• facebook
  • twitter
  • whatsapp
  • telegram

‘నో’ చెప్పలేకపోతున్నారా?    

మిత్రులకు సహాయం చేయటం, అవసరమైతే  వారి నుంచి సాయం తీసుకోవటం  సహజమైన విషయాలే. కానీ మీకు వీలు   కానప్పుడూ, సమయం లేనప్పుడూ ‘నో’ అని స్పష్టంగా చెప్పగలగటం ఓ జీవన నైపుణ్యం. ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో తప్ప సొంత పనులు పక్కనపెట్టి మరీ ఇతరుల పనులు చక్కబెట్టాల్సిన అవసరమేమీ ఉండదు. ఎదుటివాళ్లను నొప్పించకుండా అలాగని మీరూ ఇబ్బందిపడకుండా ప్రవర్తించడం మీ చేతుల్లోనే ఉంటుంది! కాపీ చేసుకుని వెంటనే ఇచ్చేస్తానంటే తన  నోట్‌బుక్‌ను స్నేహితురాలికి ఇచ్చింది సృజన. రెండు రోజుల్లోనే తిరిగి ఇచ్చేస్తానన్న స్నేహితురాలు వారం తర్వాత ‘నీ నోట్‌బుక్‌ కనిపించడం లేదు. ఏమీ అనుకోవద్దు’ అని చల్లగా చెప్పేయటంతో హతాశురాలైంది. నిజానికి తను ఎంతో కష్టపడి సిద్ధం చేసుకున్న ఆ పుస్తకాన్ని ఎవరికీ ఇవ్వడం ఇష్టంలేకపోయినా..స్నేహితురాలు అడిగిందన్న మొహమాటంతో కాదనలేకపోయింది సృజన.  

రిషిదీ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. సహోద్యోగి సాయమడిగితే కాదనలేని మొహమాటంతో అతడి పనిని తనే పూర్తిచేసి ఇచ్చాడు. దీంతో తాను చేయాల్సిన పనుల్లో జాప్యం జరిగింది. పై అధికారితో చివాట్లు తినాల్సి వచ్చింది. సహోద్యోగి అడిగినప్పుడే.. అత్యవసరంగా పూర్తిచేయాల్సిన పనులు తనకున్నాయనీ.. సాయం చేయలేననీ చెప్పివుంటే.. బాస్‌తో అతడు మాటలు పడాల్సివచ్చేది కాదు.

రిషి, సృజన.. వీళ్లిద్దరూ మిత్రులకు సాయం చేయలేమని చెప్పాలని ఉన్నా.. మొహమాటంతో అది చెప్పలేక ఇబ్బంది పడ్డారు. నిజానికి ‘లేదు’, ‘కాదు’ అని చెప్పడం పెద్ద నేరమో, ఘోరమో కాదు. అయితే అలా చెప్పినా ఎదుటివాళ్లు నొచ్చుకోకుండా మర్యాదగా చెప్పగలగాలి. దానికి తగిన కారణమూ ఉండాలి. 
సాధారణంగా చాలామంది తమ వల్ల ‘కాదు’ అని చెప్పడానికి చాలా ఇబ్బందిపడుతుంటారు. ఉద్యోగుల విషయానికి వస్తే.. మొహమాటంతోనో లేదా పై అధికారుల వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతోనో.. ఇష్టంలేకపోయినా అనేక పనులను ఒకేసారి చేయడానికి ఒప్పుకుంటారు. కొందరు ఉద్యోగులైతే పై అధికారులు, సహోద్యోగులు... ఇలా ఎవరు ఏ పని చెప్పినా ‘నో’ చెప్పలేరు. దాంతో ప్రతి పనినీ ఒప్పుకుని.. వాటికి న్యాయం చేయలేక, తమకు కేటాయించిన పనులను సకాలంలో పూర్తిచేయలేక చిక్కుల్లో పడుతుంటారు. 

అలా కాకుండా ఉండాలంటే పాటించాల్సినవి..

సకారణంగా: మీరొక అసైన్‌మెంట్‌ను నిర్ణీత కాలపరిమితి లోపల పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈలోగా బాస్‌ మీకు మరో పనిని అప్పగించినప్పుడు... మీరు ప్రస్తుతం చేస్తోన్న పని గురించి తెలియజేయవచ్చు. కానీ అప్పుడు కూడా మౌనంగా ఉండి వేరే పని చేయడానికి ఒప్పుకుంటే మీ చేతిలో ఉన్న పనిని సకాలంలో పూర్తిచేయలేరు. ఇలాంటి సందర్భంలో ‘చేయలేమ’ని చెప్పడం తప్పు కాదు. కాకపోతే ఆ పనిని ఎందుకు చేయలేరని అంటున్నారో సరైన కారణాలను వివరించగలగాలి. 

