• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బోధనకూ.. పరిశోధనకూ ఒకటే పరీక్ష !

నెట్‌ 2021

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో బోధించడానికీ, మంచి స్టైపండ్‌తో కూడిన పరిశోధనల దిశగా అడుగులేయడానికీ జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)లో ఉత్తీర్ణత తప్పనిసరి. దీన్ని ఏడాదికి రెండుసార్లు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) తరఫున నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ  నిర్వహిస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో డిసెంబరు 2020 ప్రకటనకు సంబంధించిన పరీక్ష వాయిదా పడింది. అలాగే జూన్‌ 2021లో వెలువడాల్సిన ప్రకటన ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ రెండింటినీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబరు 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లు నెట్‌ రాసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్షను 81 సబ్జెక్టులు/విభాగాల్లో దేశవ్యాప్తంగా 224 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. భాషలు తప్పించి, మిగిలిన సబ్జెక్టుల్లో పరీక్షలు రాసేవారికి ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో వస్తాయి. 

ప్రశ్నలు వేటి నుంచి?

పేపర్‌ 1: ఇందులో 10 విభాగాలు ఉంటాయి. వీటిలో ఒక్కో విభాగం నుంచి 5 చొప్పున ప్రశ్నలు రావచ్చు. అభ్యర్థిలో టీచింగ్, రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ పరిశీలిస్తారు. రీజనింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, డైవర్జెంట్‌ థింకింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాల అధ్యయనం ద్వారా ఈ పేపర్‌పై అవగాహన పొందవచ్చు. ఈ విభాగంలో ఎక్కువ మార్కుల కోసం టాటా మెక్‌గ్రాహిల్స్‌ లేదా మరేదైనా పుస్తకాన్ని బాగా చదువుకుంటే సరిపోతుంది.  

పేపర్‌-2: ఇందులో మొత్తం సబ్జెక్టు ప్రశ్నలే ఉంటాయి. సంబంధిత సబ్జెక్టులో ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉన్నప్పటికీ ప్రతి అంశాన్నీ విస్తృతంగా, సూక్ష్మంగా చదివినవారే సమాధానాలు గుర్తించగలరు. కొత్తగా సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు ముందుగా సంబంధిత సబ్జెక్టులో యూజీ పుస్తకాలు బాగా చదువుకోవాలి. ఆ తర్వాత పీజీ పుస్తకాలు సిలబస్‌ ప్రకారం అధ్యయనం చేయాలి. చాప్టర్లు లేదా టాపిక్‌ వారీ వివిధ పుస్తకాలు చదవడం తప్పనిసరి. అయితే వీటిని పరిమితంగానే ఎంచుకుని బాగా చదవాలి. పాత ప్రశ్నపత్రాలను సునిశితంగా పరిశీలించాలి. గతంలో అడిగిన ప్రశ్నలు మళ్లీ రావడానికి తక్కువ అవకాశాలే ఉంటాయి. కానీ వీటిని పరిశీలించడం ద్వారా ప్రశ్నల స్వభావం, అడిగే విధానంపై అవగాహన పెంచుకోవచ్చు. సంబంధిత సబ్జెక్టుల్లో నిర్వహించిన జేఎల్, డీఎల్‌ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే మరింత ప్రయోజనం. పరీక్ష తేదీ నాటికి కనీసం పది మాక్‌ టెస్టులు రాయగలగాలి. 

రాతపరీక్ష ఇలా...

పేపర్‌ 1 వంద మార్కులకు, రెండో పేపర్‌ 200 మార్కులకు ఉంటాయి. పేపర్‌-1 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. పేపర్‌ -2 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ఉంటుంది. మొత్తం వంద ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్‌ 1, 2 మధ్య ఎలాంటి విరామం ఉండదు.

అర్హత పొందితే...

జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)లో నెగ్గితే దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలూ, విద్యా సంస్థల్లో అసిస్ట్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌ అర్హులు మేటి సంస్థల్లో పరిశోధన (పీహెచ్‌డీ) చేసుకోవచ్చు. వీరికి ప్రతి నెలా మొదటి రెండేళ్లు రూ.31,000; అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తే రూ.35,000 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. సంబంధిత సంస్థ వసతి కల్పించనట్లయితే స్టైపెండ్‌లో 30 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ అదనంగా చెల్లిస్తారు. ఏటా కాంటింజెన్సీ గ్రాంటు ఇస్తారు ఇటీవల కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్‌ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ హోదాతో లీగల్, హ్యూమన్‌ రిసోర్సెస్, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు సైతం నెట్‌ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.

ఎవరు అర్హులు? 

విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్, దివ్యాంగులకు 50 శాతం మార్కులు సరిపోతాయి. ప్రస్తుతం పీజీ ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: జేఆర్‌ఎఫ్‌ కోసం అక్టోబరు 1, 2021 నాటికి 31 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్, దివ్యాంగులు, ట్రాన్స్‌ జండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో అయిదేళ్ల సడలింపులు వర్తిస్థాయి..అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దరఖాస్తులకు వయసు నిబంధన లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: సెప్టెంబరు 5.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000. ఓబీసీ(నాన్‌ క్రీమీ లేయర్‌), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లకు రూ.250

పరీక్షలు: అక్టోబరు 6 నుంచి 11 వరకు. 

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో..అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, పొద్దుటూరు, సూరంపాలెం. తెలంగాణలో.హైదరాబాద్, సికిందరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్‌.  

వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in/

Posted Date : 02-09-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