• facebook
  • whatsapp
  • telegram

108 ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు.. 30,723 పోస్టుల భ‌ర్తీ

* స్పష్టత వచ్చాక గ్రూప్‌-1 ప్రకటన
* ఉమ్మడి సిలబస్‌కు ఆమోదం రావాల్సి ఉంది
‘ఈనాడు’తో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి


ఈనాడు, హైదరాబాద్‌: సర్వీసు నిబంధనలు, జోనల్‌ పునర్విభజనపై ప్రభుత్వం నుంచి వివరణ రాగానే గ్రూప్‌-2, గ్రూప్‌-3తో పాటు 1,915 పోస్టుల ప్రకటనలపై నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటైనప్పటి నుంచి 36,758 పోస్టుల కోసం 108 ఉద్యోగ ప్రకటనలు వెలువరించి.. 30,723 పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. గ్రూప్‌-1 ప్రకటనకు రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవరణ ప్రతిపాదనలు రావాల్సి ఉందన్నారు. నియామకాల ప్రక్రియలో ఆదర్శవంతమైన సంస్కరణలు ప్రవేశపెట్టామని వివరించారు. దేశంలోనే తొలిసారిగా ఒక విదేశీ పీఎస్సీ (మారిషస్‌)కి సూచనలు, సలహాలు ఇచ్చామని వివరించారు. హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌, భాషా పండితుల పోస్టుల ఫలితాలను దసరాలోపు వెల్లడిస్తామని ప్రకటించారు. కరోనా సమయంలోనూ 1,595 పోస్టులతో గ్రూప్‌-4 ఫలితాలు వెల్లడించామని, ఈ ఏడాది వెలువరించిన నాలుగు ఉద్యోగ ప్రకటనలకు నవంబరు తొలివారంలో పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. తక్కువ కాలంలో దేశంలో ఏ ఇతర పీఎస్సీ అందుకోలేని స్థాయిలో వేలాది ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో రెండు నెలల్లో (డిసెంబరు 17న) పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ‘ఈనాడు’తో మాట్లాడారు.

సర్వీసు నిబంధనల్లో లోపాలు, న్యాయ వివాదాలతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది కదా..?
వివాదాల కారణంగా అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొన్ని పోస్టుల భర్తీలో ఆలస్యమైంది. ప్రస్తుతం 1,419 పోస్టుల భర్తీ నిలిచిపోయింది. వాటిలో గురుకుల ప్రిన్సిపల్‌ (303), హిందీ టీచర్‌ పోస్టులు (500), గురుకుల పీఈటీ (616) పోస్టులు ఉన్నాయి. హిందీ పోస్టులకు విద్యార్హతలపై న్యాయస్థానం సూచనల మేరకు జీవోపై ప్రభుత్వ స్పష్టత కోరాం. వీలైనంత వరకు దసరాలోగా ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్యశాఖ నుంచి స్పష్టత రాకపోవడంతో 4,330 పారా మెడికల్‌ పోస్టులు నిలిచిపోయాయి. మొదట ఇచ్చిన ప్రకటన మేరకు కాంట్రాక్టు సిబ్బందికి వెయిటేజి ఇచ్చాం. కొందరు పొరుగు సేవల సిబ్బంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే డిసెంబరు నాటికి ఫలితాలు వెల్లడించే అవకాశముంది. గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీలో కొందరు ఇచ్చిన అనుభవ పత్రాలు బోగస్‌వని తేలింది. దీంతో మరికొందరు అభ్యర్థులు న్యాయస్థానానికి వెళ్లారు. పీఈటీ పోస్టుల విషయంలో అర్హతల వారీగా పోస్టులను విభజించి భర్తీ చేయాలని న్యాయస్థానం తెలిపింది. ఆ వివరాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.

