• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కోర్సుల నాణ్యత  కొలువుల ధీమా

ఉన్నత విద్యావకాశాల్లో దూసుకువెళ్తున్న కెనడా

విదేశీ ఉన్నతవిద్య విషయంలో అమెరికాను మించి భారతీయ  విద్యార్థులను ఆకర్షిస్తోన్న దేశం.. కెనడా! వీసాల జారీలోనే కాకుండా వర్క్‌ పర్మిట్, పర్మనెంట్‌ రెసిడెంట్‌ హోదా ఇవ్వటాన్ని సులభతరం చేయటమే దీనికి ప్రధాన కారణాలు. ఈ నేపథ్యంలో కెనడా  విద్యావిధానం, ముఖ్య కోర్సులు, ప్రవేశాల గురించి తెలుసుకుందామా? 

అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యకూ, నాణ్యమైన జీవనశైలికీ ప్రసిద్ధి చెందిన కెనడా సురక్షితమైన దేశాల్లో ఒకటిగా, అధునాతన ఆర్థిక వ్యవస్థతో అభివృద్ధి చెందింది. క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2019లో కెనడాలోని 26 యూనివర్సిటీలూ, టైమ్స్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2019లో 27 యూనివర్సిటీలూ స్థానం సంపాదించాయి. 2014- 2018 మధ్య కెనడాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 68% పెరిగింది. 2019 నాటికి 6,42,480 అంతర్జాతీయ విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 13% అధికం. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్త కొవిడ్‌ సమస్య ఉన్నప్పటికీ కెనడాలో 5,30,540 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీ మెరుగుదల నమోదయింది. 2017లో 82,990 మంది చేరగా, ఏటా పెరుగుతూ 2021కి వచ్చేసరికి ఆ సంఖ్య 2,15,720కు చేరుకుంది.   

స్థిరమైన నిబంధనల చట్రంతో కాకుండా విద్యార్థులకు ఎంచుకునే అవకాశాలున్న సౌకర్యవంతమైన ఫ్లెక్సిబుల్‌ విద్యా వ్యవస్థ కెనడా ప్రత్యేకత. అసాధారణమైన నాణ్యతతో ఉండే 15000 ప్రోగ్రాములను ఇక్కడి విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. అండర్‌ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్‌ స్థాయిలో వైవిధ్యకరమైన డిగ్రీలను విద్యార్థులు ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. 

 డిప్లొమా వ్యవధి 1-4 సంవత్సరాలు 

 బ్యాచిలర్స్‌ డిగ్రీ వ్యవధి 2-4 సంవత్సరాలు 

 మాస్టర్స్‌ డిగ్రీ వ్యవధి 1-2 సంవత్సరాలు

 డాక్టరేట్‌ డిగ్రీ 3 సంవత్సరాలు- అంతకన్నా ఎక్కువ 

కెనడియన్‌ విద్యాసంస్థల్లో ట్యూషన్‌ ఫీజు 10,000 కెనడియన్‌ డాలర్ల (సీఏడీ) నుంచి 35,000 సీఏడీ వరకు ఉంటుంది. సాంకేతిక, ప్రొఫెషనల్‌ రంగాలలో విభిన్న కోర్సులు (బిజినెస్, అగ్రికల్చర్, అగ్రి-ఫుడ్, హెల్త్, సోషల్‌ సర్వీసెస్, బ్రాడ్‌ కాస్టింగ్‌ అండ్‌ జర్నలిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, డిజైన్, టెక్నాలజీ, సైన్సెస్, ఐటీ, ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంట్, లాంగ్వేజెస్, ఆర్ట్స్‌) ఇక్కడ లభిస్తాయి. మెడిసిన్, టెలి కమ్యూనికేషన్, అగ్రికల్చర్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో పరిశోధనలకు అక్కడి ప్రభుత్వం చక్కని మద్దతును అందిస్తోంది. అన్ని కెనడియన్‌ క్యాంపస్‌లలో ఈవెంట్‌లు, ఫెస్ట్‌లు, ఇతర కార్యకలాపాలు ఏడాది పొడవునా జరుగుతుంటాయి.

పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ వర్క్‌ పర్మిట్‌

దీన్ని పీజీడబ్ల్యూపీ అని వ్యవహరిస్తారు. ఇది విదేశీ విద్యార్థులు పని చేయటానికి ఇచ్చే అధికారిక అనుమతి. ఇది శాశ్వత నివాసం (పర్మినెంట్‌ రెసిడెన్స్‌)కు దరఖాస్తు చేసే సమయంలో కూడా ఉపయోగపడుతుంది. వర్క్‌ పర్మిట్‌ ఎనిమిది నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఇస్తారు. వర్క్‌ పర్మిట్‌ ఎంత కాలమన్నది కెనడాలో విదేశీ విద్యార్థి ఎంచుకున్న కోర్సు నిడివిపై ఆధారపడి ఉంటుంది. రెండు సంవత్సరాల కోర్సు చదివేవారికి పీజీడ బ్ల్యూపీ మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.

