• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నవ యువతకు ‘నైస్‌’ సహాయం

ఫెలోషిప్పులు, ఇంక్యుబేషన్‌ సహాయం

తరగని ఉత్సాహం, సరికొత్త ఆలోచనలూ ఉన్న యువతకు ఆహ్వానం పలుకుతోంది.. నైస్‌ (ఎన్‌ఎండీసీ ఇన్నొవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌)  ప్రోగ్రాం. ఎన్‌ఎండీసీ లిమిటెడ్, ఐఐటీ హైదరాబాద్‌లోని స్టార్టప్‌ సపోర్ట్‌ సిస్టమ్‌.. ఐ-టీఐసీ ఫౌండేషన్‌లకు చెందిన ఈ ఇంక్యుబేషన్‌- ఫెలోషిప్‌ కార్యక్రమం ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. దీని ద్వారా 15 అంకుర సంస్థలకూ, 15 ఫెలోషిప్పులకూ ఆర్థికపరంగానే కాకుండా మౌలిక సదుపాయాలూ, మార్గదర్శనం లాంటి ప్రయోజనాలను అందిస్తారు. దేశంలో వ్యవస్థాపకత, ఆవిష్కరణలను ప్రోత్సహించి అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వటం దీని లక్ష్యం.     
మానవాళికి అద్భుతంగా ఉపయోగపడే ఎన్నో ఆలోచనలు యువతరం మేధకు తడుతుంటాయి. వాటిని సాకారం చేయగలిగే వనరుల లభ్యత లేక చాలామంది నిరాశపడుతుంటారు. అలాంటివారికి మద్దతునిస్తూ ప్రోత్సహించటానికి నైస్‌ ఒక వేదికగా ఏర్పడింది. తపన, సాంకేతికతపై ఉత్సుకత, ప్రపంచ భవితను మెరుగ్గా మార్చగల ఆలోచనలున్న వ్యక్తులకు ఇది ఆహ్వానం పలుకుతోంది. పరిశ్రమ- విద్యావ్యవస్థల అనుసంధానానికి ఓ నమూనాగా; స్టార్టప్‌ ఇండియా ప్రయత్నాలు ఫలవంతమయ్యేలా ‘నైస్‌’ను రూపొందించారు. 
ఔత్సాహికులు తమ ముడి ఆలోచనలను ఆచరణయోగ్యమైన ఉత్పత్తులుగా మార్చేలా ప్రోత్సహించాలనే ప్రధాన లక్ష్యంతో ఫెలోషిప్పులను ప్రవేశపెట్టారు. డీప్‌ టెక్‌ స్టార్టప్‌లపై పనిచేసే అవకాశం దీని ద్వారా లభిస్తుంది. ఈ ఫెలోషిప్‌ కింద నెలకు రూ.80,000 వరకూ స్టైపెండ్‌ను ఏడాది పాటు అందిస్తారు. సరికొత్త ఆవిష్కరణలు అభివృద్ధి అయి, నిలదొక్కుకునేలా సహకరిస్తారు.     

ఫెలోషిప్‌లకు ఎవరు అర్హులు?
డీప్‌ టెక్నాలజీపై సరికొత్త మౌలిక ఆలోచనలు ఉండాలి.
భారతీయ పౌరులై, వయసు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
కనీసం గ్రాడ్యుయేట్‌ అయివుండాలి. ఇంజినీరింగ్, మెడికల్‌/సైన్స్‌ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఆదాయం ఆశించకుండా పూర్తి సమయం పనిచేయటానికి సంసిద్ధంగా ఉండాలి.

అర్హులైనవారు వెబ్‌సైట్‌లో ఇచ్చిన నిర్దిష్ట ఫామ్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2020. 

దరఖాస్తుదారుల్లోంచి ఎంపికైనవారికి ఈ-మెయిల్‌ ద్వారా డిసెంబరు 20కల్లా సమాచారం అందిస్తారు. వారు తర్వాతి దశ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సివుంటుంది.  

అంకుర సంస్థలకు ప్రోత్సాహం
నైస్‌ ఇంక్యుబేషన్‌ ప్రోగ్రాం ద్వారా అంకుర (స్టార్టప్‌) సంస్థలు విజయవంతమైన బిజినెస్‌ ఎంటర్‌ప్రైజ్‌లుగా వృద్ధి చెందేలా సహకారం అందిస్తారు. ఎంపికైన అంకుర సంస్థకు రూ.25 లక్షలు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.   

ఎవరు అర్హులు?
స్టార్టప్‌ ఆలోచన డీప్‌ టెక్నాలజీపై తప్పనిసరిగా ఉండాలి.
స్టార్టప్‌ ఫౌండర్‌ భారతీయ పౌరులై ఉండాలి. 
ఫౌండర్‌ వయసు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 
కనీసం గ్రాడ్యుయేట్‌ అయివుండాలి. ఇంజినీరింగ్, మెడికల్‌/సైన్స్‌ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 
డెఫినిట్‌ ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ (పీఓసీ) తప్పనిసరి. 
సొంత ఐపీ ఉన్న స్టార్టప్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది.   

అర్హులైన అంకుర సంస్థలు వెబ్‌సైట్‌లో ఇచ్చిన నిర్దిష్ట ఫామ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2020. 

దరఖాస్తు చేసిన సంస్థల్లోంచి ఎంపికైన స్టార్టప్‌ల నిర్వాహకులకు ఈ-మెయిల్‌ ద్వారా డిసెంబరు 20కల్లా సమాచారం అందిస్తారు. వారు తర్వాతి దశ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సివుంటుంది.

Posted Date : 18-11-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