• facebook
  • whatsapp
  • telegram

TSPSC AE QP: లీకైంది ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం

పోలీసుల దర్యాప్తులో వెల్లడి
భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలవీ తస్కరించినట్లు అనుమానం
ఏఈ పరీక్ష రద్దుపై నేడు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మార్చి 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. తొలుత మార్చి 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు కంప్యూటర్‌ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలోని సమాచారం ఆధారంగా పలువురు వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌, గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. కాగా, ఏఈ పరీక్షపై అధికారులు మార్చి 14న‌ నిర్ణయం తీసుకోనున్నారు.
ఫోరెన్సిక్‌ నివేదిక వస్తే..
నియామక పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రెండు నెలల ముందుగానే సిద్ధమవుతుంది. ప్రశ్నపత్రాలన్నింటినీ సాఫ్ట్‌కాపీ రూపంలో భద్రపరుస్తారు. ప్రశ్నల పక్కనే వాటి జవాబులుంటాయి. అసిస్టెంట్‌ ఇంజినీరు ప్రశ్నపత్రాన్ని తస్కరించే క్రమంలో కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోని ప్రశ్నపత్రాల ఫోల్డర్‌ను నిందితులు డౌన్‌లోడ్‌ చేశారు. ఇందులో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలకు సంబంధించినవీ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో కాపీ చేసి భద్రపరిచిన హార్డ్‌ డిస్క్‌, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గతంలో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలూ లీక్‌ అయ్యాయా? అన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఫోల్డర్‌ను ఫిబ్రవరి 25 లేదా 28న డౌన్‌లోడ్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పోలీసులు పంపించారు. ఆ నివేదిక వస్తే మరిన్ని విషయాలు బయటపడనున్నాయి. ఏ రోజు ఫోల్డర్‌ను ఎప్పుడు డౌన్‌లోడ్‌ చేశారన్న ఆధారాలు లభిస్తే మరింత స్పష్టత రానుంది.
బలహీనంగా నెట్‌వర్క్‌
కంప్యూటర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన ఫోల్డర్‌లో భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఉన్నట్లు బయటపడటంతో వాటి స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలను కమిషన్‌ సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు కొంత సమయం తీసుకునే అవకాశాలున్నాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్ల నెట్‌వర్క్‌ బలహీనంగా ఉందని పోలీసు దర్యాప్తులో తేలిందని తెలిసింది. సరైన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక సర్వర్‌ లేకపోవడంతో కంప్యూటర్లను నిందితులు తేలికగా హ్యాక్‌ చేసినట్లు వెల్లడైంది.
 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు జరిగిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు బయటపడటంతో టీఎస్‌పీఎస్సీ మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుంది. పరీక్షను రద్దు చేయాలా? లేదా ఇద్దరికే లీక్‌ అయిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై న్యాయనిపుణుల సలహాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలనూ రద్దు చేసినట్లు స్పష్టంచేశాయి.
తమ్ముడి ఉద్యోగం కోసం అక్క దొంగాట!
ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. సోదరుడికి సర్కారు ఉద్యోగం సాధించేందుకు అడ్డదారిని ఎంచుకున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడ్డారు. చివరి బండారం బయటపడిపోవడంతో కటకటాల పాలయ్యారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఆ ఉపాధ్యాయురాలు కూడా ఉన్నారు. వారి నుంచి 4 పెన్‌డ్రైవ్‌లు, 3 ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌, 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి బషీర్‌బాగ్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో గోషామహల్‌ ఏసీపీ సతీశ్‌కుమార్‌, బేగంబజార్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌, టాస్క్‌ఫోర్స్‌ సెంట్రల్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌తో కలసి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీ కిరణ్‌ ఖరే మీడియాకు వివరాలు వెల్లడించారు.
‣ ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన పులిదిండి ప్రవీణ్‌కుమార్‌(32) బీటెక్‌ పూర్తి చేశాడు. అతని తండ్రి హరిచంద్రరావు ప్రభుత్వ ముద్రణాలయంలో అదనపు ఎస్పీగా పనిచేశారు. విధి నిర్వహణలో మరణించటంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌ అక్కడే జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరాడు. 2017 నుంచి టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌వో)గా పనిచేస్తున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా పగిడ్యాల్‌ పంచగల్‌ తండాకు చెందిన ఎల్‌.రేణుక(35) గురుకుల ఉపాధ్యాయ పరీక్షకు దరఖాస్తు చేశారు. దరఖాస్తులో తప్పులు దొర్లటంతో సరిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రవీణ్‌తో పరిచయమైంది. అతడి ఫోన్‌ నంబర్‌ తీసుకొని.. తరచూ మాట్లాడుతుండేది. ప్రస్తుతం ఆమె వనపర్తి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తన సోదరుడు కె.రాజేశ్వర్‌ నాయక్‌(33) కోసం ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసేందుకు ఆమె సిద్ధమైంది. రేణుక, వికారాబాద్‌ జిల్లా రెవెన్యూ శాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె భర్త ఢాక్యానాయక్‌(38)లు ప్రవీణ్‌తో సంప్రదింపులు జరిపారు.  అదే కార్యాలయంలో నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేస్తున్న ఎ.రాజశేఖర్‌రెడ్డి(35)తో కలసి ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు పథకం వేశారు.