అదనపు సమయం: కొత్త పనిని మొహమాటం కొద్దీ ఒప్పుకుంటున్నారంటే.. మీకు అంతకుముందు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టే. అందుకే మీ పరిస్థితిని బాస్‌కు వివరిస్తే కొత్త పనిని మరొకరికి అప్పగించే అవకాశముంటుంది. మీకిచ్చే ప్రత్యేక పని కోసం అదనపు సమయాన్ని కేటాయించే అవకాశమూ లేకపోలేదు. లేదా మీరే అదనపు సమయాన్ని ఇవ్వమని అడగొచ్చు. మొహమాటంలో ఒప్పుకుంటే మీ పని, అదనపు బాధ్యతలను సక్రమంగా పూర్తిచేయలేక ఇబ్బందిపడాల్సి వస్తుంది.

శిక్షణకు అవకాశం: ఒక్కోసారి బాస్‌ మీకో కొత్త ప్రాజెక్టును అప్పగించివచ్చు. కానీ దాన్ని పూర్తిచేయడానికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యాలు మీకు అంతగా లేకపోవచ్చు. అయినా మీరు కాదని చెప్పలేక మొహమాటంతో ఒప్పుకుని తప్పులు చేయకూడదు. ఈ సమస్యను తప్పనిసరిగా బాస్‌ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన శిక్షణను మీకు అందించే అవకాశముంటుంది. అలాకాకుండా ప్రాజెక్టు పూర్తిచేస్తానని ఒప్పుకుని నైపుణ్యలేమితో తప్పులు చేయడం వల్ల మీ మీద అప్పటివరకూ ఉన్న సదభిప్రాయాన్ని కోల్పోయే అవకాశముంటుంది.

ఇవి గుర్తుంచుకోండి..

1.  విద్యాలయాల్లో లేదా కార్యాలయాల్లో ఎవరైనా సహాయం అడిగనప్పుడు వెంటనే కాదని చెప్పేయకూడదు. ఇలా చేయడం వల్ల ఎదుటివాళ్ల మనసును మీకు తెలియకుండానే నొప్పించిన వాళ్లు అవుతారు. అలాగని సాయం చేసే పరిస్థితి మీకు లేకపోయినా ‘నో’ చెప్పడానికి మొహమాటపడకూడదు. 

2.  ఒక్కోసారి వెంటనే సాయం అందించే పరిస్థితులు మీకు లేకపోవచ్చు. అలాంటప్పుడు మీ పరిస్థితిని వివరించి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎదుటివాళ్లు అడిగిన పనిని పూర్తిచేస్తానని వివరించటం సబబు. 

3.  మీ పనులతోనే మీరు సతమతం కావచ్చు. అలాంటప్పుడు ఈసారికి కుదరదుగానీ.. భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరమైతే చూద్దామని మర్యాదగా చెప్పొచ్చు. 

4.  ముందుగా మీకు కేటాయించిన పనులను పూర్తిచేసి.. ఆ తర్వాత సమయం ఉంటే ఎదుటివాళ్లు అడిగిన సాయం అందిస్తాననటం సముచితం. 

5.  ‘కాద’ని చెప్పడం తప్పు కాదు గానీ.. చేస్తానని మాట ఇచ్చి చేయకపోవడం మాత్రం పొరపాటవుతుంది. 

ఇలాంటి కారణాలు చెప్పకూడదు...

ఉదాహరణకు ఒక ప్రాజెక్టును పూర్తిచేయడానికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యాలు మీకు పుష్కలంగా ఉండి ఉండొచ్చు. అలాంటప్పుడు అదనంగా మీకు ఏమైనా పని కేటాయించినప్పుడు ప్రాజెక్టు చాలా క్లిష్టంగా ఉండటం వల్ల దాన్ని పూర్తిచేయడం ‘నా వల్ల కాద]’ని చెప్పేయకూడదు. ఇలా చెబితే కావాలని మీరు కుంటి సాకులు చెబుతున్నారనే సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. 

ఏదైనా కొత్త బాధ్యతను మీకు అప్పగించినప్పుడు.. ‘నాకు కేటాయించిన విధుల్లో ఇది లేదు. కాబట్టి ఈ పని నేను చేయలేను’ అని చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల.. ఆ పని చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు మీకు ఉన్నా తప్పించుకోవడానికే అలా చెబుతున్నారనేది ఎవరికైనా తెలిసిపోతుంది.

ఒక పనిని అప్పగించినప్పుడు దాన్ని కాదని చెప్పడానికి కొంతమంది వ్యక్తిగత కారణాలను చూపిస్తుంటారు. ‘ఊరికి వెళ్లాల్సిన పని ఉంది/ ఆరోగ్యం సరిగాలేదు’ అని చెబుతుంటారు. ఇలా వ్యక్తిగత కారణాలు చెప్పి విధులు నిర్వర్తించడానికి వెనకడుగు వేసే వాళ్ల మీద అధికారులకు మంచి అభిప్రాయం కలగదు. సహేతుకమైన కారణం ఉన్నప్పుడే మాత్రమే ‘కాద’ని చెప్పగలగాలి. 

Posted Date : 15-09-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