• facebook
  • whatsapp
  • telegram

Unemployment - AP: రాష్ట్రంలో ఉద్యోగాల్లేవ్‌

* ఇక్కడ చదువులు.. పక్క రాష్ట్రాల్లో కొలువులు

* ఏపీలో విద్యావంతులకు మిగిలేది కూలి పనులేనా!

* పరిశ్రమలు రావు.. ఉపాధి దొరకదు

* ప్రోత్సాహం లభించక ఐటీ కంపెనీలు రివర్స్‌

* విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, ఇతర నగరాల్లో ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులలో చాలామందికి టీసీఎస్‌, వర్చూసా, టెక్‌ మహీంద్ర, ఐబీఎం లాంటి సంస్థల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. వీరంతా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, పుణే లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది తప్ప.. స్థానికంగా పనిచేసేలా ఉద్యోగం పొందినవారు ఒక్కరూ లేరు.

* విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్‌ సమిట్‌ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ పెట్టుబడులు రావాలంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి. 2022-23 బడ్జెట్‌లో మూలధన వ్యయంగా రూ.30,679.57 కోట్లు కేటాయిస్తే రూ.16,846.69 కోట్లే ఖర్చుచేశారు. వ్యయం ఇలా ఉంటే మౌలిక సదుపాయాల కల్పన ఎలా సాధ్యం? అవి లేకుండా పెట్టుబడులు, పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమలు లేకపోతే చదువుకున్న యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది?

* రాష్ట్రంలో ఉన్నతవిద్య చదువుతున్న వారిలో 35.14% మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. జాతీయ సగటు కంటే నిరుద్యోగ పట్టభద్రులు రాష్ట్రంలోనే రెండింతలు అధికం. గత మూడేళ్లలో పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు 10 శాతానికి పైగా పెరిగినట్లు సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ (సీఎంఐఈ) నివేదిక బహిర్గతం చేసింది.

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాలి. ఇక్కడే ఉండాలంటే కూలిపనుల్లాంటివే దిక్కవుతాయి. లేదంటే నిరుద్యోగిగా మిగిలిపోవాలి. రాష్ట్రంలో పెద్ద నగరమంటూ లేదు.. ఐటీ కంపెనీలు రావు.. ప్రభుత్వం ప్రోత్సాహం అందించదు. పరిశ్రమలను తీసుకొచ్చి, ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోదు. ఇతర రాష్ట్రాలకు ఉద్యోగులను అందించే రాష్ట్రంలా ఏపీ మారిపోయింది. విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న యువత ఉద్యోగాల కోసం బస్సులు, రైళ్లు, విమానాలు ఎక్కేస్తున్నారు. కనీసం పీజీ చేయాలన్నా.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిపోతున్నారు. ఎంటెక్‌లో 21 వేలకు పైగా సీట్లు ఉంటే, చేరుతున్నవారు 5వేలలోపే. సాధారణ పీజీ కోర్సుల్లో 37% మందే ప్రవేశాలు పొందడం ఆందోళనకర విషయమే. రాష్ట్రంలో నిరుద్యోగుల్లో 73శాతానికి పైగా పట్టభద్రులే ఉన్నారు.

ప్రభుత్వానికి ఉపాధి పట్టదు

సంపాదించే యువశక్తి రాష్ట్రంలో లేకుండా పోతుంటే ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతుంటే.. కొత్తవి ఎలా వస్తాయన్న ఆలోచనా చేయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సంపాదన లేనివారు, తక్కువ ఆదాయం సంపాదించేవారు, వృద్ధులే రాష్ట్రంలో మిగులుతారు. రాష్ట్రంలో ఉద్యోగం, ఉపాధి అంటే పొరుగుసేవల ఉద్యోగం.. లేదంటే కూలి పనులు, కార్మికులు, నైట్‌ వాచ్‌మన్ల పనులే ఉంటున్నాయి. సీఎంఈ నివేదిక సైతం దీన్నే ధ్రువీకరించింది.

* గత రెండేళ్ల సగటు చూస్తే రాష్ట్రంలో లక్షమంది వరకు బీటెక్‌లో ప్రవేశాలు పొందుతున్నారు. డిగ్రీలోనూ సగటున 1.50 లక్షల మంది చేరుతున్నారు. వీరిలో 65-70% ఉత్తీర్ణులవుతారు. ఈ లెక్కన 1.75 లక్షల మంది విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 35% మందికి ఉద్యోగాలు లభించడం లేదు. మిగతా 1.13 లక్షల మందిలోనూ ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లిపోతున్నవారే 95% మంది ఉన్నారు.

* మూడు రాజధానుల ప్రకటనతో నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాల్లేవు. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. పెద్ద వ్యాపారులు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లిపోయారు. పరిశ్రమలు రాకపోవడంతో మెకానికల్‌ ఇంజినీర్లకు ఉద్యోగాలు లేవు.

* ఏ రాష్ట్రంలోనైనా వివిధరంగాల్లో 10-15 విశిష్ట  విద్యాసంస్థలు ఉంటాయి. మన రాష్ట్రంలో నిట్‌, ఐఐటీ మినహా ఆ స్థాయి విద్యాసంస్థ ఒక్కటీ లేదు. విభజన చట్టం ప్రకారం కేంద్రం కొన్ని విద్యాసంస్థల్ని ఏర్పాటుచేసినా నిధులు, వనరులు సమకూర్చకపోవడంతో అవి ఇప్పటికీ ఆ స్థాయికి చేరలేదు. వాటిలో చదువుకున్నవారికి ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.

అంతా రివర్స్‌ గేర్‌..

ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించకపోవడంతో కొత్తవి రాకపోగా.. ఉన్నవే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. విశాఖపట్నంలో సుమారు 100 అంకుర సంస్థలు మూతపడ్డాయి. ఐబీఎం, హెచ్‌ఎస్‌బీసీ లాంటి సంస్థలు వెళ్లిపోయాయి. సిరిపురంలోని హెచ్‌ఎస్‌బీసీ కార్యాలయం, కాల్‌ సెంటర్లలో ఒకప్పుడు 3,500 మంది పనిచేయగా.. ఆ సంస్థ ఖాళీ చేసి వెళ్లిపోయింది. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న కంపెనీకి సగం అద్దెకే ఇచ్చేవారు. ఇంటర్నెట్‌, విద్యుత్తు సదుపాయం కల్పించేవారు. ఈ ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో చాలా సంస్థలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఏపీలో ఐటీ అభివృద్ధికి అవకాశం ఉన్న విశాఖ పరిస్థితే అధ్వానంగా తయారైంది. దీంతో యువత ఉపాధి కోసం వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

* విజయవాడలో హెచ్‌సీఎల్‌, టెక్‌మహీంద్ర లాంటి సంస్థలున్నా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టట్లేదు. విశాఖ, విజయవాడ సహా రాష్ట్రంలో పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇచ్చే సంస్థల్లేవు. పెద్ద ప్యాకేజీలు వచ్చేవారు వేరే రాష్ట్రాలకు వెళ్లడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందినవారు తమ ఆదాయాన్ని అక్కడే ఖర్చుచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత వలస వెళ్లడంతో చాలా గ్రామాల్లో వృద్ధులే మిగులుతున్నారు. ఇలాగైతే రాబోయే రోజుల్లో ఉళ్లన్నీ వృద్ధులతోనే నిండిపోతాయని   సామాజికవేత్తలు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ తొలి తెలుగు చక్రవర్తులు

‣ నిజాం నిరంకుశత్వంపై సత్యాగ్రహం!

‣ ఈసారీ సుల‌భంగా నీట్‌

‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.