• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ బోధన మాతృభాషలో సాగాలి

* కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉచితంగా ఇవ్వాలి
* వెబినార్‌లో విద్యావేత్తల అభిప్రాయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కొవిడ్‌ నేపథ్యంలో పిల్లలను ఆన్‌లైన్‌ విద్యవైపు మరల్చడానికి వారిలో ప్రేరణ నింపడమే ముఖ్యమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. మాతృభాషలో బోధన దీనికి బాగా ఉపకరిస్తుందని వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లలను బెదిరించడం, కొట్టడం ద్వారా ఆన్‌లైన్‌ విద్య సాధ్యపడదని, వారి మనసును తెలుసుకోవాలని సూచించారు. చిన్నారులు ఆన్‌లైన్‌ తరగతుల్లో ఉన్నంతసేపు వారిపై పర్యవేక్షణ అవసరమన్నారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యాబోధనలో సమస్యలపై తానా సహకారంతో కిన్నెర స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో అక్టోబ‌రు 18న‌ నిర్వహించిన వెబినార్‌లో విద్యావేత్తలు డాక్టర్‌ మూల్పూరి వెంకటరావు, డాక్టర్‌ సీతారామారావు, పాల్గొనగా రవిరాంప్రసాద్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. వక్తలు మాట్లాడుతూ ‘విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చదువు చెప్పడం సవాలే. ఈ విధానంతో కుటుంబం, పాఠశాల రెండూ ఒకటిగా మారాయి. దీనిపై తల్లిదండ్రులకు యాజమాన్యాలు స్పష్టతనివ్వాలి. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడానికి తల్లిదండ్రులకు ఇది మహత్తర అవకాశం. సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు.పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఉచితంగా ఇవ్వాలని వారు సూచించారు. ‘విద్యారంగానికి వేలకోట్లు కేటాయించే ప్రభుత్వాలకు ఇది పెద్ద సమస్య కాదు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలూ ముందుకు రావాలి. కొవిడ్‌ మహమ్మారి తగ్గిన తర్వాత కూడా ఆన్‌లైన్‌ విద్య కొనసాగే అవకాశం ఉంది. గ్రామాల్లోని పిల్లలకు మంచి విద్య అందేందుకు ఇదో అవకాశం. సబ్జెక్టుకే పరిమితం కాకుండా సృజనాత్మక అంశాలు నేర్చుకునేందుకు వీలు కలుగుతుంది’ అని పేర్కొన్నారు.‘ఈ విధానంలో బోధనకు ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులకు బోధించడానికి గతంలో కంటే మరింత పరిశ్రమ అవసరం. చెప్పిన అంశం పిల్లలకు ఎంతవరకు అర్థమైందో గుర్తించగలగాలి. బోధించిన అంశాన్ని రికార్డింగ్‌ రూపంలో పిల్లలకు అందుబాటులో ఉంచాలి’ అని సూచించారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.