• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈ నైపుణ్యాలుంటే.. కొలువు...సులువు!  

ఉద్యోగార్థులు ఎన్నో సంస్థలకు రెజ్యూమేలు పంపుతూ ఉంటారు. కొన్నిసార్లు సమాధానం రాక .. ఎందుకు రాలేదో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మరోపక్క అనేక సంస్థలు.. సమర్థులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంటాయి. అలాంటప్పుడు ఆ సమర్థత ఉన్న వ్యక్తి తానేనని అభ్యర్థి నిరూపించాల్సి వుంటుంది. అందుకే ఉద్యోగార్హత నైపుణ్యాలేమిటో గ్రహించి వాటిని పెంచుకోవాలి. వాటినీ, తాను సంపాదించిన అనుభవాన్నీ స్పష్టంగా సూచిస్తూ రెజ్యూమేను రూపొందించాలి. అప్పుడే ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది!

ప్రతి ఉద్యోగికీ కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి. ప్రధానంగా ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అదనంగా హార్డ్, సాఫ్ట్‌ స్కిల్స్‌ రెండూ ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉంటే సరిపోదు. ఎందుకంటే ఒకపక్క సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూనే మరోపక్క బృందానికి నాయకత్వం వహిస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇతరులకుంటే అదనపు నైపుణ్యాలున్న అభ్యర్థులకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది.

సమస్యా పరిష్కారం

ఉద్యోగ సాధనకు అత్యంత అవసరమైన నైపుణ్యమిది. విధులను నిర్వర్తించే క్రమంలో పరిస్థితులను అంచనా వేయడం, సమస్యలను గుర్తించి, పరిష్కరించడం ఎంతో అవసరం. పనిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకుని ముందుకెళ్లే నేర్పు ఉండాలని రిక్రూటర్లు ఆశిస్తారు. ఉదాహరణకు అనేక రకాల భారీ యంత్రాలతో ప్రాజెక్టు పని నడుస్తుంటుంది. ఏవైనా సమస్యలు తలెత్తి యంత్రాలు పనిచేయడం మానేయొచ్చు. అలాంటప్పుడు పని మొత్తం దెబ్బతింటుంది. ఆ సమస్యను గుర్తించి వెంటనే అవి పనిచేసేలా చేయగలగాలి. ఇదంతా జరగాలంటే సమస్యను గుర్తించి, పరిష్కరించే నేర్పు అభ్యర్థికి ఉండాల్సిందే. 

కంప్యూటర్‌ పరిజ్ఞానం

ఉద్యోగిగా ఏ రంగంలోనైనా పనిచేస్తూ ఉండొచ్చు. కానీ రోజువారీ పనులను సక్రమంగా పూర్తిచేయడానికి కంప్యూటర్‌ను ఉపయోగించడం తెలిసుండాలి. అందుకే ప్రోగ్రామింగ్‌ తెలుసున్న అభ్యర్థులకు రిక్రూటర్లు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాజెక్టు బ్లూప్రింట్లకు తుది రూపాన్ని ఇవ్వడానికి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుంది.  

భావ వ్యక్తీకరణ

ఉద్యోగిగా ప్రణాళికలూ, డిజైన్‌ల గురించి ఇతరులతో చర్చించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించగలగాలి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విభాగానికి చెందనివారితో కలసి పనిచేస్తున్నప్పుడు ఈ నైపుణ్యం మరింత అవసరం. సమర్థంగా చెప్పలేకపోతే.. ఒక విధంగా అనుకుంటే.. ఎదుటివాళ్లు మరో విధంగా పని పూర్తిచేసే ప్రమాదం ఉంటుంది. ఇది జరగకుండా వారానికో పది రోజులకో అందరితో కలిసి సమావేశం ఏర్పాటుచేసి ఆలోచనలను పంచుకోగలగాలి. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులను స్పష్టంగా వివరించాలి. దీనివల్ల ఎలాంటి అనర్థాలకూ అవకాశముండదు. 

నాయకత్వ ప్రతిభ

ఒక కార్యాలయానికి మేనేజర్‌గా పనిచేయకపోవచ్చు కానీ బృందానికి నాయకుడిగా వ్యవహరించాల్సిరావొచ్చు. ఆ సందర్భంగా వివిధ రకాల వ్యక్తులతో కలసి పనిచేయాలి. ఇతరులకు మార్గదర్శిగా వ్యవహరించాలి. ఇతరుల్లో స్ఫూÄర్తినీ నింపగలగాలి. సాంకేతిక, సాంకేతికేతర సిబ్బంది మధ్య వారధిలా పనిచేయాల్సి రావచ్చు. ఇవన్నీ చేయాలంటే మార్గదర్శిగా ముందుకు నడిచే, నాయకత్వంతో నడిపించే చొరవ పెంచుకోవాలి.

పారిశ్రామిక నైపుణ్యాలు

ఏ పరిశ్రమలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో...ఆ రంగానికి సంబంధించిన నైపుణ్యాలు, అనుభవం అభ్యర్థిలో ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. ఒకవేళ సరిగ్గా అలాంటివేమీ లేకపోయినా దానికి దగ్గర సంబంధమున్న అనుభవం ఉంటే ఈ విషయాన్ని రెజ్యూమేలో పేర్కొనవచ్చు. గతంలో కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులో పనిచేసినప్పుడు మెటీరియల్‌ నాణ్యతను పరీక్షించిన అనుభవం ఉంటే దాన్ని పేర్కొనవచ్చు. నిర్మాణం సక్రమంగా పూర్తికావడానికీ, డిజైన్‌ రూపకల్పనలో తన భాగస్వామ్యం గురించీ వివరించవచ్చు.

