• facebook
  • whatsapp
  • telegram

VYSAT: అవును.. ఆ శాటిలైట్‌ను అమ్మాయిలే త‌యారు చేశారు!

* అతినీలలోహిత కిర‌ణాల ప‌రిధిని కొలిచే వియ్‌శాట్‌


 

చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1.. వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టిన ఇస్రో  ఈసారి మరో శాటిలైట్‌ పంపడానికి సిద్ధమవుతోంది. ఎప్పట్లానే పంపిస్తోంది. ఇందులో గొప్పేముంది అంటారా? ఉంది.. భూఉపరితలంపై అతినీలలోహిత కిరణాల పరిధిని కొలిచే ఈ ఉపగ్రహాన్ని పూర్తిగా మహిళలే తయారు చేశారు. అందుకే దీని పేరు విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ (వియ్‌శాట్‌). ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..


ఉత్తర భారతంలో వరదలు ముంచెత్తుతుంటే.. దక్షిణాదిన ఎండలు దంచికొడుతున్నాయి. సరైన వర్షం పడక.. నేల నెర్రెలు చాస్తోంది. అయితే అతివృష్టి.. లేకపోతే అనావృష్టి. ఎందుకిలా? కొన్నేళ్ల క్రితం కేరళని అతలాకుతలం చేసిన వరదలు.. ఇవన్నీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లిజీ అబ్రహంని ఆలోచింపచేశాయి. ఇందుకు పరిష్కారంగా తన విద్యార్థినులతో ఆమె కనిపెట్టిన పరిష్కారమే వియ్‌శాట్‌. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్స్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ ఈమె. ఈ కళాశాలకు అనుబంధంగా అంతరిక్ష ప్రయోగాలని అధ్యయనం చేసే స్పేస్‌ క్లబ్‌ ఒకటి ఉంది. ఈ క్లబ్‌కి కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న లిజీ మూడేళ్ల క్రితం తన మనసులోని ఆలోచనల్ని విద్యార్థులతో పంచుకున్నారు. అలా మొదలైంది వియ్‌శాట్‌ ప్రయాణం. 


ఇస్రో  సహకారంతో..

ఇస్రో వరుస ప్రయోగాలు చూశాక.. ఉపగ్రహాల తయారీ, వాటిని నింగిలోకి పంపడం ఎంత ఖర్చు, సవాళ్లతో కూడిన విషయమో తెలుస్తూనే ఉంది. అయినాసరే ఈ శాటిలైట్‌ తయారీలో తమదైన ముద్ర వేయాలనుకుందీ మహిళా బృందం.  వివిధ ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన 30మంది అమ్మాయిలు ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపించారు. ఇస్రోకి చెందిన ‘ఇన్‌స్పేస్‌’ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వేతర సంస్థలు తయారు చేసే అంతరిక్ష ప్రయోగాలని పర్యవేక్షించి, మార్గదర్శకత్వం ఇస్తుంది ఇన్‌స్పేస్‌ సంస్థ. అలా శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో ముందుకు నడిచారు. బృందంలో అందరూ మహిళలే కావడంతో దీనికి విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ (వియ్‌శాట్‌) అని పేరు పెట్టారు. దీని లక్ష్యం భూమి ఉపరితలంపై అతి నీలలోహిత (యూవీ) కిరణాల పరిధిని కొలవడం. ప్రస్తుతం వీరు రూపొందించిన ఉపగ్రహం ఫ్యాబ్రికేషన్‌ దశలో అంటే దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇస్రో ఆధ్వర్యంలో మరికొన్ని కఠిన పరీక్షలు నిర్వహించాక.. దీనిని షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ద్వారా కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఉపగ్రహాన్ని భూమికి 600 కి.మీ. దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. బరువు కిలో వరకూ ఉంటుంది. దీని తయారీ కోసం రూ.30లక్షల వరకూ ఖర్చుపెట్టారు.


వాతావరణం మారుతోంది...

‘గత కొంతకాలంగా కేరళలో విపరీతమైన వాతావరణ మార్పులు వస్తున్నాయి. వేడిగాలుల.. వరదలు. ఇందుకు కారణాలు అన్వేషించాలనే వియ్‌శాట్‌ తయారీ మొదలుపెట్టాం. శాస్త్రవేత్తల సలహాలతో ముందుకెళ్తున్నాం. దీనికోసం మా కాలేజీలో సొంతంగా గ్రౌండ్‌ స్టేషన్‌ నిర్మించుకున్నాం. తయారీ ఖర్చులని కళాశాలే భరిస్తోంది. ప్రభుత్వం, ఏజెన్సీలు ముందుకొస్తే ఇలాంటి ప్రయోగాలు మరికొన్ని చేయాలని ఉంది. గతేడాది చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఆధ్వర్యంలో 750 మంది విద్యార్థినులు రూపొందించిన ‘ఆజాదీశాట్‌’ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి వెళ్లింది. అదే మాకు స్ఫూర్తి అంటోంది’ విద్యార్థి బృందానికి నాయకత్వం వహించిన షెరిల్‌.

                                - కల్లిపూడి దేవేంద్రరెడ్డి, శ్రీహరికోట


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు

‣ పీఓ కొలువుల ప్రిపరేషన్‌ ప్లాన్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.