• facebook
  • whatsapp
  • telegram

Engineering Admissions: ఇంజినీరింగ్‌ బ్రాంచి.. కాలేజీ ఎంపిక ఇలా.. 

* ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ వివరాలు

* అడ్మిషన్‌ ముందు ఏం చూడాలి?

తెలంగాణలో ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ తరుణం ఆసన్నమైంది. ఇంజినీరింగ్‌ రంగంలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి విద్యార్థులు సంసిద్ధులవుతున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో చేరిక విషయంలో ఏ మెలకువలు పాటించాలి? ఇంజినీరింగ్‌ ప్రవేశాల సందర్భంగా విద్యార్థులు మొదటగా ఎదుర్కొనేది కాలేజీ ఎంపిక, బ్రాంచి ఎంపిక. ‘చదవదలుచుకున్న బ్రాంచి ఏ కాలేజీలో దొరికినా చెయ్యాలా? లేకుంటే మంచి కాలేజీలో ఏ బ్రాంచిలో ప్రవేశం దొరికినా చదవాలా?’ అనేది సులువుగా సమాధానం దొరికే ప్రశ్న కాదు. మొదట కాలేజీ విషయానికి వస్తే... కాలేజీ మెరుగైందా కాదా అనే విషయాన్ని కింది అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలుసుకోవచ్చు. 

విద్యా ప్రమాణాలు పాటించే విషయంలో కాలేజీకి ప్రభుత్వపరంగా ధ్రువీకరణ ఉంటే మంచిది. అంటే ఎన్‌ఏఏసీ అక్రిడిటేషన్‌ ఉంటే మేలు. అలాగని ఇది లేని కాలేజీ మంచిది కాదని అర్థం కాదు. కానీ దీన్నొక అంశంగా తీసుకోవాలి. 

కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ అండ్‌ ఎంఎల్, డేటాసైన్స్, ఐఓటీ, సైబర్‌ సెక్యూరిటీ లాంటి బ్రాంచీలకు సాధ్యం కాదు కానీ ఇతర బ్రాంచిలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ ఉంటే మంచిది. ఆ బ్రాంచిలో విద్యా బోధన పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించి ఏఐసీటీఈ ఇచ్చే ధ్రువీకరణ ఇది. దీన్ని ప్రతి బ్రాంచికీ ప్రత్యేకంగా మూడు సంవత్సరాలకు ఇస్తారు. 

అటానమస్‌ స్థాయి (స్వయం ప్రతిపత్తి) ఉన్న కాలేజీ అయితే కొన్ని లాభాలు ఉంటాయి. ఉదాహరణకు సిలబస్‌లో మార్పులు. పరిశ్రమల అవసరాలను గుర్తించి వీటిని కొంతవరకు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే కొన్ని కొత్త సబ్జెక్టులు ప్రవేశపెట్టే వీలూ లభిస్తుంది. ఈ వెసులుబాటు వల్ల విద్యార్థులు కొత్త, అవసరమైన మెలకువలతో ముందస్తు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.

కాలేజీలో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఎలా ఉంటున్నాయి అనేది మరో అంశం. గత రెండు సంవత్సరాలుగా ప్రాంగణ నియామకాలు ఇంచుమించుగా లేవనే చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితిలో కంపెనీలు వర్చువల్‌గా నియామక ప్రక్రియను అవలంబిస్తున్నాయి. పైగా కొన్ని పెద్ద కంపెనీలు జాతీయ స్థాయిలో అర్హత పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించి తర్వాత వర్చువల్‌ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా కాలేజీలో ముందస్తు శిక్షణలు ఎలా ఇస్తున్నారు, అవి ఎంతమేరకు ఉపయోగపడ్డాయనేది బేరీజు వేసుకోవాలి. దీని కోసం కాలేజీకి వెళ్లి, అక్కడి సిబ్బంది, విద్యార్థులు, అవకాశం ఉంటే పూర్వ విద్యార్థులను కనుక్కోవాలి. సంతృప్తికరమైన సమాధానం దొరికే వరకు వాకబు చేయాలి. 

‣ ప్లేస్‌మెంట్‌ కోసం శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఏ సంవత్సరం నుంచి మొదలవుతుందనేదీ తెలుసుకోవాలి. నేటి పోటీ ప్రపంచంలో చివరి నిమిషంలో ఇచ్చే శిక్షణలు పెద్దగా ఉపకరించవు. వీటి మీదే ఆధారపడితే లాభం ఉండకపోవచ్చు. పైగా కొందరిలో ఒత్తిడి పెరిగి గందరగోళానికి గురికావచ్చు కూడా. జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాలంటే మొదటి సంవత్సరం నుంచే పునాది వేసుకోవాలి. గతంలోకి తొంగిచూస్తే.. కొన్ని కాలేజీలు.. ఈ దిశలో కష్టపడి ఫలితాలు సాధించి, పెద్ద కాలేజీలకే గట్టి పోటీనిచ్చి దీటుగా నిలబడ్డాయి; పేరు తెచ్చుకున్నాయి. 