కలిసి పనిచేయడం

బృందం సభ్యుడిగా అందరితో కలిసిమెలిసి పనిచేయాలి. నాయకుడిగా ఉంటే బృందాన్ని ముందుకు నడిపించాలి. నలుగురితో కలసి పనిచేయడం ఎంతో అవసరమైన నైపుణ్యం. కొత్త డిజైన్ల రూపకల్పనలో, భారీ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో నలుగురితో కలసి పనిచేయడం ఎంతో అవసరం. ఇలా పనిచేసిన అనుభవం మెరుగ్గా ఉన్న అభ్యర్థులకు రిక్రూటర్లు ప్రాధాన్యమిస్తారు. 

ఒత్తిడిని తట్టుకోవడం

ప్రాజెక్టులన్నీ సవాళ్లతో కూడి ఉంటాయి. దాంతో అభ్యర్థులు ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. క్లిష్ట పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసి పనులను పూర్తిచేసిన విధానాన్ని రెజ్యూమేలో రాయొచ్చు. ఒక్కోసారి నిర్ణీత సమయానికి కొత్త యంత్రాల పనితీరును వివరించాల్సి ఉండొచ్చు. కానీ సమయానికి యంత్రాలు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఒత్తిడికి గురికాకుండా నమూనాలతోనూ ఆ పనిని సమర్థంగా పూర్తిచేయొచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యవహరించిన తీరును పేర్కొంటే అభ్యర్థి ఒత్తిడిలో పనిచేయగలరనేది అర్థమవుతుంది.

సృజన శక్తి

రెజ్యూమేలో ప్రాధాన్యమివ్వాల్సిన ముఖ్యాంశాల్లో ఇది ఒకటి. ప్రాజెక్టు పనుల్లో ఎదురైన ఒక సమస్యను పరిష్కరించే అనుభవం లేకపోయినా సృజనాత్మకంగా వివిధ రకాలుగా ఆలోచించడం వల్ల దానికి సరికొత్త పరిష్కారాన్ని కనిపెట్టవచ్చు. ఉదాహరణకు టేబుల్‌ సా మెషీన్‌తో చెక్కలను కోసే కార్పెంటరీ బృందానికి తగిన మార్గదర్శకాలను ఇవ్వొచ్చు. ఇలాచేస్తే ప్రతి నిర్మాణానికీ వేర్వేరు సైజుల్లో చెక్కలను కత్తిరించడానికి బదులుగా అన్నింటికీ పనికివచ్చే పరిమాణంలో కత్తిరించేలా చేయొచ్చు. దీనివల్ల విలువైన సమయమెంతో ఆదా అవుతుంది.

విశ్లేషించే నేర్పు

వివిధ నిర్మాణాలు, యంత్రాల పని సామర్థ్యాన్ని అంచనా వేసే విషయంలో ఈ నైపుణ్యం ఎంతో అవసరం. వేసుకున్న ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు పూర్తిచేయాలంటే కావాల్సింది విశ్లేషణ నైపుణ్యమే. ఇది లేకుండా పనిచేస్తే పనితీరుపై సదభిప్రాయం కలగదు. పనుల, యంత్రాల పనితీరులో నాణ్యతను పరీక్షించడం, అవసరమైన మార్పులు చేయడం.. లాంటివి జరగాలంటే విశ్లేషించే నైపుణ్యం అవసరమవుతుంది. పనితీరును మధ్యలోనే విశ్లేషించడం మేలైన ఫలితాలను అందిస్తుంది. 

చెదరని ఏకాగ్రత

ఒక ప్రాజెక్టు మీద పనిచేస్తున్నప్పుడు దాని మీదే దృష్టిని కేంద్రీకరించడం ఎంతో అవసరం. ప్రణాళికలు వేసేటప్పుడు చిన్న పొరపాటు చేసినా ఆర్థికంగా భారీ నష్టం జరగొచ్చు. లేదా ప్రమాదాలు జరిగే అవకాశమూ లేకపోలేదు. అందుకే చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి పనికిరాని వస్తువులను ఉపయోగించడం వల్ల భారీ నష్టమూ జరగొచ్చు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించడం ఎంతో అవసరం. 

ఆధునిక సాంకేతికత

సాంకేతిక రంగంలో పనిచేస్తున్నప్పుడు..ఆ రంగంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలి. కొత్త పరిజ్ఞానం రావచ్చు. పాతవి మార్పులు చెందివుండొచ్చు. ఈ విషయాలు తెలియక పాత పద్ధతులనే ఉపయోగించడం వల్ల నష్టపోయే ప్రమాదముంటుంది. అందుకే కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం పెంచుకోవాలి. పాత పనిముట్లనూ, పని విధానాలనూ ఉపయోగించకుండా అభివృద్ధి చెందడానికి ఇది అవసరం. పారిశ్రామిక రంగంలోని నిపుణులు నిర్వహించే సెమినార్లకు హాజరుకావడం ద్వారా నూతన మార్పుల గురించి తెలుసుకోవచ్చు. ఈ అవగాహన ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.
 

Posted Date : 28-10-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