• facebook
  • whatsapp
  • telegram

కొత్త‌ ఏడాది ఇంటర్న్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీలకు శ్రీకారం

బీటెక్‌లో విరామ సంవత్సరం
‣ కోర్సుతోపాటు ఆసక్తి ఉన్న సబ్జెక్టులు చదివే అవకాశం


ఈనాడు - అమరావతి: ఉద్యోగం, ఉపాధికి బాటలు వేయటమే లక్ష్యంగా ఉన్నత విద్యలో ఈ ఏడాది నుంచి ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీలు వచ్చేశాయి. విద్యార్థి తాను చదివే డిగ్రీ కోర్సుతోపాటు ఇతర సబ్జెక్టులను చదివేయొచ్చు. బీటెక్‌లో విరామ సంవత్సరాన్ని తీసుకొచ్చారు. పూర్తిస్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారాలనుకునే విద్యార్థి ఏడాది విరామం తీసుకోవచ్చు. మూడేళ్లలో ఎప్పుడైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని రెండేళ్లకు పొడిగించుకోవచ్చు.
ప్రస్తుతం ప్రవేశాలు పొందనున్న విద్యార్థులతో ఈ కొత్త విధానం ప్రారంభం కానుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా వచ్చిన సంస్కరణలతో ఉన్నత విద్యలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి..
బీటెక్‌లో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. రెండు, మూడు సంవత్సరాల వేసవి సెలవుల్లో రెండు నెలల చొప్పున, చివరి ఏడాదిలో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థి సమర్పించే నివేదికకు 40%, ప్రదర్శనకు 60% వెయిటేజీ ఇస్తారు. ఇది పూర్తి చేయకుంటే బీటెక్‌ పట్టాను ప్రదానం చేయరు.

నాలుగేళ్ల ఆనర్స్‌..
ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీలను ప్రవేశపెడుతున్నారు. విద్యార్థి మూడేళ్లు చదివిన తర్వాత బయటకు వెళ్లిపోవాలంటే వెళ్లిపోవచ్చు. ఇందుకు డిగ్రీ ప్రదానం చేస్తారు. నాలుగో ఏడాది పరిశోధన ఉంటుంది. ఇది పూర్తి చేస్తే నాలుగేళ్ల పరిశోధన ఆనర్స్‌ డిగ్రీ ఇస్తారు. వీరు పీజీలో రెండో ఏడాదిలో ప్రవేశం పొందవచ్చు.
విద్యార్థులందరికీ 10నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్‌, ఉద్యోగ శిక్షణ ఉంటుంది. మొదటి, రెండు ఏడాదిల్లో వేసవి సెలవుల్లో రెండు నెలలు చొప్పున ..మూడో ఏడాదిలో ఆరు నెలలు ఉద్యోగ శిక్షణ ఇస్తారు.
అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా కమ్యూనిటీ సేవా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. కళాశాలల చుట్టుపక్కల ఉండే గ్రామాల అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములవుతారు.
ఆన్‌లైన్‌ కోర్సులు చేసేవారికి, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌జీసీలో పాల్గొనే వారికి అదనంగా క్రెడిట్స్‌ ఉంటాయి.
అప్రెంటిస్‌షిప్‌ డిగ్రీలో విద్యార్థులు తాను చదివే డిగ్రీ కోర్సుతోపాటు ఇతర కోర్సుల్లోని కోర్‌ సబ్జెక్టులో 24క్రెడిట్లు సాధిస్తే ఆ సబ్జెక్టులో కూడా పీజీ చేసుకోవచ్చు. ఉదాహరణకు బీబీఏ లాజిస్టిక్స్‌ అప్రెంటిస్‌షిప్‌ విద్యార్థి కోర్‌కోర్సు ఆర్థిక శాస్త్రంలో 24క్రెడిట్లు సాధిస్తే పీజీ ఎంఏ, ఎమ్మెస్సీ ఆర్థిక శాస్త్రం చదివేందుకు అర్హత లభిస్తుంది.

బీటెక్‌లో ఆనర్స్‌ డిగ్రీ..
బీటెక్‌తోపాటు అదనంగా కోర్సులు చదివే వారికి ఆనర్స్‌ ఇస్తారు. ఆనర్స్‌ చేయాలనుకునే విద్యార్థులకు సెమిస్టర్‌ గ్రేడ్‌ పాయింట్‌ సరాసరి(ఎస్‌జీపీఏ) 7.5 ఉండాలి. అన్ని సబ్జెక్టుల్లోనూ అర్హత క్రెడిట్లు సాధించాల్సి ఉంటుంది. మూడో సెమిస్టర్‌ పూర్తయ్యే సరికి ఈ ఎస్‌జీపీఏను సాధించాలి. నాలుగో సెమిస్టర్‌ నుంచి ఆనర్స్‌ డిగ్రీ ప్రారంభమవుతుంది.
విద్యార్థి తాను చదువుతున్న బ్రాంచికి సంబంధించిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి తాను చదివే వాటిల్లోనే సబ్జెక్టులను ఎంపిక చేసుకొని ఆనర్స్‌ పూర్తి చేస్తే మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌(ఆనర్స్‌) ఇస్తారు.
విద్యార్థులు తాను చదువుతున్న బ్రాంచి కాకుండా వేరే బ్రాంచిలోనూ ఆనర్స్‌ మైనర్‌ డిగ్రీ పూర్తి చేయొచ్చు. మెకానికల్‌ చదువుతున్న విద్యార్థి సివిల్‌ నుంచి కొన్ని సబ్జెక్టులను ఎంచుకొని చదవొచ్చు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.