• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చిక్కులు ఎదురైతే... చెక్‌ పెట్టేది ఇలా! 

కెరియర్‌లో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా అధిగమించాలి

 

 

విద్యాభ్యాసం అయినా.. ఉద్యోగ సాధన అయినా.. పూలబాటగా ఉండదు. ఏ సమస్యా  లేకుండా సాఫీగా, సానుకూలంగా సాగదు. చిన్నవో, పెద్దవో చిక్కులు వస్తూనే ఉంటాయి. వాటికి బెంబేలెత్తకుండా చాకచక్యంగా అధిగమించటానికి ప్రయత్నించాలి.  మన బాటలో అవరోధాలు ఎదురవ్వటం సహజమనీ, అవి మన ఎదుగుదలకు ఉపకరించేవేననీ గ్రహించాలి. ఈ  దృష్టికోణం కెరియర్‌ తీర్చిదిద్దుకోవటంలో చాలా ముఖ్యం!  

 

కారణాల అన్వేషణ

ఇంజినీరింగ్‌ చదువుతోన్న రజిత ఏ చిన్న సమస్య వచ్చినా ఒత్తిడికి గురవుతుంటుంది. ఇంటర్‌ పూర్తికాగానే ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి తీసుకోవాలనేది ఆమెకు పెద్ద సమస్యగా కనిపించింది. ఆ తర్వాత సెమిస్టర్‌లో సాధించే మార్కుల విషయంలోనూ ఆందోళన పడుతుండేది. స్నేహితులకు తన కంటే ఎక్కువ మార్కులు వస్తే... దిగులు పడిపోయేది. తనెందుకూ పనికిరానిదాన్నని బాధపడుతూ కూర్చునేది. 

 

ఆమెలాంటి విద్యార్థులు ఎందరో. వీరికి సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించుకునే నైపుణ్యం ఉండటం లేదు. ఉద్యోగార్థులకూ ఇదెంతో అవసరం. ఇంటర్వ్యూ సమయంలో.. రిక్రూటర్లూ అభ్యర్థుల సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని  నిశితంగా పరీక్షిస్తారు. ఉద్యోగంలో చేరాక కూడా ఈ నైపుణ్యం ఎంతో అవసరం. తరగతి గదిలో బోధించని.. అందరికీ ఎంతో ఉపయుక్తమైన ఈ సాఫ్ట్‌స్కిల్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందామా... 

 

ఒక సమస్య ఎదురుకాగానే అందరి దృష్టీ దాని మీద మాత్రమే ఉంటుంది. కానీ సమస్యను గురించి కాకుండా అది తలెత్తడం వెనక ఉండే కారణాలను అన్వేషించాలి. ఆ తర్వాత వాటిని విశ్లేషించాలి. దీని కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించాలి. ఎలాంటి పరిస్థితుల్లో సమస్య ఉత్పన్నమైందో తెలుసుకోవాలి. ఆ తర్వాత పరిష్కార మార్గాలనూ అన్వేషించాలి. గతంలో ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఎలా పరిష్కరించారో కూడా గమనించాలి. అంటే సమాచారాన్ని సేకరించడం, దాన్ని విశ్లేషించడం, దాంట్లోని నిజానిజాలను గుర్తించడం, నేపథ్యాన్ని తెలుసుకోవడం లాంటి పనులు చేయాలి. 

 

ఉదాహరణకు సమతకు గణితం అంటే చాలా భయం. ఎంత కష్టపడి లెక్కలు చేసినా స్నేహితుల కంటే తక్కువ మార్కులే వచ్చేవి. దాంతో తనకు లెక్కలు చేయడానికి తగిన తెలివితేటలు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని బాధపడేది. అలా కాకుండా... తరగతి గదిలో బోధించినప్పుడు అర్థంకావడంలేదా, ఆసక్తి లేకపోవడమా లేదా వాటి మీద ఎక్కువ సమయం కేటాయించలేకపోవడమా... ఇలా తక్కువ మార్కులు రావడానికి కారణాలు అన్వేషించి పరిష్కారాలను కనిపెట్టాలి. బోధించే సమయంలోనే ఏదైనా అర్థం కాకపోతే అడిగి తన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. స్నేహితులను అడిగీ సులువైన మార్గాల గురించి తెలుసుకోవచ్చు. లేదా కాస్త కష్టంగా అనిపించిన సబ్జెక్టుకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. అసలు కారణం ఏమిటో తెలిస్తే సమస్యను పరిష్కరించడం సులువవుతుంది. 

