* ఉత్తర్వులు వచ్చే వరకు పరీక్షలకు హాజరుకావద్దు: టీఎస్‌పీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న వారిలో 16 మంది తమపై ఉన్న డిబార్‌ను ఎత్తివేయాలని వివరణ ఇవ్వగా టీఎస్‌పీఎస్సీ తోసిపుచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పరీక్షలకు హాజరుకావద్దని స్పష్టం చేసింది. ఈ కేసులో మొత్తం 50 మంది నిందితులను కమిషన్ డిబార్ చేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో తెలియజేయాలని ఇటీవల వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అందులో 16 మంది అభ్యర్థులు తమ వివరణ తెలియజేయగా ఇవి సంతృప్తికరంగా లేవని పేర్కొంది. క్రైమ్ నం.64/2023, 95/2023 కేసుల్లో నిందితులుగా ఉన్న మీరు లీకేజీ కేసులో ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించింది. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక, శాఖాపరమైన పరీక్షలు రాయకుండా డీబార్ చేసినట్లు తెలిపింది.
డిబార్ అయినవారు...
కేతావత్ రాజేశ్వర్, లవ్‌ద్యాత్ ఢాక్యా, రాథోడ్ రేణుక, కె.నీలేశ్, గోపాల్‌నాయక్, కేతావత్ శ్రీనివాస్, కె.రాజేందర్‌నాయక్, డి.రమేశ్‌కుమార్, ఎన్.సురేష్, ప్రశాంత్‌రెడ్డి, టి.రాజేంద్రకుమార్, తిరుపతయ్య, ఎం.సాయిసుష్మిత, ఎ.సుచరితరెడ్డి, లావుద్య శాంతి, షమీమ్.
ప్రశ్నపత్రాల లీకేజీలో త్వరలో మూకుమ్మడి అరెస్టులు
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో మూకుమ్మడి అరెస్టులకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండున్నర నెలలుగా జరుగుతున్న దర్యాప్తులో ఇప్పటి వరకూ 50 మందిని అరెస్టు చేశారు. ఒకటి రెండు వారాల్లో ఒకేసారి అనేక మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు డీఈఈ రమేశ్ ద్వారా లబ్ధి పొందిన వారే 30 మంది వరకూ ఉండవచ్చని సమాచారం. వాస్తవానికి తొలుత కమిషన్ ఉద్యోగుల ద్వారా ప్రశ్నపత్రాలు అంచెలంచెలుగా అనేక మందికి చేరాయి. కొద్దిరోజుల క్రితంటీఎస్‌పీఎస్సీ కార్యాలయం వారితో సంబంధం లేకుండా మాస్‌కాపీయింగ్ చేయించిన విద్యుత్తుశాఖ డీఈఈ రమేశ్ ముఠాను సిట్ అధికారులు గుర్తించారు. లీకేజీలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు వచ్చాక తన ఇంటి సమీపంలో ఉండే టీఎస్‌పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ సురేష్‌కు ఇచ్చాడని.. అతడు ఏఈఈ/డీఏవో ప్రశ్నపత్రాలను 25 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడని... సురేష్ ద్వారా అతడి బంధువైన డీఈఈ రమేశ్ రంగప్రవేశం చేశాడని సిట్ పేర్కొంటోంది. ప్రస్తుతం రమేశ్, సురేష్‌తోపాటు మొత్తం ఏడుగుర్ని కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
* ఏఈఈ, డీఏవో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసిన ఓ కళాశాల ప్రిన్సిపల్ అలీతో రమేశ్ ఒప్పందం కుదుర్చుకొని ఓ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని మాస్‌కాపీయింగ్ చేయించాడు. ఒక్కొక్కరు రూ.30 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని ఏఈఈ పరీక్షలో నలుగురితో, డీఏవో పరీక్షలో ముగ్గురితో మాస్‌కాపీయింగ్ చేయించాడు. దాంతోపాటు ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరో 30 మందికి అమ్ముకున్నట్లు తేలింది. ఇది కాకుండా సురేష్ మరో 78 మందికి ఏఈఈ ప్రశ్నపత్రాన్ని అమ్ముకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రమేశ్, సురేష్‌ల వాంగ్మూలాలు నమోదు తర్వాత ఇతరత్రా ఆధారాలు సేకరించనున్నారు. అనంతరం ఇందులో భాగస్వామ్యం ఉన్న వారందర్నీ అరెస్టు చేసే అవకాశం ఉంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.