌ సూపరింటెండెంట్‌ /ఇన్విజిలేటర్‌ను సంప్రదించవచ్చు.

* పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్‌ షీట్లపైనే కాలిక్యులేషన్సు/రైటింగ్‌ వర్కు చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత రఫ్‌ షీట్లను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.

* పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి.

* మంచి షెడ్యూల్‌ను రూపొందించుకొని పరీక్షకు ముందు బాగా నిద్ర ఉండేలా జాగ్రత్త పడండి.

* పరీక్షలకు ముందు రోజు కొత్త టాపిక్స్‌ను కవర్‌ చేసేందుకు ప్రయత్నించొద్దు. దానివల్ల విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన స్థాయి పెరుగుతుంది.

* పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సిన వాటిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి. 

* పరీక్ష కేంద్రం ఎక్కడో ముందుగానే సరిచూసుకొని.. లొకేషన్‌, అక్కడి పరిసరాల గురించి తెలుసుకోవడం మంచిది.

* అడ్మిట్‌ కార్డులో ఇచ్చిన సూచనల్ని క్షుణ్నంగా చదవండి. పరీక్ష కేంద్రానికి చివరి నిమిషంలో హడావుడిగా కాకుండా ముందుగానే చేరుకొనేలా చూసుకోండి. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.