ఇంజినీరింగ్‌ విద్య, ఉద్యోగం ఒక భాగం ఐతే... ఆటపాటలు, వినోదాత్మక కార్యక్రమాలు, విద్యా విషయక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కాలేజీలో అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయం చిన్నదయినా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి చాలా అవసరమైనది. ఒక విద్యార్థి రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొని ఉంటే, ఆ విద్యార్థి విద్యా విషయంలో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా తన అభిరుచినీ, ఆటల్లో ప్రావీణ్యాన్నీ పెంచుకునే అవకాశం ఎంతవరకు ఉంటుందో తప్పకుండా తెలుసుకోవాలి. 



సీఎస్‌ఈనా? అనుబంధ బ్రాంచీలా?

ఇది ఇంచుమించుగా అందరి మనసును తొలుస్తున్న ప్రశ్న. సీఎస్‌ఈ అయితే ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కాబట్టి అదే మంచిదనే అభిప్రాయం ఏర్పరుచుకోవడం సహజమే. అయితే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. 

1. సీఎస్‌ఈకీ, దాని అనుబంధ బ్రాంచీలకూ సిలబస్‌పరంగా గరిష్ఠంగా 5-10 శాతం మార్పు ఉంటుంది. సీఎస్‌ఈకి ఉన్న అవకాశాలు మిగిలినవారికి కూడా ఉంటాయి. ప్రత్యేకంగా ఆ రంగంలో ఉద్యోగావకాశం ఉంటే ముందుగానే శిక్షణ పొందిన అభ్యర్థికి అదనపు అవకాశం ఉంటుంది. ఒక కంపెనీ కృత్రిమ మేధ రంగంలో వ్యాపారాలు చేస్తూ ఉందనుకుందాం. ఈ సంస్థలో ఉద్యోగానికి సంబంధిత శిక్షణ ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం లభిస్తుంది. సీఎస్‌ఈ అభ్యర్థి కూడా అదనపు శిక్షణ పొందివుంటే ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది.

2. కంప్యూటర్‌ రంగంలో ఉన్న అన్ని బ్రాంచీలకూ ఇతర ఉద్యోగాల విషయంలో సమాన అవకాశాలుంటాయి. జీతం విషయానికొస్తే- ప్రత్యేక బ్రాంచిలో ప్రతిభను కనబరిచినవారికి సహజంగానే ఎక్కువ పారితోషికం ఉంటుంది.

వెబ్‌ ఆప్షన్లకు ముందు జాగ్రత్తలు

వెబ్‌ ఆప్షన్లు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజీ కోడ్, బ్రాంచి కోడ్‌ మాత్రమే ఉంటాయి. కాబట్టి పొరపాటు చేయకూడదు.

మంచి కాలేజీలో ఇష్టమైన బ్రాంచి వస్తే అంతా బాగానే ఉంటుంది. అలాకాని పక్షంలో కాలేజీకి ప్రాధాన్యమిస్తే బాగుంటుంది.

గుర్తించిన కాలేజీల కోడ్‌లను ఒక పట్టికలో రాసుకోవాలి. కాలేజీ పేరు, దాని కోడ్, బ్రాంచి పేరు, దాని కోడ్‌ క్రమంలో ఒక పట్టిక వేసుకోవాలి.

‣ బ్రాంచిని గుర్తించి దాని కోడ్‌ను పట్టికలో రాసుకోవటం మర్చిపోకూడదు. 

ఏ ర్యాంకు వారైనా కనీసం 60-80 ఆప్షన్లు తయారుచేసుకోవాలి. గరిష్ఠంగా 200 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 

తయారుచేసిన పట్టికలో ప్రాధాన్యాలను కూడా నింపుకోవాలి. ఒకవేళ కాలేజీకి ప్రాధాన్యమిస్తే ఆ కాలేజీలో ఉన్న అన్ని కోర్సులకూ క్రమంగా ప్రాధాన్యమివ్వాలి. అలా కాక బ్రాంచికి ప్రాధాన్యమిస్తే గుర్తించిన అన్ని కాలేజీలలో ఆ బ్రాంచికి క్రమంలో ప్రాధాన్యమిచ్చుకోవాలి. 