 

కలసి ఆలోచిస్తే మేలు

కారణాన్ని తెలుసుకున్న తర్వాత దాని పరిష్కారానికి మేధా మథనం మొదలుపెట్టాలి. ఒంటరిగా ఆలోచించే కంటే.. ఈ విషయంలో స్నేహితుల, సీనియర్ల సహాయ సహకారాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నలుగురైదుగురు కలిసి ఆలోచించడం వల్ల వివిధ రకరకాల పరిష్కారాలను కనిపెట్టొచ్చు. ఒక సమస్యకు ఎప్పుడూ ఒక్కటే పరిష్కారం ఉండదు. నాలుగైదు రకాల పరిష్కారాలుంటాయి. వాటిలో నుంచి ఆచరణయోగ్యంగా ఉండి, మనసుకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్నది ఏమాత్రం ఆచరణయోగ్యంగా లేపునప్పుడు.. మరోదాన్ని ఎంచుకుని నిరభ్యంతరంగా అమలుచేయొచ్చు. ఇక్కడ మరో విషయాన్నీ గుర్తుంచుకోవాలి. పరిష్కారంలేని సమస్యంటూ ఏమీ ఉండదు. కలసికట్టుగా ఆలోచిస్తే సరైన పరిష్కారాన్నీ ఎంచుకోవచ్చు. 

 

ఫలితాల అంచనా 

సమస్య స్వభావాన్ని బట్టి రకరకాల పరిష్కారాలను కనిపెట్టిన తర్వాత ఫలితాలను అంచనా వేయాలి. దీనికోసం దాన్ని పరిష్కరించగలిగే అర్హత, నేర్పు ఉన్నవాళ్లను సంప్రదించాలి. దీనివల్ల ఫలితాలను ముందుచూపుతో అంచనా వేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఊహించినదానికి వ్యతిరేకంగానూ ఫలితాలు ఉండొచ్చు. అలాంటప్పుడు మరో పరిష్కార మార్గాన్ని అనుసరించి అనుకూలమైన ఫలితాలను పొందడానికి ప్రయత్నించాలి. అంచనా వేయడంలో స్నేహితుల, సీనియర్ల సలహాలు తీసుకోవచ్చు. 

 

పునః పరిశీలన మంచిదే 

సమస్యా పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషిచేయడం వరకూ బానే ఉంటుంది. అయితే మధ్యలో ఫలితాలనూ పరిశీలిస్తుండాలి. ఎంత పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నా ఫలితాలు ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు శ్రమా, సమయం రెండూ వృథా అయ్యాయని నిరాశపడకూడదు. అవసరం మేరకు కొన్ని మార్పులు చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకే విధమైన పరిష్కారాన్ని చివరివరకూ అమలు చేసి నష్టపోయేకంటే మధ్యలో ఒకసారి పునః పరిశీలించడం మంచిది. 

 

ఆచరణకు ప్రణాళిక 

సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టాక ఆచరణకు ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి. ప్రణాళిక ఎప్పుడూ ఆలోచనలకు మాత్రమే పరిమితం కాకూడదు. సరైన రూపాన్ని కల్పిస్తూ దాన్ని పేపరు మీద రాసిపెట్టుకోవాలి. అప్పుడు దాన్ని వాస్తవంగా ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల చక్కని ఫలితాన్నీ సాధించవచ్చు. ఆ తర్వాత మధ్యలో ఏమైనా మార్పులు, చేర్పులూ అవసరమైనా చేసుకోవచ్చు. పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికను సిద్ధం చేసుకుంటే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఏ రోజు, ఏ సమయంలో ఏ పని చేయాలో పక్కాగా రాసి పెట్టుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా ఉంటుంది. సమయమూ వృథా కాదు. అనవసర ఆందోళనా, ఒత్తిడీ దూరం కావడంతో ఉత్సాహంగా ప్రాజెక్టులను పూర్తిచేయగలుగుతారు.

