• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నీ గురించి తెలుసుకో..  నప్పేది ఎంచుకో!

కెరియర్‌ ఎంపికకు ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌

కోర్సులైనా, వాటితో సంబంధమున్న ఉద్యోగాలైనా.. ఒక్కో ఏడాది ఒక్కోదానికి డిమాండ్‌ ఉంటుంది. కొన్ని కొన్నేళ్లపాటు హవా సాగిస్తాయి. వాటిని బట్టి చాలామంది విద్యార్థులూ, ఉద్యోగార్థులూ వాటిపై మొగ్గు చూపిస్తుంటారు. ఎంచుకునే కెరియర్‌లో రాణించాలంటే దానిపై ఆసక్తి మాత్రం సరిపోదు కదా? అది తమ స్వభావానికీ, అభిరుచికీ తగినదో కాదో స్పష్టం చేసుకోవాలి. దీనికి సాయపడే  స్వీయ అంచనా (సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌) టెస్టుల సదుపాయాన్ని ఎన్నో ఆన్‌లైన్‌ వేదికలు అందిస్తున్నాయి. వీటి ఫలితాలను పరిగణనలోకి తీసుకుని కెరియర్‌పై ఓ నిర్ణయానికి రావొచ్చు!

వ్యక్తి జీవితంలో కెరియర్‌ది ప్రధాన పాత్ర. జీవితంలో ప్రధాన భాగం దీనితోనే నిండిపోతుంది. కాబట్టే, దీని ఎంపికలో ఆచితూచి అడుగేయటం సముచితం. సరైన కెరియర్‌ ఎంపికలో రెండు అంశాలు తోడ్పడుతుంటాయి. ఒకటి- తనని గురించి విద్యార్థి తాను తెలుసుకోవడం. రెండు- తను చదివిన/ తనకు పట్టు ఉన్న అంశాల ఆధారంగా ఉన్న కెరియర్ల గురించి అవగాహన తెచ్చుకోవడం. ‘స్వీయ అంచనా’ ద్వారా ఈ రెండు అంశాలపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ అనగానే పాఠశాలలో, కళాశాలలో రాసే పరీక్ష కాదు. కొన్ని టెస్టులు, టూల్స్‌/ విశ్లేషణల సమ్మేళనం ఇది. దీనిలో సబ్జెక్టు పరీక్షల్లోలా ఇదే సరైన సమాధానం, ఇది కాదు అనే నిర్ణీత ఫలితాలేమీ ఉండవు. కానీ దీనిలో వ్యక్తి విజయానికి తోడ్పడే అంశాలు- తన ఇష్టాయిష్టాలు, ఆసక్తులు, వ్యక్తిత్వం, ఆప్టిట్యూడ్‌ మొదలైనవాటికి సంబంధించిన అంశాలుంటాయి. దీని అంతిమ లక్ష్యం- అభ్యర్థికి తనపై తనకు అవగాహన కలిగించడం, తనకు సరైన కెరియర్‌ ఏదో సూచించడం.

ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా విద్యార్థులు.. తనకు ఆసక్తిగా అనిపించినదాన్ని బట్టి లేదా ఆ సమయంలో ఆదరణ ఉన్నదాన్ని బట్టి కెరియర్‌ను ఎంచుకుంటుంటారు. ఈ రెండు విధానాల్లోనూ లోతుగా పరిశీలించాల్సిన కీలకమైన అంశాలు పరిగణనలోకి రావు. తప్పనిసరిగా పట్టించుకోవాల్సినవీ, లేదా విద్యార్థి దృష్టికి రానివీ అసెస్‌మెంట్‌లో వస్తాయి. వాటిని అంచనావేసి తనకు తగిన కెరియర్‌ ఏదో తెలుసుకునే వీలు కల్పిస్తుంది. దీనిలో ప్రశ్న- జవాబుకు మాత్రమే పరిమితం కాకుండా కొన్ని టెక్నిక్‌లు, పరామితులను పరిగణనలోకి తీసుకుంటారు. వీటిద్వారా సరైన కెరియర్‌/ స్ట్రీమ్‌ను ఎంచుకోవడమే కాక విద్యార్థికి తనపై తనకు అవగాహన ఏర్పరచుకునే అవకాశమూ ఉంటుంది. విద్యార్థి పని చేసే తీరు, అతని వ్యక్తిత్వం, ఆలోచన విధానం వంటివెన్నో పరీక్షించేలా అసెస్‌మెంట్‌ పరీక్షాంశాలు ఉంటాయి. దీంతో వ్యక్తిగా తానేంటో, తన బలాలు, బలహీనతలేంటో తెలుసుకునే వీలు కల్పిస్తారు. తద్వారా తనకు అనుకూలమైన, నిగూఢంగా ఆసక్తి ఉన్న అంశాలేంటో తెలుసుకునే వీలు కలుగుతుంది. అందుకే ఈ విధానానికి ప్రాధాన్యం ఏర్పడుతోంది.

