• facebook
  • whatsapp
  • telegram

Excellence Centers: ఆ కోర్సులకు బయట రూ.వేలు, లక్షల్లో ఫీజు

* గత ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా శిక్షణ

* ఆ శిక్షణ తీసుకున్నవారు తప్పుడు ప్రచారానికి మద్దతు పలకొద్దు

* లండన్‌లో స్థిరపడిన సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌ శివరాం
 


ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్‌లెన్స్‌ కేంద్రాల్లో రూ.వేలు, లక్షల విలువైన కోర్సులను విద్యార్థులకు ఉచితంగా అందించారని లండన్‌లో స్థిరపడి 5జీ సబ్జెక్ట్‌ మ్యాటర్‌ నిపుణుడిగా పనిచేస్తున్న శివరాం కూరపాటి పేర్కొన్నారు. ఆయన అభిప్రాయాలను సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. ‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతికను అందిపుచ్చుకుని ఉద్యోగాల్లో నిలదొక్కుకోవాలంటే రూ.వేలు, రూ.లక్షలు పెట్టి అడ్వాన్స్‌డ్‌ కోర్సులను నేర్చుకోవాల్సిందే.. వెరీ లార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేషన్‌ (వీఎల్‌ఎస్‌ఐ) లాంటి కోర్సులకు రూ.40 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఆయా శిక్షణ సంస్థల స్థాయిని బట్టి ఫీజులున్నాయి. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో చిన్నపాటి సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకోవాలన్నా కనీసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అవుతోంది. రోబోటిక్స్‌ ల్యాబ్‌లు దేశంలోని ప్రఖ్యాతిగాంచిన కొన్ని ఐఐటీ/ఎన్‌ఐటీ లాంటి విద్యా సంస్థల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రంలో విద్యార్థులు చదువుకుంటున్న కళాశాలల్లోనే ఉచితంగా శిక్షణనిచ్చారు. ఈ శిక్షణ పొందినవారిలో వేల మంది ఇప్పుడు రూ.లక్షల్లో జీతాలు పొందేస్థాయిలో ఉన్నారు. ట్విటర్‌లో మన ఖాతాకు బ్లూ టిక్‌ కావాలన్నా నెలకు ఖాతాకు 10 పౌండ్ల వరకు వసూలు చేస్తున్నారు. అలాంటిది రోబోటిక్‌, కృత్రిమ మేధ, క్యాడ్‌కామ్‌ తదితర కోర్సుల్లో శిక్షణనివ్వాలంటే వాటిని లైసెన్స్‌పై ఇచ్చే సాఫ్ట్‌వేర్‌/హార్డ్‌వేర్‌ సంస్థలు ఎంత పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తాయనేది ఊహకు అందని పరిస్థితి.

* అలాంటిది ఏపీలో గత ప్రభుత్వం కొన్ని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణనిప్పించింది. ఉన్నతస్థాయి, సాధారణ స్థాయి నైపుణ్య కోర్సులనూ ఇందులో అందజేశారు. అత్యాధునిక సాంకేతిక శిక్షణ కోసం ప్రాజెక్టును అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపడం అన్యాయం. మేం ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో ఎంటెక్‌ చేసిన రోజుల్లో రోబోటిక్‌ ల్యాబోరేటరీల కోసం పట్టుబట్టినా ఇవ్వలేమన్నారు. అలాంటిది గత ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు ఈ కోర్సులను ఉచితంగా అందించింది’ అని పేర్కొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇలాంటి కోర్సుల్లో శిక్షణ పొందిన వారు ఆ కోర్సులను వారికందేలా చేసిన చంద్రబాబును అరెస్టు చేయడంపై కులం, మతం, ప్రాంతీయ, రాజకీయ కోణాల్లో ఆలోచిస్తూ మౌనంగా ఉంటే భవిష్యత్తు తరాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ‘మీరు రోడ్లపైకి రానవసరం లేదు కానీ కనీసం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి మద్దతునివ్వకండి’ అని సూచించారు.

‘నైపుణ్యాభివృధ్ధి సంస్థను మూసేస్తారా..?’ జగనే సమాధానమివ్వాలి

* ఓ మిత్రుడు తనను మూడు ప్రశ్నలు అడిగారంటూ సామాజిక కార్యకర్త తుంగా లక్ష్మీనారాయణ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఆ ప్రశ్నలను తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

* నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు? ఎంత మందికి శిక్షణనిచ్చారు? ఎంతమంది లబ్ధి పొంది, ఉద్యోగాల్లో చేరారు? వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జగన్‌పై ఉందా లేదా?

* ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సాధించిన ఫలితాలను అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రశంసా పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది కదా..? ఆ నైపుణ్యాభివృద్ధి సంస్థలో కుంభకోణం జరిగిందని కేసు పెట్టి నాటి ముఖ్యమంత్రే బాధ్యుడంటూ ఆయన్న జైలుకు పంపిన జగన్‌ ప్రభుత్వం.. 2019లో తాను కేంద్రం నుంచి తీసుకున్న ప్రశంసా పత్రాన్ని వెనక్కి ఇచ్చేస్తుందా?

* కుంభకోణం జరిగిందన్న అప్రతిష్ఠను మూటగట్టుకున్న నైపుణ్యాభివృద్ధి సంస్థను జగన్‌ ప్రభుత్వం వెంటనే మూసివేస్తుందా? అయితే ‘ఈ మూడు ప్రశ్నలకూ సమాధానం చెప్పాల్సింది జగన్‌ ప్రభుత్వమే కదా అని నేను సమాధానం చెప్పాను’ అని లక్ష్మీనారాయణ తన పోస్టులో పేర్కొన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు

‣ పీఓ కొలువుల ప్రిపరేషన్‌ ప్లాన్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.