 

ఉద్యోగులైతే... 

విద్యార్థులు, ఉద్యోగార్థులకే కాకుండా ఉద్యోగులకూ సమస్యా పరిష్కార నైపుణ్యం ఎంతో అవసరం. ఉద్యోగం సాధించిన తర్వాత ఈ నైపుణ్యంతో పనేం ఉంటుందని అనుకోకూడదు. ఉద్యోగులు తమకు కేటాయించిన వివిధ విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే ఈ నైపుణ్యం ఉండాల్సిందే. నిర్దేశించిన సమయానికి పనులను పూర్తిచేసే క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సివుంటుంది. పని ప్రదేశంలో సహోద్యోగులూ, పై అధికారుల నుంచి రకరకాల సమస్యలు ఎదురుకావచ్చు. ఎవరివల్లా ఇబ్బందులకు గురికాకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే ఉద్యోగులకు ఈ నైపుణ్యం ఎంతో అవసరం. 

కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా రకరకాల సమస్యల గురించి ఏకరువు పెట్టే ఉద్యోగులంటే అధికారులకు సదభిప్రాయం ఉండదు. సమస్యలు ప్రతిచోటా ఉంటాయి. వాటికి పరిష్కారాలను కనిపెట్టి ముందుకు వెళ్లే మెరికల్లాంటి ఉద్యోగులను సంస్థలెప్పుడూ గుర్తిస్తాయి. వారికి తగిన ప్రోత్సాహకాలనూ అందిస్తాయి. కాబట్టి సమస్య మీద మాత్రమే దృష్టి నిలపకుండా దాని పరిష్కారం గురించీ ఉద్యోగులు ఆలోచించాలి. 

ఈ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే.. ప్రతి విషయాన్నీ నిశితంగా గమనించడం, కారణాలను కనిపెట్టడం, పరిష్కార మార్గాలను అన్వేషించడం లాంటి లక్షణాలను అలవరుచుకోవాలి.

 

ఉద్యోగార్థులైతే... 

సమస్యా పరిష్కార నైపుణ్యం ఉద్యోగార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రెజ్యుమెలో గత ఉద్యోగానుభవాల గురించి రాసేటప్పుడు వివిధ సందర్భాల్లో ఎదురైన సమస్యలను వాటిని మీరు పరిష్కరించిన విధానాన్నీ రాయొచ్చు. ఇంటర్వ్యూ సమయంలో ఉద్యోగార్థుల సమస్యా పరిష్కార నైపుణ్యాన్ని రిక్రూటర్లు పరీక్షిస్తారు. కొన్ని రకాల సమస్యలను ప్రస్తావించి... మీరైతే వాటిని ఎలా పరిష్కరిస్తారని అడగొచ్చు. 

 

గుర్తుంచుకోవాల్సినవి

1. సమస్యను భూతద్దంలో చూసి, బెంబేలెత్తటం మానేయాలి. ధీమా కోల్పోకుండా.. పరిష్కారం మీదే దృష్టి నిలపాలి 

2. సమస్యా పరిష్కారానికి ముందు ఈ సమస్య ఎలా, ఎందుకు ఉత్పన్నమైంది. గతంలో ఇలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలను కనుక్కున్నారు... లాంటి ప్రశ్నలు వేసుకుంటే పరిష్కారం సులువవుతుంది. 

3. సాధ్యమైనన్ని పరిష్కారాలను రాసి పెట్టుకోవాలి. దాంట్లోంచి అనువైనదాన్ని ఎంచుకోవాలి. అది ఆశించిన ఫలితాలను ఇవ్వకపోతే మరో పరిష్కారాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి.
 

Posted Date : 31-08-2021 .

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