* 3 జిల్లాల్లోనే 38 శాతం విద్యార్థులు
* హైదరాబాద్‌లోని 4 కళాశాలల్లో 40 శాతం మంది గ్రామీణ జిల్లాల వారే..
ఈనాడు, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రతిభావంతులైన విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. ప్రధానంగా గ్రామీణ విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని కళాశాలల్లో సీట్లు పొందేందుకు మార్గం చూపుతోంది. గత విద్యా సంవత్సరం (2022-23) దోస్త్‌లోని 930, నాన్ దోస్త్‌లోని 63 కళాశాలల్లో 3,85,573 సీట్లు ఉండగా... వాటిలో 2,12,188 మంది చేరారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 356 డిగ్రీ కళాశాలల్లో 81,915 మంది ప్రవేశాలు పొందారని దోస్త్ గణాంకాల ద్వారా స్పష్టమైంది. అంటే మొత్తం విద్యార్థుల్లో 38.60 శాతం మంది డిగ్రీ విద్యార్థులు ఈ మూడు జిల్లాల్లోనే చదువుతున్నారు. నాన్ దోస్త్ (సొంతంగా ప్రవేశాలు జరుపుకొనే) విభాగం కింద ఉన్న 63 కళాశాలలు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. వాటిలోని 36,756 సీట్లకు గాను 18,421 మంది చేరారు.
4 కళాశాలల్లోనే 2,048 మంది..
హైదరాబాద్ నగరంలోని కోఠి మహిళా డిగ్రీ కళాశాల, బేగం మహిళా, నిజాం, సిటీ డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో కేవలం ఆదిలాబాద్ జిల్లా నుంచే 61 మంది ప్రవేశాలు పొందారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి 92 మంది, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి 153, నారాయణపేట జిల్లా నుంచి 103, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 49, భూపాలపల్లి జిల్లా నుంచి 33, ములుగు జిల్లా నుంచి 17 మంది ప్రవేశాలు పొందారు. ఈ నాలుగు కళాశాలల్లో గత సంవత్సరం 5,144 మంది ప్రవేశాలు పొందగా వారిలో 2048 మంది 30 జిల్లాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.
రూ.200 రుసుంతో హైదరాబాద్‌లో సీట్లు: ఆచార్య లింబాద్రి, కన్వీనర్, దోస్త్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కళాశాలల్లో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల వారు వస్తున్నారు. దోస్త్ కారణంగా మెరిట్ విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని కళాశాలల్లో సీట్లు సాధిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లోని కళాశాలల్లో చదవాలన్న ఆసక్తి ఉన్నా.. రానూపోను ఖర్చులు, దరఖాస్తుల ఖర్చులు భరించాల్సి రావడంతోపాటు చివరకు సీటు వస్తుందో?రాదో? అన్న సందేహాలతో గ్రామీణ జిల్లాలు వారు ఎక్కువగా వచ్చే వారు కాదు. ప్రస్తుతం దోస్త్ ద్వారా కేవలం రూ.200 రుసుంతోనే హైదరాబాద్ నగరంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్లు దక్కించుకుంటున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సంక్షేమ పాలనకు సమన్వయ వేదిక!
‣ పది, ఇంటర్ పరీక్షల్లో మెరిసిన విద్యార్థులకు సన్మానం
‣ స్టాఫ్‌నర్సు అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితా విడుదల
‣ విదేశీ విద్యా దీవెన వార్షిక ఆదాయాన్ని పెంచాం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.