• facebook
  • whatsapp
  • telegram

IITH: ఐఐటీహెచ్‌ చదువు.. సివిల్స్‌ కొలువు

ఈనాడు, సంగారెడ్డి: ప్రతిష్ఠాత్మక యూపీఎస్సీ పరీక్షల్లో తమ పూర్వ విద్యార్థులు ముగ్గురు ఉత్తమ ర్యాంకులు సాధించడం ఐఐటీ హైదరాబాద్‌కు గర్వకారణమని ఆ సంస్థ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌మూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువతకూ వీరు ప్రేరణగా నిలిచారని ప్రశంసించారు. డాక్టర్‌ ముద్రికాఖండేల్‌వాల్‌, ఆచార్యులు ఎస్‌ సూరియ ప్రకాశ్‌, ఉమాశంకర్‌, శివ్‌గోవింద్‌సింగ్‌, రాంజీ విజేతలకు అభినందనలు తెలిపారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ ప్రజలకు సేవ చేసేందుకు ముందడగు వేయడం గొప్ప విషయమన్నారు.
ఎన్‌.ఉమాహారతి 3వ ర్యాంకు
‘అయిదో ప్రయత్నంలో విజయం సాధించా. గంటలు, రోజువారీ లక్ష్యాలతో ముందుకు సాగా. మనం ఎక్కడ తప్పుచేస్తున్నామో తెలుసుకొని సరిదిద్దుకోవడం ఎలాగో గుర్తించాలి. ఆమేరకు సాధన చేయాలి. ఇదే విజయ సూత్రం’ అన్నారు ఉమాహారతి. ఐఐటీహెచ్‌ నుంచి 2017లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఉమాహారతి బీటెక్‌లో చేరినప్పటి నుంచే సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఉండేవారని ఆచార్య ఉమాశంకర్‌ తెలిపారు.
రావుల జయసింహారెడ్డి, 217వ ర్యాంకు
2019లో ఐఐటీహెచ్‌ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. ‘మన గురించి మనం తొలుత తెలుసుకోవాలి. మన శక్తి సామర్థ్యాలపైన కచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. సవాళ్లను అధిగమించాలి. డాక్టర్‌ కొటారోతో కలిసి చేసిన పరిశోధనా పత్రం, సొంతగా చేసిన ప్రాజెక్టు విషయాలు సివిల్స్‌ ఇంటర్వ్యూలో పనికొచ్చాయని’ జయసింహారెడ్డి తెలిపారు.
బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి, 270వ ర్యాంకు
ఐఐటీహెచ్‌లో 2019లో మెకానికల్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఇంజినీరింగ్‌ చదివేప్పుడు తోటివారి నుంచి చక్కటి సహకారం లభించింది. సమస్యలకు మెరుగైన పరిష్కారాలు వెతికేందుకు వీలుకలిగింది. సివిల్స్‌ మైలురాయిని అధిగమించేందుకు అకడమిక్స్‌ దోహదపడ్డాయి. ఇలాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు ప్లాన్‌-బి కూడా సిద్ధం చేసుకోవాలని ఉమామహేశ్వరరెడ్డి సూచించారు.
సివిల్స్‌లో విజేతలుగా కేరళ దంపతుల రికార్డు 
యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (2022) తుది ఫలితాల్లో కేరళకు చెందిన భార్యాభర్తలిద్దరూ విజేతలుగా నిలిచి రికార్డు సృష్టించారు. యూపీఎస్సీ ఎంపిక చేసిన 933 మందిలో కేరళకు చెందిన మాళవిక జి నాయర్, డా. ఎం.నందగోపన్‌ సత్తా చాటారు. 28 ఏళ్ల మాళవికకు 172వ ర్యాంకు రాగా.. ఆమె భర్త నందగోపన్‌(30) 233వ ర్యాంకుతో మెరిశారు. వీరిద్దరికీ 2020లోనే వివాహం జరిగింది. మాళవిక ఈ ఏడాది ఐదో ప్రయత్నంలో 172వ ర్యాంకును సాధించగా.. ఆమె భర్త ఆరో ప్రయత్నం (చివరి)లో విజేతగా నిలిచారు. బిట్స్‌-గోవాలో విద్యనభ్యసించిన మాళవిక 2020లోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మంగళూరులో ఆదాయ పన్ను సహాయ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. నందగోపన్‌ ప్రస్తుతం పథనంథిట్ట జిల్లాలో మానసిక వైద్య కార్యక్రమంలో పనిచేస్తున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.