ఒక సంవత్సరం స్టడీ ప్రోగ్రాం తర్వాత కూడా పర్మినెంట్‌ రెసిడెన్స్‌ (పీఆర్‌)కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు తమ స్టడీ ప్రోగ్రామ్‌ పూర్తి చేసిన తర్వాత పీజీడబ్ల్యూపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అవసరమైన కెనడియన్‌ పని అనుభవాన్ని పొందడంలో సహాయపడుతుంది. పైగా సమగ్ర ర్యాంకింగ్‌ స్కోర్‌ సిస్టమ్‌ పరంగా ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ అనేది కెనడాలో శాశ్వత నివాసం కోసం నైపుణ్యం కలిగిన కార్మికులను ఎంచుకోవడానికి రూపొందించిన ఆన్‌లైన్‌ వ్యవస్థ.  కెనడా ఇమ్మిగ్రేషన్‌ నియమాలు ఇతర దేశాలతో పోలిస్తే కఠినంగా ఉండవు; అందువల్ల అర్హత సాధించడం సులభం. ప్రపంచ మాంద్యం నేపథ్యంలో కూడా కెనడా తన ఇమ్మిగ్రేషన్‌ కోటాను తగ్గించలేదు. ఇమిగ్రెంట్లకూ, వారి కుటుంబాలకూ మెరుగైన సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుంది. కెనడా విద్య, ఆరోగ్య సౌకర్యాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని పేరు. అధిక సబ్సిడీతో ఉండటం వీటి ఆకర్షణ. 

దరఖాస్తు ఎప్పుడు? 

ఒక సంవత్సరంలో 3 ఇన్‌టేక్‌లు (జనవరి, మే, సెప్టెంబరు) ఉంటాయి.. సెప్టెంబర్‌ ఇన్‌టేక్‌ ప్రధానమైనది. వివిధ కళాశాలలూ, విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు ప్రక్రియలు భిన్నంగా ఉంటాయి. విద్యాసంస్థల దరఖాస్తు సూచనలను అనుసరించి, ఏడాది ముందుగానే అప్లికేషన్‌ ప్రక్రియను ప్రారంభించడం మంచిది.

ఎంత ఖర్చు?

యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి అనేక ఇతర దేశాలతో పోలిస్తే కెనడాలో చదువుకోవడం తక్కువ వ్యయంతో కూడినది. కోర్సు, చదివే విద్యాసంస్థ, అది ఉన్న ప్రదేశం, వసతి, ఇతర అంశాలపై విద్యార్థుల ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా మాస్టర్స్‌ కోసం కెనడాను ఎంచుకునే విద్యార్థికి కనీసం 10,000 సీఏడీ,  ఎక్కువలో ఎక్కువ 35,000 సీఏడీ  ఖర్చు అవుతుంది. సగటు జీవన వ్యయం 15,000 సీఏడీ కావచ్చు.

స్కాలర్‌షిప్‌ అవకాశాలు

విద్యార్థులు చదువులు పూర్తిచేయటానికి స్కాలర్‌షిప్‌ల వల్ల ఆర్థిక ఆసరా లభిస్తుంది. అయితే విదేశీ విద్యార్థుల కోసం కెనడాలో లభించే స్కాలర్‌షిప్‌లు పరిమితం. ఉన్నవాటికీ చాలా ఎక్కువ పోటీ ఉంటుంది. కష్టపడి చదివి అసాధారణమైన అకడమిక్‌ స్కోర్‌లను సాధించేవారికి మాత్రమే ఇవి లభిస్తాయి.

కెనడాలో 3 రకాల విద్యాసంస్థలు ఉన్నాయి

1. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు: వీటికి ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. ఇన్‌- స్టేట్‌ నివాసితుల కోసం వీటిలో తక్కువ ట్యూషన్‌ ఫీజు ఉంటుంది. అవుటాఫ్‌ స్టేట్‌ నివాసితుల నుంచి ఎక్కువ వసూలు చేస్తారు.

2. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు: ఇవి నిర్వహణ ఖర్చులను భరించడానికి ట్యూషన్‌ ఫీజు, ఎండోమెంట్‌లు, ప్రైవేటు విరాళాలపై ఆధార పడతాయి.

3. కమ్యూనిటీ కళాశాలలు: ఇవి మునిసిపల్‌ నిధులతో నడుస్తాయి. అనేక కమ్యూనిటీ కళాశాలల్లో గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల కోసం ఓపెన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఉంటుంది. 

కెనడాలో విద్యార్థులకు కోర్సు ముగిశాక పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లుంటాయి. కోర్సు అభ్యసించే సమయంలోనే పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు లభిస్తాయి. విశ్వవిద్యాలయాల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లూ ఉంటాయి.

శుభకర్‌ ఆలపాటి

డైరెక్టర్, గ్లోబల్‌ ట్రీ
 

Posted Date : 13-08-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