• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అన్నీ నేర్చుకో... ఆన్‌లైన్‌లో!

ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు  

పరీక్ష రాస్తే సర్టిఫికెట్లు 

రిజిస్ట్రేషన్లకు ఎన్‌పీటీఈఎల్‌ ఆహ్వానం

ఆసక్తి ఉంటే చాలు.. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో ఉచితంగా వీడియో పాఠాలు వింటూ నేర్చుకోవచ్చు. వివిధ సబ్జెక్టుల్లో పట్టు సాధించడానికి 500కు పైగా కోర్సులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్‌ లర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తోంది. చదువుతోన్న కోర్సుల్లో మరింత పరిజ్ఞానానికీ, కొత్త సబ్జెక్టుల్లో ప్రావీణ్యానికీ ఈ వీడియో పాఠాలు ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారూ, నైపుణ్యాలను మెరుగుపరచుకోదలచినవారూ వీటిలో చేరి తమ పరిధి విస్తరించుకోవచ్చు. ఈ పాఠాలను ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు అందిస్తున్నారు. కోర్సు చివరిలో పరీక్ష రాసి సర్టిఫికెట్‌ అందుకునే అవకాశమూ ఉంది!  
 

నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉన్నప్పటికీ చెప్పేవారు లేకపోవచ్చు. వినడానికి ఆసక్తి ఉన్నప్పటికీ ఫీజు చెల్లించడానికి స్థోమత సరిపోక పోవచ్చు. కాలేజీకి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ వెళ్లినప్పటికీ సరిగా చెప్పేవారు లేకపోవచ్చు. సమస్య ఏమైనప్పటికీ అందరికీ పనికొచ్చే పరిష్కారం ఒకటి ఉంది. అదే ఎన్‌పీటీఈఎల్‌. విద్యా నేపథ్యం ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే కోర్సులను ఈ వేదిక అందిస్తోంది. 
 

ఇంజినీరింగ్, ఇంగ్లిష్, మ్యాథ్స్, మేనేజ్‌మెంట్, ఫిజిక్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌... ఇలా ఎన్నో విభాగాలూ, సబ్జెక్టుల్లో విస్తృత సంఖ్యలో వీడియో పాఠాలను రూపొందించారు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్, మెకానికల్, సివిల్, ఎల్రక్టికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్, మెటలర్జీ, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్‌ తదితర బ్రాంచీలవారీగా కోర్సులు లభిస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం బీటెక్, ఎంటెక్‌ చదువుతున్నవారితోపాటు గేట్, ఐఈఎస్‌ తదితర పోటీ పరీక్షల అభ్యర్థులకూ ఉపయోగపడతాయి. 
 

ఆసక్తి ఉన్నవారు https://nptel.ac.in/ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. మీ విద్యా నేపథ్యం, అవసరాన్ని బట్టి నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు. అర్హతలు, వయసు నిబంధనలు ఏమీ లేవు. ఈ వీడియో పాఠాలను ఐఐటీలు, ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఇతర పేరున్న సంస్థల్లోని ప్రొఫెసర్లు అందిస్తున్నారు. గతంలో రూపొందించినవాటితోపాటు కొత్త కోర్సులూ చేర్చారు. ఉద్యోగులకూ, బోధన రంగంలో ఉన్నవారికీ ఉపయోగపడే కోర్సులూ ఎన్నో ఉన్నాయి.    
 

ఇదీ షెడ్యూల్‌...
ఆన్‌లైన్‌ పాఠాలు వచ్చే జనవరిలో మొదలై ఏప్రిల్‌ వరకు కొనసాగుతాయి. జనవరి - ఏప్రిల్‌ సెషన్‌లో అన్ని విభాగాల్లోనూ కలుపుకుని మొత్తం 500కు పైగా కోర్సులను అందుబాటులో ఉంచారు. కోర్సు నేపథ్యం, పరిధి బట్టి వీటిని 4, 8, 12 వారాల వ్యవధితో నిర్వహిస్తారు. కోర్సును బట్టి ప్రతివారం దాదాపు 4 గంటలు వీడియో పాఠాలు అందిస్తారు. ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే సౌకర్యమూ కల్పించారు. ప్రగతి ఎలా ఉందో తెలుసుకోవడానికి వారంవారం అసైన్‌మెంట్లూ ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కోర్సు పూర్తయిన తర్వాత పరీక్షలు సైతం రాసుకోవచ్చు. ఇందులో అర్హత సాధించినవారికి ఎల్రక్టానిక్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. దీన్ని భవిష్యత్తు అవసరాలు, ఉద్యోగాన్వేషణలో ఉపయోగించుకోవచ్చు. పరీక్ష రాసి సర్టిఫికెట్‌ పొందడానికి రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 కడితే సరిపోతుంది. పరీక్ష రాయాలనుకున్నవారు అసైన్‌మెంట్లను పూర్తిచేయడం తప్పనిసరి. వీటిలో కనీస మార్కులు పొందినవారినే పరీక్షకు అనుమతిస్తారు. సర్టిఫికెట్‌ పొందడానికి అసైన్‌మెంట్లకు 25 శాతం, పరీక్షకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. ఒక అభ్యర్థి ఎన్ని కోర్సుల్లోనైనా చేరవచ్చు. అలాగే గరిష్ఠంగా 6 పరీక్షలు రాసుకునే అవకాశం ఉంది.     
 

