* గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను జూన్ 11న తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటన
ఈనాడు, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమినరీతో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ అధికారి గ్రేడ్-2 (వర్క్స్) పోస్టుల పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఆయా పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకు వచ్చినట్లు వెల్లడికావడంతో కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీరు పరీక్షను రద్దు చేయడంతో ఈ జాబితాలో నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలు చేరాయి. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక, టీఎస్‌పీఎస్సీ అంతర్గత విచారణ నివేదికపై మార్చి 17న ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ అత్యవసరంగా సమావేశమైంది. ఆయా నివేదికలపై చర్చించి.. ఈ మూడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమినరీని జూన్ 11న తిరిగి నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. రద్దయిన మిగతా పరీక్షల షెడ్యూలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి 2011లో గ్రూప్-1 ప్రకటన వెలువడింది. రాష్ట్ర ఏర్పాటు నుంచి 2022 వరకు మళ్లీ నోటిఫికేషన్ రాలేదు. దాదాపు 11 ఏళ్ల తరువాత 2022 ఏప్రిల్ 26న రికార్డు స్థాయిలో 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. ఈ పరీక్ష నిర్వహణ సమయంలోనే కొన్ని లోపాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో కొందరు అభ్యర్థులకు ఉర్దూ మాధ్యమం ప్రశ్నపత్రాలు రావడంతో గందరగోళం నెలకొంది. ఆ అభ్యర్థులతో మధ్యాహ్నం పరీక్ష రాయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రిలిమ్స్ కీలో వెలువడిన అభ్యంతరాల నేపథ్యంలో అయిదు ప్రశ్నలు తొలగించి తుది కీ ఖరారు చేశారు. పరీక్ష రాసిన వారిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వారికి షెడ్యూలు ప్రకారం జూన్‌లో ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతలోనే లీకేజీ నేపథ్యంలో ప్రాథమిక పరీక్ష రద్దయింది. గ్రూప్-1 కోసం ఏళ్లుగా కష్టపడ్డామని.. ఇలా జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని.. ప్రిలిమినరీ పరీక్షను దాటి ప్రధాన పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏఈఈ, డీఏవో ప్రశ్నపత్రాలు బహిర్గతం
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు(ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ అధికారి గ్రేడ్-2 (వర్క్స్) (డీఏవో) ప్రశ్నపత్రాలూ లీకైనట్లు సిట్ దర్యాప్తులో వెల్లడికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో 53 డీఏవో పోస్టులకు ఏకంగా 1,06,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఫిబ్రవరి 26న నిర్వహించిన ఈ పరీక్షకు 67 వేల మంది హాజరయ్యారు. ఇక 1,540 ఏఈఈ పోస్టులకు 81,548 మంది దరఖాస్తు చేసుకోగా.. 61 వేల మంది హాజరయ్యారు. ఈ రెండు పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సైతం తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
అంతా రీషెడ్యూలు..
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో పరీక్షల షెడ్యూలును రీ షెడ్యూలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రశ్నపత్రాలన్నీ కొత్తగా రూపొందించాల్సి ఉంది. దీంతో ఇక నుంచి జరిగే పరీక్షలు దాదాపు రీ షెడ్యూలు అయ్యే అవకాశముంది. ఏప్రిల్, మేలలో పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయమై కమిషన్ సమాలోచనలు చేస్తోంది. అక్టోబరు నుంచి ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏడు పరీక్షల్లో ఇప్పటికే నాలుగు రద్దయ్యాయి. తొలుత ఏఈ పరీక్ష రద్దుకాగా... తాజాగా గ్రూప్-1, డీఏవో, ఏఈఈ పరీక్షలు ఆ జాబితాలో చేరాయి. పరీక్షల రీషెడ్యూలుతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ, ఇతర బోర్డులు, కమిషన్ల ద్వారా భర్తీ చేసే పోస్టులకు షెడ్యూలు వెలువడింది. అభ్యర్థులు మిగతా పోటీపరీక్షలూ రాసేలా పరీక్షల తేదీలు ఖారారు చేయాల్సి ఉంటుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అక్టోబరు నుంచి ప్రశ్నపత్రాల చౌర్యం
‣ 5 వేలకుపైగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
‣ ఎగ్జామ్‌కి ముందు ఏం చేయకూడదు?
‣ సరదగా నేర్చుకో.. ఎడ్యుటైన్‌మెంట్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.