ఐఐటీల్లోనే అధికంగా ఆత్మహత్యలు
ఏపీలో ఒకరు, తెలంగాణలో ఏడుగురి మృతి
ఈనాడు, దిల్లీ: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత ఆరేళ్లలో 103 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. ఆయన లోక్‌సభలో ఏప్రిల్ 3న ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఐఐటీల్లో 35 మంది, ఐఐఎంల్లో నలుగురు, ఎన్‌ఐటీల్లో 24 మంది, ఎయిమ్స్‌ల్లో 11 మంది, సెంట్రల్ యూనివర్సిటీల్లో 29 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విద్యాసంస్థల్లో 2020లో ఒకరు, తెలంగాణలోని సంస్థల్లో ఏడుగురు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. బిహార్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురల్లోని విద్యాసంస్థల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో బలవన్మరణాలు నమోదైనట్లు వెల్లడించారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని విద్యాసంస్థల్లో ఆరేళ్లలో 18 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
కర్నూలు ఐఐటీడీఎంలో తగ్గిన నియామకాలు
కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐఐటీడీఎం) తాజా బ్యాచ్‌లో నియామకాలు తగ్గాయి. వైకాపా లోక్‌సభ సభ్యుడు మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌సర్కార్ ఇచ్చిన సమాచారం మేరకు.. 2017-21 బ్యాచ్ విద్యార్థుల్లో 54.76% మందికి, 2018-22 బ్యాచ్‌లో 77.66% మందికి కొలువులు దక్కగా.. 2019-23 బ్యాచ్‌లో ఇప్పటివరకు 41.67% మందికే ఉద్యోగాలు లభించినట్లు వెల్లడించారు. ఈ బ్యాచ్ నియామకాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. వివిధ మంత్రిత్వశాఖల ద్వారా ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో 890 మందికి స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు దక్కినట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల పీసీబీల్లో భారీగా ఖాళీలు
తెలుగు రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ల (పీసీబీ)లో ఖాళీలు భారీగా పేరుకుపోయాయి. ఏపీ ఎస్‌పీసీబీకి 289 పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం 182 (62.97%), తెలంగాణలో 203 పోస్టులకుగాను 103 (44.78%) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల పీసీబీల్లో సగటున 49.12% పోస్టులకు నియామకాలు జరగలేదు. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే ఏప్రిల్ 3న లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.