కార్యదర్శి యూజర్‌ ఐడీతో..
కమిషన్‌ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌.. కార్యదర్శి డైరీలోని ఐపీ అడ్రస్‌ను దొంగచాటుగా సేకరించాడు. రాజశేఖర్‌రెడ్డితో కలసి కార్యాలయ ఇన్‌ఛార్జి కంప్యూటర్‌ నుంచి వివిధ విభాగాల ప్రశ్నపత్రాలున్న ఫోల్డర్‌ను ప్రవీణ్‌ 4 పెన్‌డ్రైవ్‌ల్లో భద్రపరిచాడు. కార్యాలయంలోనే పదుల సంఖ్యలో కాపీలు తీసుకొన్నాడు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాలను అక్కడే ప్రింట్‌ తీసుకున్నారు. వాటిని ఈ నెల 2న రేణుక, ఢాక్యానాయక్‌లకు ఇచ్చి రూ.5 లక్షలు తీసుకున్నాడు. రేణుక, ఢాక్యానాయక్‌, రాజేశ్వర్‌ నాయక్‌లను ప్రవీణ్‌ బడంగ్‌పేట్‌లోని తన నివాసానికి తీసుకెళ్లాడు. వారు అక్కడే రెండ్రోజులపాటు ఉన్నారు. ఈ నెల 5న రాజేశ్వర్‌ను పరీక్షా కేంద్రానికి తన వాహనంపైనే ప్రవీణ్‌ తీసుకెళ్లాడు. ఉదయం, సాయంత్రం రెండు పేపర్లు రాయించి తీసుకొచ్చాడు. పరీక్ష పూర్తయ్యాక మార్చి 6న రేణుక దంపతులు ప్రవీణ్‌కు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. ఇవి బేస్‌ పేపర్లు కావటంతో ప్రశ్నలు, సమాధానాలు పక్కనే ఉంటాయి. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రేణుక దంపతులు కొత్త పథకం వేశారు. మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లా మన్సూర్‌పల్లి తండాకు చెందిన కె.శ్రీనివాస్‌(30) పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుసుకొని.. తమ వద్ద ప్రశ్నపత్రాలు ఉన్నట్లు సమాచారమిచ్చారు. తాను ఎస్సై ఉద్యోగానికి సిద్ధమవుతున్నానని.. ఈ పరీక్ష రాసేవాళ్లు వేరే ఉన్నారంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె.నీలేష్‌నాయక్‌(28), పి.గోపాల్‌నాయక్‌(29)ల వివరాలిచ్చాడు. అతడిచ్చిన సమాచారంతో ఆ ఇద్దరికీ రూ.13.50 లక్షలకు (ఏఈ సివిల్‌) ప్రశ్నపత్రాలు విక్రయించారు. ప్రశ్నపత్రాలు లీకైనట్లు గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు బేగంబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనక ప్రవీణ్‌ ప్రమేయం ఉండొచ్చనే అనుమానం వ్యక్తంచేశారు. సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, బేగంబజార్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. కంప్యూటర్ల నుంచి ప్రశ్నపత్రాలు చోరీ చేసినట్లు తేల్చారు. ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో.. విషయం వెలుగుచూసింది. లీకేజీతో ప్రమేయం ఉన్న ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌, రేణుక, ఢాక్యానాయక్‌, కె.రాజేశ్వర్‌నాయక్‌, కె.నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌నాయక్‌, కె.శ్రీనివాస్‌, కె.రాజేంద్రనాయక్‌(31)లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులుండటం గమనార్హం. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి తీసుకుంటామని తెలిపారు. ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినపుడు నోరుమెదపలేదని తెలిసింది. తాము ప్రశ్నపత్రాలు ఏ విధంగా బయటకు తీశామో రాజశేఖర్‌రెడ్డి వెల్లడించినట్లు తెలుస్తోంది. 
అయిదుగురిపై వేటు!
ఈనాడు, హైదరాబాద్‌: అసిస్టెంట్‌ ఇంజినీరు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అయిదుగురు ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేయనుంది. ప్రత్యక్షంగా లీకేజీకి పాల్పడిన, పరోక్షంగా సహకరించిన వారిపై చర్యలు తీసుకోనుంది. వీరిలో ఒకరు గురుకుల ఉపాధ్యాయురాలు కాగా, మిగతా నలుగురు సాంకేతిక నిపుణులు. కీలక సూత్రధారి ప్రవీణ్‌ను కమిషన్‌ సస్పెండ్‌ చేసింది. విచారణ అనంతరం ఉద్యోగంలో కొనసాగించడంపై చర్యలు తీసుకోనున్నారు. టీఎస్‌టీఎస్‌ నుంచి పొరుగుసేవల కింద పనిచేస్తున్న రాజశేఖర్‌ను విధుల నుంచి తొలగించింది. గురుకుల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకను పోలీసు నివేదిక అందిన వెంటనే సస్పెండ్‌ చేసేందుకు గురుకుల సొసైటీ సిద్ధమైంది. మేడ్చల్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను, రేణుక భర్త, రెవెన్యూ  విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఢాక్యానాయక్‌ను సస్పెండ్‌ చేయనున్నట్లు తెలిసింది.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేనేజ‌ర్ల‌కు టూరిజం స్వాగ‌తం!

‣ స‌త్వ‌ర ఉద్యోగాలు .. సొంత ప‌రిశ్ర‌మ‌లు!

‣ సీఎంఐ కోర్సుల‌తో పెద్ద ప్యాకేజీలు!

‣ అగ్నివీరుల‌కు ఆర్మీ ఆహ్వానం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.