• facebook
  • whatsapp
  • telegram

తొలుత చివరి ఏడాది విద్యార్థులకే 

* డిగ్రీ, పీజీ ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై ఉన్నత విద్యామండలి ప్రాథమిక నిర్ణయం

* బీటెక్‌లో 3, 4 సంవత్సరాలకు..  

* జులైలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు

* ప్రభుత్వ ఆమోదం తర్వాత తుది నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చివరి సంవత్సరం విద్యార్థులకే తొలుత ప్రత్యక్ష తరగతి గది(ఆఫ్‌లైన్‌) బోధన జరగనుంది. బీటెక్‌లో మాత్రం మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి జ‌న‌వ‌రి 18న‌ ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్లతో విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి జ‌న‌వ‌రి 18న‌ చర్చించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్లు గోపాల్‌రెడ్డి, మంజూర్‌ హుస్సేన్, పవన్‌కుమార్‌ తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆయా ప్రతిపాదనలపై ప్రభుత్వ ఆమోదం తీసుకొని అమలు చేస్తామని ఛైర్మన్‌ పాపిరెడ్డి చెప్పారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆర్‌.లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. బీటెక్‌ విద్యార్థుల్లో సగం మంది విదేశీ చదువులకు దరఖాస్తు చేసుకుంటారని, అందువల్ల వారికి ఇబ్బంది లేకుండా సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌కు పాపిరెడ్డి సూచించారు. 

ఇవీ ప్రాథమిక నిర్ణయాలు..

* చివరి ఏడాది వారికి ప్రాక్టికల్స్‌ ఉన్నందున తొలుత వారికి ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బీటెక్‌లో మాత్రం చివరి ఏడాదితోపాటు మూడో ఏడాది విద్యార్థులకు కూడా ప్రత్యక్ష తరగతి గది బోధన జరుగుతుంది. ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. 

* పీజీ తొలి ఏడాది ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నందున, వాటి తరగతులపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మార్చిలో లేదా ఆ తర్వాత వారికి ప్రత్యక్ష తరగతులు ఉండొచ్చన్నారు. 

* సంప్రదాయ డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు జులైలో చివరి పరీక్షలు నిర్వహిస్తారు. డిగ్రీ 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు మార్చిలో జరుగుతాయి.

హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ..

రాష్ట్రవ్యాప్తంగా పీజీ చివరి ఏడాది విద్యార్థులు 8,500 మంది హాస్టళ్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల హాస్టళ్లను తెరవాలని నిర్ణయించారు. అందుకు ఉన్నత విద్యామండలి కొంతమేర నిధులు  సమకూర్చనుంది. కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో శౌచాలయాలను ప్రతిరోజూ రెండుసార్లు, గదులను క్రమం తప్పకుండా శానిటైజ్‌ చేస్తారు. హాస్టళ్లలో విద్యార్థులు అందరూ ఒకచోటకు వచ్చి భోజనం చేయకుండా.. నాలుగైదు చోట్ల ఏర్పాట్లు చేస్తారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.