• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రభుత్వ కొలువు  మీ లక్ష్యమా?  

‣ తగిన పోటీ వైఖరి తప్పనిసరి

సర్కారీ కొలువంటే అందరికీ ఆకర్షణే!  సాటిలేని ఉద్యోగ భద్రత, ఆరోగ్యపరంగా, ఇతరత్రా చక్కని సదుపాయాలు, సమాజంలో హోదా.. ఇవన్నీ సొంతమవుతాయి. అయితే దాన్ని సాధించటం అంత సులువేమీ కాదు. తీవ్రమైన పోటీని ఎదుర్కోవాలి. మిగతావారి కంటే మెరుగైన ప్రతిభ చూపి నెగ్గాల్సివుంటుంది. ఒక లక్ష్యం సాధించాలంటే అందుకు తగ్గ ఆలోచనా ధోరణిని సంపూర్ణంగా అలవర్చుకోవాల్సిందే. అది సాధ్యమైనపుడు మిగతా అన్ని కోణాల్లో అన్నివిధాలా  అనుకూల వాతావరణం ఏర్పడుతుంది; లక్ష్య సాధన ప్రయత్నాలు సఫలమవుతాయి! 

కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రైవేటురంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు పోయాయి. సుస్థిరమైన జీవిక కోసం అన్వేషణ నవయువత ధ్యేయమైంది. అందుకే ప్రభుత్వ పోటీపరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న భావన వారిలో పెరుగుతూవస్తోంది. మరోపక్క విదేశీ ఉద్యోగాలు కూడా ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో అందని మానిపండ్ల మాదిరిగా ఉన్నాయి. అందుకే బ్యాంకింగ్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, యూపీఎస్‌సీ, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ప్రకటించే నోటిఫికేషన్ల ద్వారా కొలువులు సాధించి జీవితాల్లో స్థిరపడాలని యువతీ యువకులు ఆశిస్తున్నారు. అయితే  ప్రకటించే ఉద్యోగాల సంఖ్య వేలల్లో, ఉద్యోగార్థులు లక్షల్లో ఉండటంతో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నిరుద్యోగులు తమ లక్ష్యాన్ని చేరే అవకాశం కనిపిస్తోంది. అటువంటి అత్యధిక స్థాయి పోటీలో రాణించి సర్కారీ ఉద్యోగాలకు ఎంపికవ్వాలంటే...ఎటువంటి ఆలోచనా ధోరణి, పోటీ వైఖరి (కాంపిటేటివ్‌ యాటిట్యూడ్‌ ) ఉండాలో పరిశీలిద్దాం!

1. అభిరుచి, సామర్థా్యలు  

ఎవరో సూచించారని కాకుండా అభ్యర్థి తన బలాలు, బలహీనతలు, వనరులు, అవరోధాలు మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. దీన్ని మొదటి అడుగుగా చెప్పవచ్చు. స్వీయ సామర్థ్యాలను బట్టి లక్ష్యాలను ఎంపిక చేసుకున్నప్పుడే అనుకున్న ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. తెలిసినవారికి ఒక ఉద్యోగం వచ్చిందని.. అదే ఉద్యోగాన్ని పొందే ప్రయత్నం చేయటం అన్నివేళలా సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఒక ఉద్యోగం పట్ల ఉండే అభిరుచి- వ్యక్తి ప్రవర్తనకు  ప్రేరణ అని చెప్పవచ్చు. అందువల్ల అభిరుచులకూ, సామర్థ్యాలకూ అనుగుణంగా ఉద్యోగ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే లక్ష్య దిశలో కృషి కొనసాగుతుంది. అందుకని అభ్యర్థులు తమ అభిరుచులు కూడా అధ్యయనం చేసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం సముచితమని చెప్పవచ్చు.

2. సుదీర్ఘ పోరుకు సంసిద్ధత  

ఇలా వచ్చి ఒక ప్రయత్నం చేసి అలా ఫలితం పొందాలని అస్సలు ఆశించవద్దు. మన దేశంలో ఉద్యోగరంగంలో ఉండే తీవ్రమైన పోటీ వల్ల ఒకటికి మించి ఎక్కువ ప్రయత్నాలు చేసినప్పుడే ఆశించిన ఫలితాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఒకటికి మించి ప్రయత్నాలు చేసేందుకు కనీసం రెండు సంవత్సరాల సమయాన్ని నిర్దేశించుకోవాలి. రాష్ట్ర సర్వీస్‌ కమిషన్లలో ఉండే కొన్ని అవరోధాల మూలంగా కొన్ని సందర్భాల్లో మూడు నుంచి ఐదు సంవత్సరాలు కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత ఓపిక, సుదీర్ఘ ప్రయత్నం చేయగలం.. అనుకున్నప్పుడే ఈ పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపటం శ్రేయస్కరం. ఉద్యోగం సాధించాలనే ఉత్సాహం రోజులు గడిచినకొద్దీ పల్చబడకుండా, ప్రేరణ కాలక్రమంలో కరిగిపోకుండా జాగ్రత్తపడాలి.  