సీఎస్‌ఈ ఇష్టమైతే దానితోపాటు దాని అనుబధ బ్రాంచీలకు కూడా అదే క్రమంలో ప్రాధాన్య పట్టికను తయారు చేసుకోవాలి. ఇదే నియమం ఇతర బ్రాంచీలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు సివిల్‌ ఇంజినీరింగ్‌ ఇష్టమైతే సివిల్‌తోపాటు సివిల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌కి తర్వాతి ప్రాధాన్యమివ్వాలి.

పట్టికను రెండు, మూడుసార్లు సరిచూసుకుని, సవరణలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి. 

ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో తయారుచేసుకున్న పట్టిక ప్రకారం జాగ్రత్తగా నింపాలి. బ్రాంచి, కాలేజీల కోడ్‌ ఎంచుకోవడంలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి.

‣ తుది గడువు తేదీకి ముందుగానే ఆప్షన్లు పెట్టుకోవాలి. దీనివల్ల మళ్లీ వేరే ఆలోచన ఉంటే మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో పూర్తిచేస్తే.. జరిగిన పొరపాట్లకు సవరణలు చేసుకునే వీలుండదు. 

‣ ఇంజినీరింగ్‌ అనేది.. బాధ్యతాయుతమైన విద్య. ఇష్టమైన బ్రాంచిని కష్టపడి చదవాలి; ఉజ్వలమైన భవిష్యత్తుకు గట్టి పునాది వేసుకోవాలి.


ఏ బ్రాంచి మెరుగు?

బాగా గిరాకీ ఉంది అనుకుని.. ఇష్టంలేకపోయిన బ్రాంచి తీసుకుంటే చదవడానికి ఇబ్బందిపడవలసి వస్తుంది. నాలుగేళ్ల బీటెక్‌ నలభై ఏళ్ల జీవితానికి వేసుకునే పునాది. 

‣ మొట్టమొదటి గుడ్డి గుర్తు (థమ్‌ రూల్‌) ఏమిటంటే- ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచి అయినా మంచిదే. అన్ని బ్రాంచిలకూ సమాన ఉద్యోగావకాశాలుంటాయి. ఐతే కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి కదా అనే ప్రశ్న ఉదయించక తప్పదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. చాలావరకు కంపెనీలు కంప్యూటరీకరణ వైపు మొగ్గుచూపడం వల్ల ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ వేరే బ్రాంచీల్లో అవకాశాలు లేవని దీనర్థం కాదు. 

‣ కంప్యూటర్‌ రంగంలో ప్రోగ్రామింగ్‌ మెలకువలు బాగా ఉన్న అన్ని బ్రాంచీల్లోనూ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పైగా ఈ రంగంలో పెద్దగా ప్రోగ్రామింగ్‌ రాకపోయినా చెయ్యగలిగిన ఉద్యోగాలు కూడా ఉండటం విశేషం. అటువంటప్పుడు ఏ బ్రాంచి తీసుకుంటే మంచిది? 

మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి బ్రాంచి నిర్ణయం తీసుకోకూడదు. మన అభిరుచిని బట్టి ఏ బ్రాంచి మంచిదో నిర్ణయించుకోవాలి. కష్టపడటానికి ముందు.. ఇష్టపడి ఉండాలి. 

ఒక బ్రాంచి సులభం, మరోటి కష్టం అనే మాట నిజం కాదు. ఇంజినీరింగ్‌ అంటే.. సమాజానికి చెందిన విభిన్న రకాల సమస్యలకు పరిష్కార మార్గం, పరిష్కారం కనుక్కునే బాధ్యత. తాగే నీటి గ్లాసు నుంచి ప్రయాణించే విమానాల వరకు తిండి అవసరాల నుంచి, వినోదం కోసం చూసే వివిధ కార్యక్రమాల వరకూ అన్నిటితోనూ అల్లుకుని ఉంటుంది. ఇంతటి బాధ్యతను నిర్వర్తించాలంటే ఇంజినీరింగ్‌ ఎంత బాధ్యతాయుతమైన విద్యో తెలుస్తుంది. ఇలాంటి చదువును ఇష్టపడి చదవాలి, కష్టపడటానికి ఇష్టపడాలి.

‘కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో పెద్ద జీతాలు వస్తాయి’ అనుకుంటే ఒక కోణం నుంచి మాత్రమే చూసినట్టు అవుతుంది. మొదటగా పెద్ద జీతం అంటే.. అంతకంటే పెద్ద బాధ్యతలుంటాయి. రెండోది మధ్యస్థం (మీడియన్‌)గా తీసుకుంటే దీర్ఘకాలంలో అన్ని ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకూ జీతం ఇంచుమించుగా సమానంగానే ఉంటుంది.

