• facebook
  • twitter
  • whatsapp
  • telegram

FEE: ఏ తరగతికి ఎంత ఫీజు..?

ఏపీఎస్ఈఆర్ఎంసీ నివేదిక ప్రకారం ప్రభుత్వం జీవో విడుదల

తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభించారు. ఎప్పటిలానే విద్యాసంవత్సరం ప్రారంభంలో సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా కొన్ని ప్రైవేట్‌ సంస్థలు యథేచ్ఛగా పీజు రాబడుతున్నాయి. ఇప్పటికే విద్యాసంవత్సరం వృథా అయిందని తప్పని పరిస్థితుల్లో కరోనా భయం ఉన్నా తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలలకు పంపుతున్నారు. కరోనా ఉద్ధృతి పెరిగితే మళ్లీ ఇబ్బందులు పడాల్సిందేనని భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఫీజులు కడతామంటే కొన్ని సంస్థల యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. దాంతో వారిలో కొంత గందరగోళం నెలకొంటుంది. 

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు ఇలా..

ఏపీలో విద్యా రంగంలో ప్రమాణాలు పెంచేందుకు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్.కాంతారావు చైర్మన్‌గా పలువురు విద్యారంగ నిపుణులతో ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌(ఏపీఎస్ఈఆర్ఎంసీ) ఏర్పాటు చేసింది. ఏపీఎస్ఈఆర్ఎంసీ సిఫారసుల మేరకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు ఎంత మేరకు వసూలు చేయాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో 53, 54 తీసుకొచ్చింది. ఈ ఫీజులు 2021-24 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో గరిష్ఠంగా ఐదో తరగతి వరకు రూ.10 వేలు.. పట్టణాల్లో 11 వేలు.. నగరాల్లో రూ.12 వేలు ఫీజు వసూలు  చేయాల్సి ఉంటుంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు గ్రామాల్లో రూ.12 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, నగరాల్లో రూ.18 వేలుగా ఫీజు ఉంది. హాస్టల్‌ విద్యార్థులకు గ్రామ పంచాయతీ పరిధిలో రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, నగరాల్లో రూ.24 వేలు వరకే ఫీజు వసూలు చేయాలి.

ఇంటర్‌లో మ్యాథ్స్‌, సైన్స్‌ గ్రూపులకు గ్రామ పంచాయతీల్లో రూ.15 వేలు, పట్టణాల్లో రూ.17.5 వేలు, కార్పొరేషన్లలో గరిష్ఠంగా రూ.20 వేలు వరకు, ఆర్ట్స్‌ గ్రూపు అభ్యర్థులకైతే రూ.12 వేలు, రూ.15 వేలు, రూ.18 వేలుగా ఫీజు నిర్ణయించారు.

ఇంటర్‌ విద్యార్థులకు హాస్టల్‌ ఫీజు ఏడాదికి గ్రామ పంచాయతీ పరిధిలో రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, నగరాల్లో రూ.24 వేలు మించకూడదు. జేఈఈ మెయిన్స్‌, నీట్‌ లాంటి కోచింగ్‌లకు ఏడాదికి రూ.20 వేలు మాత్రమే వసూలు చేయాలి. 

విద్యాసంస్థలు విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తే అందుకుగాను కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలి. విద్యాసంస్థల ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాల్సి ఉంది. ఇతర శిక్షణల పేరిట ఏ రుసుమూ తీసుకోకూడదు.

ఫీజుల వినియోగం ఇలా...

విద్యాసంస్థల్లో గరిష్ఠంగా ఎంత ఫీజు వసూలు చేయాలనే నిర్ణయంతో పాటు... వసూలు చేసిన ఫీజులను ఎలా వినియోగించాలో కూడా ప్రభుత్వం తెలిపింది.

నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతాన్ని టీచర్లు, నాన్ టీచింగ్ స్టాప్ వేతనాలకు, మరో 15 శాతాన్ని గ్రాట్యుటీ, పీఎఫ్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌కు ఖర్చు చేయాలి. అలాగే మరో 20 శాతం ఫీజును పాఠశాల లేదా కళాశాల అభివృద్ధికి వినియోగించాలి. అలాగే ఆయా విద్యాసంస్థల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్లు వివరాలతో పాటు వారి విద్యార్హతలు, వారికి ఇస్తున్న జీతాల సమాచారాన్ని విద్యాశాఖకు తెలియజేయాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను విద్యాసంస్థల వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచాలి.

తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలను పరిగణలోకి తీసుకుని ఫీజులపై నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. నిబంధనలు ఎలా ఉన్నా కరోనా కారణంగా విద్యాసంస్థలు కొంత కాలం మూతబడి ఉండడంతో నిర్వహణ భారంగా మారిందనేది వాస్తవం. ఇటీవల తిరిగి బడులు తెరిచిన నేపథ్యంలో యాజమాన్యాలు ముందుగానే ఇష్టారీతిన ఫీజులు గుంజుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఫీజుల వసూలు విషయంపై కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
 

Posted Date : 05-09-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