3. అభ్యర్థులపై అనుకూల వైఖరి 

మనదేశంలో జనాభా ఎక్కువ; వనరులు తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న పోటీ పరీక్షలకు కూడా లక్షల్లో అభ్యర్థులు ఉంటారు. సగటు మనస్తత్వంతో ఆలోచిస్తే పోటీదారుల పట్ల ప్రతికూల ఆలోచన ఏర్పర్చుకుని తీవ్ర ఒత్తిడికి గురవ్వాల్సివస్తుంది.  పర్యవసానంగా లక్ష్యాన్ని సాధించలేక నిస్సహాయంగా మిగిలిపోతారు. దానికి భిన్నంగా- పోటీదారుల నుంచి నేర్చుకుంటూ మనల్ని మనం మెరుగుపరుచుకునే ధోరణిని అలవర్చుకోగలిగితే..? మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. దీన్ని ఎన్నో పరిశోధనలు ప్రకటించాయి. అందువల్ల పోటీదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న కొద్దీ అభ్యర్థులు తమ శక్తుల్ని మరింతగా పెంచుకునే వైఖరిని ఏర్పర్చుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మన పోటీదారులు మనకు మార్గదర్శకులు అని భావించాలి.

4. వాస్తవాన్ని అంగీకరించే తీరు 
‘ఇష్టం ఉన్నా లేకపోయినా భారతదేశంలో పోటీపరీక్షలు ఇలాగే ఉంటాయి’ అనే అవగాహన పెంచుకున్నప్పుడే అభ్యర్థుల్లో ఈ పోటీ వాతావరణంపై సానుకూల వైఖరి ఏర్పడుతుంది. తద్వారా తమ శక్తియుక్తుల్ని పూర్తిస్థాయిలో కేంద్రీకరించగలుగుతారు. ఇక్కడ పోటీ వాతావరణంలో ఉన్న ప్రతికూల విషయాలను పరిగణనలోకి తీసుకుంటే తీవ్ర అసంతృప్తికి గురై శక్తుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతారు. అప్పుడు ప్రయత్నాలు వృథా అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. అందువల్ల అభ్యర్థులు మానసికంగా ఈ పోటీ వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించే మనస్తత్వం అలవర్చుకోవాలి. అలాంటప్పుడే సరైన ప్రణాళికతో పోరాటం చేయగలుగుతారు.

5. అననుకూలత అధికం

మన దేశపు పోటీపరీక్షల వాతావరణంలో సానుకూలతల కంటే అననుకూలతలే ఎక్కువ. ఇది నిజం. పోటీ పరీక్షలకు సిద్ధపడటం పూల పాన్పు కాదు. ముళ్లబాట లాంటిదే. ఆశ కంటే నిరాశా వాతావరణం ఎక్కువ. ప్రతి దశలోనూ అనేక అననుకూలతలు అభ్యర్థుల్ని వేధిస్తూనే ఉంటాయి. ఫలితంగా 90 శాతం మంది అభ్యర్థులు గాడి తప్పి లక్ష్యాన్ని మర్చిపోతారు. చివరకు వైఫల్యాన్ని మూటగట్టుకుంటారు. ఇది గ్రహించి మెలకువవగా ఉంటే పోరాట తత్వం పెరుగుతుంది. అననుకూలతలను కూడా సానుకూలతలుగా మార్చుకునే నైపుణ్యం అలవడినప్పుడు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి మానసిక పరిస్థితికి అభ్యర్థులు అలవాటు పడితే విజయం చేరువలోనే ఉంటుంది.

6. పరాజయాన్ని ప్రేమించాలి 

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక సందర్భాల్లో పరాజయాలు రావడం సహజమైన విషయం. వస్తున్న పరాజయాలకు నిరాశలో కూరుకుపోయి లక్ష్య సాధన నుంచి పక్కకి వెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువ. అలా కాకుండా వచ్చిన ప్రతి పరాజయాన్నీ స్వీకరించాలి, ప్రేమించాలి. అంటే దాన్ని అంగీకరించడం, లోపాలను పరిష్కరించుకోవడం, పరిపుష్ఠం కావడం. పరాజయాన్ని అంగీకరించగలిగిన వైఖరి ఉన్నప్పుడు అదే విజయానికి రాచబాట అంటారు మనోవిశ్లేషణ వేత్తలు. దీర్ఘకాలిక లక్ష్యాలను చేరే క్రమంలో చిన్నచిన్న లక్ష్యాల్లో విజయం సాధించవచ్చు. వచ్చిన గెలుపుతో సంతృప్తి చెందకూడదు. ఆ విజయాన్ని మాత్రం ఆస్వాదించి అంతిమ లక్ష్యాన్ని సాధించేవిధంగా ప్రణాళికలు రూపొందించుకున్నవారే అంతిమ విజేతలుగా నిలుస్తారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ తరహా ధోరణి అభ్యర్థులను నెగ్గేలా చేస్తుందనటంలో సందేహం లేదు.

7. ఓటమి ఎదురైతే ప్లాన్‌-బి

విజయాన్ని పొందుతామనే ఆలోచన కచ్చితంగా మంచి ప్రేరణకు దారి తీస్తుంది. తగినంత కృషి చేయటానికి ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. అయితే విజయాన్ని తప్పనిసరిగా సాధించాలనే మితిమీరిన ఒత్తిడి ఏమంత మంచిది కాదు. ఇది అపజయానికీ కారణం కావొచ్చు. అందుకే.. ‘అపజయం వస్తే ఏమి చేయాలి?’ అనే ఆలోచనతో పకడ్బందీగా ప్లాన్‌-బిని రూపొందించుకుంటే విజయానికి అవరోధంగా నిలిచే ఒత్తిడి దూరమవుతుంది.  ‘ఏ కారణం వల్లనైనా దీనిలో నెగ్గకపోతే ప్రత్యామ్నాయం ఉంది’ అనే ఆలోచన అభ్యర్థుల్లో ఒక తెలియని మానసిక స్థిరత్వాన్ని కల్పిస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచనల్ని ఏర్పరుచుకోవాలి.

Posted Date : 26-11-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