న్యూస్‌టుడే, సిద్దిపేట, సంగారెడ్డి అర్బన్, మెదక్, వికారాబాద్ మున్సిపాలిటీ: వైద్య విద్య.. ఒకప్పుడు అందని ద్రాక్ష. దీన్ని అభ్యసించాలనే బలమైన ఆకాంక్ష ఎంతోమంది విద్యార్థుల్లో ఉన్నా పలు కారణాలతో వెనుకడుగు వేసేవారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. లక్ష్య సాధనకు తోడ్పడేలా కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎంబీబీఎస్ సీటు సాధించాలన్న తపన మరింత మందిలో పెరిగింది. వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో పుష్కలమైన అవకాశాలు దరిచేరాయి. నిరంతర తపన.. చక్కటి ప్రణాళిక.. శ్రమించే తత్వం కలిగి ఉంటే సీటు సాధించడం సులువే. జిల్లాకో వైద్య కళాశాల ద్వారా ఉమ్మడి మెదక్, వికారాబాద్ ప్రాంతాలు.. వైద్య విద్యకు మణిహారంగా మారనుండటం విశేషం.
‣ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో వైద్య విద్యకు బంగారు బాటలు పడ్డాయి. తద్వారా పేదలకు చెంతనే మెరుగైన సేవలకు నాంది పలికినట్లయింది. ఇక్కడి నుంచి వైద్య విద్య అభ్యసించేందుకు ఎంతోమంది ఇతర జిల్లాలు, విదేశాలకు వెళ్తున్నారు. సుదూరం వెళ్లకుండా స్థానికంగానే వైద్యవిద్య అభ్యసించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వైద్య కళాశాలల ఏర్పాటు, అనుగుణంగా సీట్లు అందుబాటులోకి రావడంతో విద్యావకాశాలు పెరగనున్నాయి.
13 పీజీ కోర్సులతో..
ఉమ్మడి జిల్లా పరంగా.. తొలి ప్రభుత్వ వైద్య కళాశాల సిద్దిపేటలో 2018లో ఏర్పాటైంది. మంత్రి హరీశ్‌రావు చొరవతో సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఏళ్ల కల సాకారమైంది. ఫలితంగా ఈ ప్రాంతంలో అనూహ్య మార్పులు సంభవించాయి. 150 మందితో ఎంబీబీఎస్ తొలి బ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఐదు బ్యాచ్‌లు కొనసాగిస్తున్నారు. త్వరలో ఆరో బ్యాచ్ షురూ కానుంది. యూజీ స్థాయిలో 850 మంది విద్యనభ్యసిస్తున్నారు. 13 పీజీ కోర్సులు గత విద్యా సంవత్సరం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. 50 మంది ఉన్నత వైద్య విద్య చదువుతున్నారు.
అనుబంధంగా ఆసుపత్రులు
వైద్య కళాశాలలకు అనుబంధ సర్వజన ఆసుపత్రుల ఏర్పాటు తప్పనిసరి. తద్వారా అనేక ప్రత్యేక విభాగాలు అందుబాటులోకి వస్తాయి. స్థానికంగా మెరుగైన సేవలు అందుతాయి. అన్ని రకాల విభాగాల ఏర్పాటు, అనుగుణంగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారు. పరిశోధనల వైపు ప్రోత్సహించేలా మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ లాంటి యూనిట్‌లు ఏర్పాటు చేస్తారు. వైద్య శాస్త్ర పురోగతికి బాటలు పడతాయి. ఐదున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సులో నాలుగన్నరేళ్లు చదువుకుంటారు. మిగిలిన సమయం అనుబంధ ఆసుపత్రుల్లో ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ (హౌస్ సర్జన్) చేస్తారు. తద్వారా పెద్దసంఖ్యలో వైద్యులు అందుబాటులోకి రానున్నారు. నర్సింగ్, ఫిజియోథెరపీ, ల్యాబ్‌టెక్నీషియన్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
2021లో మంజూరు
సంగారెడ్డిలో 2021 జూన్‌లో ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరు చేసింది. రూ.510 కోట్లు కేటాయించగా భవన నిర్మాణాలకు, మౌలిక సదుపాయాలకు వెచ్చిస్తున్నారు. 150 సీట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇటీవల స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని రెండతస్తుల భవనంలో ప్రథమ సంవత్సరం తరగతులను మొదలుపెట్టారు. కళాశాల భవనాల పనులు కొనసాగుతున్నాయి. దీనికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజూరైంది. సంగారెడ్డి దుర్గాబాయి శిశు వికాస కేంద్రంలో 60 మంది శిక్షణ పొందుతున్నారు.
కల నెరవేరుస్తూ..
విద్యారంగంలో వెనుకబడిన మెతుకుసీమకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు ఎంతో ఊరటనిచ్చేదే. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ప్రభుత్వపరంగా ఒక్కటీ లేదు. ఈ క్రమంలో వైద్య కళాశాల రావడంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మెదక్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలు ఉండగా, ఏడాది కిందట నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వంద పడకలు ఉన్నాయి. వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు అందుబాటులోకి రానున్నారు.
కుటుంబాల దత్తత..
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 2018లో 150 మంది, 2021, 2022లలో 175 మంది చొప్పున విద్యార్థులు ఐదేసి కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఆరంభంలో స్థానిక కోమటిచెరువు పరిసరాల్లో మురికి వాడల్లో నివసించే కుటుంబాలను, 2021లో ఎన్సాన్‌పల్లి, గతేడాది తడ్కపల్లి వాసులను దత్తత తీసుకున్నారు. సంగారెడ్డిలో గతేడాది నుంచి షురూ చేశారు. ఒక్కొక్కరు ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకొని కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటారు. వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు.
తాత్కాలికంగా క్షయ చికిత్సాలాయంలో..
వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.235 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు అనంతగిరి క్షయ చికిత్సాలయంలో తాత్కాలికంగా తరగతులు కొనసాగించాలని నిర్ణయించారు. కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు 35 మంది ఆచార్యులు, పరిపాలనాధికారులు, పర్యవేక్షకులను నియమించారు. అనంతగిరి క్షయ ఆసుపత్రికి సంబంధించిన భవనాల్లోనే తాత్కాలిక వసతి గృహాలను సైతం ఏర్పాటుచేస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కృత్రిమ మేధ ప్రత్యేకతలివిగో!
‣ క్రీడా శిక్షణ కోర్సుల్లోకి ఆహ్వానం
‣ ఏవియేషన్‌లో.. ఎన్ని ఉద్యోగాలో!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.