యూపీఎస్సీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా మీరు చేసిన ఉమ్మడి సిలబస్‌ సంస్కరణ ఇక్కడ ఎందుకు అమలవ్వలేదు?
యూపీఎస్సీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా పలు సంస్కరణలు తీసుకువచ్చా. అన్ని రాష్ట్రాల పీఎస్సీలకు ఒకేరకమైన నిబంధనలు ఉండాలని చెప్పా. టీఎస్‌పీఎస్సీ సంస్కరణలను వివిధ రాష్ట్రాల పీఎస్సీలు అభినందించాయి. ఐటీ, ఇతర సాంకేతిక విభాగాల్లో మనమే అగ్రస్థానంలో ఉన్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడేలా ఉమ్మడి సిలబస్‌ ప్రతిపాదించా. గ్రూప్‌-1, 2 స్థాయి ఉద్యోగాలకు, యూపీఎస్సీ ఉద్యోగాలకు 80 శాతం ఉమ్మడి సిలబస్‌, 20 శాతం రాష్ట్ర సిలబస్‌ ఉండాలన్న ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇక్కడా అమలు పరచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి వస్తే ఉమ్మడి సిలబస్‌ అందుబాటులోకి వస్తుంది.

రామకృష్ణయ్య కమిటీ సిఫార్సుల మేరకు ఉద్యోగ క్యాలెండర్‌ ఎందుకు అమలు కాలేదు?
టీఎస్‌పీఎస్సీలో అమలు చేయాల్సిన సంస్కరణలను రామకృష్ణయ్య కమిటీ సూచించింది. ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించాలన్నది ప్రతిపాదన. ఈ ప్రక్రియ చేయాల్సింది కమిషన్‌ కాదు. ప్రభుత్వం ప్రకటించాలి. కొన్ని రాష్ట్రాల్లో ఈ క్యాలెండర్‌ అమలవుతోంది. ఏటా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జాబితాను తీసుకుని ఆ మేరకు క్యాలెండర్‌ విడుదల చేసి పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేరళలో ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి కొత్త ఉద్యోగులు వెంటనే చేరేలా ముందస్తు నియామకాలు చేపడుతోంది. మన రాష్ట్రంలోనూ ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపాం.

గ్రూప్‌-1, 2, 3 ప్రకటనలు ఎప్పుడు వచ్చే అవకాశముంది?
గ్రూప్‌-1 కింద 142, గ్రూప్‌-2 కింద 60, గ్రూప్‌-3 కింద 400 వరకు పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. గతంలో గ్రూప్‌-1 రాష్ట్రస్థాయి పోస్టులు.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం మల్టీజోన్‌ కిందకు వచ్చాయి. గుర్తించిన పోస్టులు ఏయే జోన్ల కిందకు వస్తాయో ప్రభుత్వం పునర్విభజన చేసి పంపించాల్సి ఉంది. దీనిపై రెండుసార్లు సీఎస్‌కు లేఖ రాశాం. గ్రూప్‌-2, 3 పరిస్థితి ఇంతే. గ్రూప్‌-3 పోస్టులపైనా స్పష్టత రావాలి. ఇవన్నీ విభాగాధిపతుల కార్యాలయాల పరిధిలోనివి. ఈ పోస్టులు కేవలం చార్మినార్‌ జోన్‌ వారికే పరిమితం చేస్తారో లేక అన్ని జోన్ల వారినీ అనుమతిస్తారో వివరణ రావాలి. ఈ కారణాలతో గ్రూప్‌-1, 2, 3లలో.. మొత్తం 1,915 పోస్టులకు ప్రకటనలు వెలువరించలేదు.

కొత్త ప్రకటనలు రావడం లేదని నిరుద్యోగులు అంటున్నారు?
నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంది. అయితే అర్హులైన అందరికీ ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం. ప్రభుత్వం నుంచి 39,952 పోస్టుల భర్తీకి అనుమతి వచ్చింది. వాటిలో 1,915 పోస్టులు మినహాయిస్తే మిగతావాటికి ప్రకటనలు వెలువరించి, పరీక్షలు నిర్వహించాం. భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం సంస్కరణలు తీసుకువచ్చాం. ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రవేశపెట్టాం. వన్‌టైం రిజిస్ట్రేషన్‌ అమల్లోకి తెచ్చాం. మౌఖిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి వ్యక్తిగత వివరాలు బోర్డులో సభ్యులకు తెలియకుండా చేయడం, ప్రతి రోజూ బోర్డు సభ్యులను ఆన్‌లైన్‌ విధానంలో ఎంపిక చేయడం లాంటి సంస్కరణలను అభ్యర్థులు మెచ్చుకున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పోస్టుల పునర్విభజన జరిగితే ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశముంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.