ఇప్పుడు మార్కెట్‌లో ఫలానా బ్రాంచికి బాగా గిరాకీ ఉంది అనుకుని.. ఇష్టంలేకపోయిన బ్రాంచి తీసుకుంటే చదవడానికి ఇబ్బందిపడవలసి వస్తుంది. నాలుగేళ్ల బీటెక్‌ నలభై ఏళ్ల జీవితానికి వేసుకునే పునాది. ఇది గట్టిగా, బందోబస్తుగా ఉండాలి. మన ఇష్టం ఏమిటో తెలుసుకోవడానికి ఇబ్బందిగలిగితే పెద్దల, ఆయా రంగాలలో ఉన్న నిపుణుల సలహాలు, విద్యా కౌన్సెలర్ల సూచనలు తీసుకోవాలి. ఒక బ్రాంచిలో చదవడానికి అవసరమైన లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి. అవి మనలో ఎంతవరకు ఉన్నాయి, మనం ఎంత కష్టపడాల్సి ఉంటుందో తెలుసుకోవాలి. 

‣ అవసరమైన, మనలో ఉన్న లక్షణాల మధ్య వ్యత్యాసం ఎక్కడ తక్కువగా ఉంటుందో.. ఆ బ్రాంచిలు ఎంచుకుంటే బాగా నేర్చుకోగలమని అర్థం. 


సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌..

కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలోని కొత్త బ్రాంచీలు కేవలం కంప్యూటర్‌ సైన్స్‌కే పరిమితం కాదు. నిజానికి వీటిని ఇంటర్‌ డిసిప్లినరీ బ్రాంచీలుగా చెప్పుకోవాలి. అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ లాంటి సాంప్రదాయిక ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు కూడా ఈ కొత్త శాఖలకు సంబంధించిన కోర్సుల్లో స్వల్పకాలిక కోర్సులు చేస్తే.. వారికి ఈ రంగంతోపాటు సొంత రంగంలోనూ ఈ కొత్త టెక్నాలజీల అనుసంధానానికీ, అనువర్తనానికీ అవకాశం ఉంటుంది. 

మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో మెషిన్‌ డిజైన్‌ రంగంలో ఎన్నో వేల డిజైన్‌లను అభివృద్ధి చేశారు. ఇవన్నీ కేస్‌ స్టడీతో కూడుకున్న ఒక విలువైన, బృహత్తరమైన డేటాబేస్‌గా చూసుకుంటే మెషిన్‌ లర్నింగ్‌ ద్వారా ఈ డేటాబేస్‌ను శోధించి కొత్త డిజైన్‌ నిర్మించే బాధ్యతను కంప్యూటర్‌కి అప్పగించవచ్చు. దీనివల్ల ఇంజినీర్లకు ఇంతటి డేటాబేస్‌ను వెతికి పనికివచ్చే డిజైన్‌లను అభివృద్ధి చేసే ‘మూస పనికి’ ఎక్కువ సమయం వెచ్చించే అవసరం ఉండదు. శోధించి సందర్భానికి అతికే ఈ డిజైన్‌ను కంప్యూటర్‌కి అప్పగించవచ్చు. ఫలితంగా మిగిలే విలువైన సమయాన్ని కొత్త డిజైన్‌ల సృష్టికి వినియోగించవచ్చు. 

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో పరిశ్రమల్లో మోటర్‌ స్పీడ్‌ కంట్రోల్‌ అనేది మౌలికమైన అనువర్తం. డేటాసెట్‌లను ఉపయోగించి మెషిన్‌ లర్నింగ్‌ ద్వారా మోటర్‌ కంట్రోల్‌ సాధించవచ్చు. దీనికోసం ఇంజినీర్లు తమ విలువైన సమయాన్ని వృథా చేయనవసరం లేదు.

 ఇలాంటి అనువర్తనాలు ప్రతి ఇంజినీరింగ్‌ బ్రాంచిలోనూ సాధ్యమే. ఈ దిశలో పరిశోధనకు అవకాశం కల్పించడానికే జేఎన్‌టీయూ బీటెక్‌ మూడో సంవత్సరంలో సైబర్‌ సెక్యూరిటీ, మెషిన్‌ లర్నింగ్‌ సబ్జెక్టులను అన్ని బ్రాంచీలవారికీ అవసరమైన (మాండెటరీ) కోర్సుగా ప్రవేశపెట్టింది. అందువల్ల కేవలం సీఎస్‌ఈకే కాకుండా, అభిరుచిని బట్టి ఇతర బ్రాంచీల్లో ప్రవేశం తీసుకున్నా ఈ సెమిస్టర్‌ కోర్సులు చదవాలి. ఇలా చేయడం ద్వారా తమ బ్రాంచిలో ఈ కొత్త టెక్నాలజీల టూల్స్‌ని వినియోగించి చిన్న ప్రాజెక్ట్‌ చేస్తే.. వీరికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.