• facebook
  • whatsapp
  • telegram

B.Tech, B.Sc Courses: అనుమతులు రాకుంటే ఆగమాగమే!

* ఆందోళనలో గురునానక్‌, శ్రీనిధి వర్సిటీలోని ఆరు వేల మంది విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని గురునానక్‌, శ్రీనిధి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేరిన దాదాపు ఆరు వేల మంది బీటెక్‌, బీఎస్సీ తదితర కోర్సుల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ రెండు వర్సిటీలకు ప్రభుత్వ అనుమతులు రాకపోవడమే దీనికి కారణం. కొద్ది రోజులుగా ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో ప్రవేశాలు పొందిన విద్యార్థుల్లో అయోమయంలో నెలకొంది. రాష్ట్రంలో రెండో విడతలో మరికొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 2022 ఏప్రిల్‌ 12న రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. సెప్టెంబరు 13న అసెంబ్లీలో గురునానక్‌, శ్రీనిధి, ఎంఎన్‌ఆర్‌, కావేరి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇక్మార్‌) బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం వాటిని గవర్నర్‌ ఆమోదముద్ర కోసం పంపించారు. ఈలోగా గురునానక్‌, శ్రీనిధి వర్సిటీలు ప్రకటనలు ఇచ్చుకుని.. 2022-23 విద్యా సంవత్సరమే ప్రవేశాలు పూర్తి చేశాయి. గురునానక్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లోనూ ప్రవేశాలు చేపట్టారు. గురునానక్‌లో దాదాపు 4 వేల మంది, శ్రీనిధిలో సుమారు 2 వేల మంది విద్యార్థులు చేరినట్లు చెబుతున్నారు. సగటున వార్షిక ఫీజు రూ.2 లక్షలు అనుకున్నా విద్యార్థులు చెల్లించింది రూ.120 కోట్లు.

సెప్టెంబరు నుంచే సందిగ్ధత..

అయిదు వర్సిటీల ఏర్పాటు బిల్లుకు గత సెప్టెంబరులో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపి గవర్నర్‌ తమిళిసైకి పంపగా అప్పటి నుంచీ అది పెండింగ్‌లో పడింది. బిల్లుపై గవర్నర్‌ కొన్ని సందేహాలు లేవనెత్తడంతో స్వయంగా విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి వివరణ ఇచ్చారు. అయినా బిల్లుకు ఆమోదం లభించలేదు. అప్పటి నుంచే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గత నెలలో ఆ బిల్లులకు సంబంధించి గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని వివరణలు కోరారు.

* అనుమతి వస్తుందా? రాదా? రాకపోతే ఏమిటని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వర్సిటీ ప్రతినిధులను తరగతులు మొదలైన నాటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ స్పష్టత రాలేదు.

తొలి సెమిస్టర్‌ పరీక్షలు ఎప్పుడో!

గత అక్టోబరు/నవంబరు నుంచి తరగతులు మొదలయ్యాయి. తొలి సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెలలో జరగాలి. ఇప్పటివరకు టైంటేబుల్‌ విడుదల చేయలేదు. మరోవైపు జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరిన వారికి తొలి సెమిస్టర్‌ పరీక్షలు ఏప్రిల్‌లోనే పూర్తయ్యాయి. రెండో సెమిస్టర్‌ తరగతులు మొదలై నెల రోజులైంది. ‘విద్యార్థులే కాదు.. అనుమతులు రాకుంటే వందల మంది ఉద్యోగులు కూడా రోడ్డున పడాల్సిందే’ అని వర్సిటీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ‘అనుమతులు వచ్చే వరకు ప్రవేశాలు జరపవద్దని వర్సిటీల యాజమాన్యాలను ప్రభుత్వం హెచ్చరించలేదు. కనీసం ఇప్పుడైనా ఆందోళన చెందుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలి’ అని తెలంగాణ సాంకేతిక కళాశాలల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బాలకృష్ణారెడ్డి అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఆవేదన

హైదరాబాద్‌ ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ల బీఎస్సీ కార్డియో కేర్‌ కోర్సులో చేరాను. ఫీజు ఏడాదికి రూ.1.10 లక్షలు. విశ్వవిద్యాలయ అధికారులు గత ఏడు నెలలుగా అనుమతి వస్తుందనే చెబుతున్నారు. చివరికి ఏమవుతుందో తెలియదు.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన విద్యార్థి

శ్రీనిధి వర్సిటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో ఏడాదికి రూ.3 లక్షల రుసుం చెల్లించి ప్రవేశం పొందాను. గత సెప్టెంబరు నుంచే తరగతులు మొదలయ్యాయి. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. వర్సిటీకి అనుమతి రాకపోవడంతో ఆందోళనగా ఉంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు

‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ కరణాలు పోయి.. కార్యదర్శులు వచ్చి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.