ఎప్పుడు? ఎవరు?

ఈ అసెస్‌మెంట్‌కు ప్రత్యేకమైన సమయమంటూ ఏమీ లేదు. కెరియర్‌/ చదువుకు సంబంధించి ఎలాంటి సందేహమున్నవారైనా దీన్ని తీసుకోవచ్చు. సాధారణంగా 8వ తరగతి విద్యార్థుల నుంచి ఇది అందుబాటులో ఉంది. ఎక్కువ శాతం సంస్థలు 10వ తరగతి  పూర్తి చేసుకున్నవారి నుంచి ప్రాధాన్యమిస్తున్నాయి. 

1. విభాగాన్ని/ గ్రూపును ఎంచుకునేవారు 

2. కెరియర్‌ ఎంపిక చేసుకోబోయేవారు 

3. స్పెషలైజేషన్‌ విషయంలో సందేహమున్నవారు దీని సాయం తీసుకోవచ్చు.

పేపర్‌-పెన్ను ఆధారితమైన టెస్టును 

కౌన్సెలర్‌ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్టును ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చేసుకునే వీలుంది. విద్యార్థి ఫోన్, కంప్యూటర్‌ల్లో తనకు నచ్చిన సమయంలో దీన్ని పూర్తి చేసుకోవచ్చు. నిర్ణీత సమయమంటూ ఉండదు. విధానం ఏదైనా నిపుణుల మార్గనిర్దేశం దొరుకుతుంది. కాకపోతే ఆన్‌లైన్‌ విధానంలో ఒకరికి మించి నిపుణులు పర్యవేక్షించే అవకాశం దొరుకుతుంది. అలాగే ఒక ప్రశ్నకు విద్యార్థి ఎంత సమయంలోగా సమాధానం ఇచ్చాడన్న అంశాన్నీ పరిశీలిస్తారు. ఇంకాస్త క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం దక్కుతుంది.

ఎక్కడ ప్రయత్నించొచ్చు?

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ రెండు విధాలుగా అందుబాటులో ఉన్నాయి. రెండింటికీ సమప్రాధాన్యం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆన్‌లైన్‌ వేదికగా ఎన్నో సంస్థలు కెరియర్‌ అసెస్‌మెంట్‌ అవకాశాన్ని కలిగిస్తున్నాయి. స్వదేశీ, విదేశీ సంస్థలెన్నో ఈ అవకాశాన్ని కల్పిస్త్తున్నాయి.

కొన్ని సంస్థలు నిర్ణీత మొత్తంలో ఫీజు తీసుకుంటుండగా చాలావరకూ సంస్థలు ఉచిత సాయాన్ని అందిస్తున్నాయి. వాటిలో ప్రముఖమైనవి..

123 కెరియర్‌ టెస్ట్‌: విద్యార్థి వ్యక్తిత్వానికి తగిన కెరియర్‌ ఏదో తెలియజేస్తుంది. ఎలాంటి పని వాతావరణం, ఉద్యోగం సరిపోతుందో తెలియజేస్తుంది. www.123test.com/

కెరియర్‌ వన్‌ స్టాప్‌ ఇంట్రెస్ట్‌ అసెస్‌మెంట్‌: కొన్ని ప్రశ్నలను అడుగుతారు. ఇచ్చిన సమాధానాల ఆధారంగా విద్యార్థి ఆసక్తికి అనుగుణంగా ఏ కెరియర్‌లు సరిపోతాయో సూచిస్తారు. www.careeronestop.org

కలర్‌ కెరియర్‌ క్విజ్‌: ఎంచుకున్న రంగుల ఆధారంగా వేటిల్లో రాణించో తెలుసుకోవచ్చట. వీరు ఎంచుకున్న రంగుల ఆధారంగా వారికి ఏయే  కెరియర్లు నప్పుతాయో ఒక అంచనాగా తెలుపుతారు. www.colorquiz.com

టెస్ట్‌ కలర్‌: ఇదీ కలర్‌ కెరియర్‌ క్విజ్‌ లాంటిదే. సైకాలజిస్ట్, మానవ వనరుల బృందం సంయుక్తంగా విద్యార్థిని పరీక్షిస్తుంది. మామూలుగా ఉచితమే. లోతైన విశ్లేషణ కావాలనుకుంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. www.colorquiz.com

కీర్సీ టెంపర్‌మెంట్‌ సార్టర్‌: వ్యక్తిత్వం, స్వభావాలను అంచనా వేస్తారు. ఈ లక్షణాలు ఉద్యోగ సంతృప్తి, ప్రతిభా ప్రదర్శనలపై ప్రభావం చూపిస్తాయనేది దీనిలో కనిపిస్తుంది. లోతైన విశ్లేషణకు కొంత మొత్తం తీసుకుంటారు. https://profile.keirsey.com

మరికొన్ని వెబ్‌సైట్లు: 

http://www.humanmetrics.com/

www.mynextmove.org/

www.16personalities.com

www.wingfinder.com

www.careeronestop.org/

www.careerexplorer.com/

www.mindler.com/

https://www.assessment.com/

www.whatsnext.com/

www.whatcareerisrightforme.com

https://www.careerfitter.com/

లాభాలేంటి?

సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌.. విద్యార్థి కెరియర్‌కు సంబంధించిన స్పష్టతను అందిస్తుంది. ఇది ఏ కెరియర్‌ లేదా ఏ విభాగాన్ని ఎంచుకోవాలన్నదానిపైనే కాకుండా తనను గురించి తాను అర్థం చేసుకోవడానికీ తోడ్పడుతుంది. వారి విశ్లేషణ, రిపోర్టు ద్వారా వ్యక్తిగా తానేంటో, తన బలాలు, బలహీనతలు మొదలైన వాటన్నింటిపై స్పష్టతను కలిగిస్తారు. తనకు సరిపోయే కెరియర్ల వివరాల్లో విద్యార్థి తనకు బాగా నచ్చినదాన్ని ఎంచుకునే వీలు కలుగుతుంది. విద్యార్థిలో దాగివున్న ప్రతిభ, నైపుణ్యాలను కనుక్కునేలా ఈ టెస్టులు డిజైన్‌ చేసివుంటాయి. ముఖ్యంగా కెరియర్‌ నుంచి ఏం ఆశిస్తున్నారో, ఏది ఎంచుకుంటే తాము కోరుకున్నవి అందుకోగలుగుతారో, వారికి తగిన ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ సూచిస్తారు. మొత్తం కెరియర్‌ మ్యాప్‌ను నిర్మించుకునే వీలు కల్పిస్తారు. విద్యార్థికి అవగాహన లేని, తన దృష్టికి రాని, తనకు అనుకూలమైన వివిధ డొమైన్లనూ సూచిస్తారు. దీంతో ఎక్కువ ఆప్షన్లు చేతిలో  ఉన్నట్లు అవుతుంది. అలాగే విద్యార్థికి అవసరమైన లైఫ్‌ స్కిల్స్‌నూ సూచిస్తారు. దాంతో తనలో ఉన్న నైపుణ్యాలేంటో, అదనంగా అవసరమైనవేంటో తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

పరీక్షించే ప్రధాన అంశాలు

ఆన్‌లైన్‌ వేదికను బట్టి పరీక్షించే అంశాల్లో మార్పులుంటాయి. ఎక్కువ శాతం సైట్లు 4-6 అంశాలను పరీక్షిస్తున్నాయి. కానీ, కింది అంశాలు దాదాపుగా ప్రతిదానిలోనూ ఉంటాయి.

వ్యక్తిత్వం: వ్యక్తి సామాజిక లక్షణాలు, ప్రేరణ కలిగించే అంశాలు, అవసరాలు, వైఖరి అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. కెరియర్‌కూ, వ్యక్తిత్వానికీ దగ్గరి సంబంధం ఉంటుంది. ఒక్కో కెరియర్‌కు కొన్ని లక్షణాలు అవసరమవుతాయి. కాబట్టి, ఈ అంశాలను పరీక్షిస్తారు.

ఆసక్తులు: వివిధ కార్యకలాపాల పట్ల ఉన్న ఇష్టాయిష్టాలు..వారి ఆసక్తులను ప్రతిబింబిస్తాయి. కెరియర్‌కీ, ఆసక్తులకీ మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఎంచుకునే విద్య అయినా, ఉద్యోగమైనా అందులో రాణించడంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీటి పాత్ర ఉంటుంది.

అభిరుచి: దీన్ని అభ్యర్థిలో నిగూఢంగా దాగివున్న ప్రతిభగా చెబుతారు. నేర్చుకునే సామర్థ్యం, నైపుణ్యాలను అందుకోగల నేర్పు వంటివి ఇందులో భాగం. మ్యాథ్స్, సైన్స్, విజువల్‌ ఆర్ట్, వెర్బల్‌/ రిటన్‌ కమ్యూనికేషన్, లాజిక్, రీజనింగ్‌ మొదలైనవన్నీ దీని కిందకి వస్తాయి.

పని సంబంధ విలువలు: పేరు, భద్రత, అంతర్గత సంబంధ బాంధవ్యాలు, ఇతరులకు సాయం చేయడం, ఎలాంటి సమయంలోనైనా పని చేయగలగడం, ఆశించే జీతభత్యాలు మొదలైనవి. మొత్తంగా కెరియర్‌కు సంబంధించి విద్యార్థి ఆశించే అంశాలుగా కూడా వీటిని చెప్పొచ్చు.

Posted Date : 26-08-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