4, 8 వారాల వ్యవధి ఉండే కోర్సులు రెండు విడతల్లో మొదలవుతాయి. నచ్చిన విడతను ఎంచుకోవచ్చు. 4 వారాల కోర్సుల మొదటి సెషన్‌ జనవరి 18న మొదలై ఫిబ్రవరి 21తో ముగుస్తుంది. రెండో విడత ఫిబ్రవరి 15తో మొదలై మార్చి 12తో పూర్తవుతుంది. 
 

8 వారాల కోర్సులు తొలి విడత జనవరి 18న మొదలై మార్చి 12 వరకు కొనసాగుతాయి. రెండో విడతలో ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 9 వరకు ఉంటాయి. 
 

 12 వారాల కోర్సులు మాత్రం జనవరి 18 నుంచి ఏప్రిల్‌ 9 వరకు ఒకే విడతలో ఉంటాయి. 
 

మొదటి సెషన్‌లో చేరడానికి, 12 వారాల కోర్సులకు జనవరి 25లోగా వివరాలు నమోదు చేసుకోవాలి. రెండో సెషన్‌కు గడువు ఫిబ్రవరి 15 వరకు ఉంది. 
 

సెషన్‌ 1లో 4, 8 వారాల కోర్సుల్లో చేరినవారికి మార్చి 21న పరీక్షలు నిర్వహిస్తారు. సెషన్‌ 2లో 4, 8 వారాల కోర్సులతోపాటు 12 వారాల కోర్సుల వారికి ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. వీటిని రాయడానికి గడువు తేదీలోగా ఫీజు చెల్లించాలి. 
 

ఏం నేర్పుతారు?
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ కోర్సు ఉదాహరణగా తీసుకుంటే..దీన్ని 12 వారాల వ్యవధితో నిర్వహిస్తున్నారు. ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో ఈ కోర్సు నడుపుతున్నారు. ఈ తరగతుల్లో భాగంగా పోటీ పరీక్షలకు అవసరమైన అడ్వాన్స్‌డ్‌- గ్రామర్, ఒకాబ్యులరీ, రీడింగ్, రైటింగ్‌ అంశాలను బోధిస్తారు. ప్రాక్టీస్‌ టెస్టులు ఉంటాయి. ఎఫెక్టివ్‌ రైటింగ్‌ కోర్సును 4 వారాల వ్యవధితో అందిస్తున్నారు. ఇందులో ప్రభావంతంగా రాయడానికి అవసరమైన మెలకువలు, వ్యాసరచన, బిజినెస్‌ లెటర్‌ రాసే విధానం, రిపోర్ట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్‌..మొదలైనవి ఆకర్షణీయంగా రాయడమెలాగో నేర్పుతారు. విద్యార్థులు, ఉద్యోగులు అందరికీ ఈ కోర్సు ఉపయోగకరం. 
 

సబ్జెక్టువారీగా...
హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌: సాఫ్ట్‌ స్కిల్స్‌ అండ్‌ పర్సనాలిటీ, ఎమోషనల్‌ ఇంటలిజెన్స్, ఎఫెక్టివ్‌ స్పీకింగ్, ఎంప్లాయిమెంట్‌ కమ్యూనికేషన్, లాంగ్వేజ్‌ అండ్‌ మైండ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్, ఫెమినిజం, ఎకనామిక్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్, మోడర్న్‌ ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్, పొలిటికల్‌ థియరీ, పొలిటికల్‌ థాట్, కల్చరల్‌ స్టడీస్, ఎఫెక్టివ్‌ రైటింగ్, హ్యూమన్‌ బిహేవియర్, జర్మన్, బ్రెయిన్‌ అండ్‌ బిహేవియర్, కాగ్నిటివ్‌ సైకాలజీ.. ఇలా 55 అంశాల్లో వివిధ వ్యవధులతో కోర్సులు అందిస్తున్నారు. 
 

మేనేజ్‌మెంట్‌: ఇంటిగ్రేటెడ్‌ మార్కెటింగ్, గ్లోబల్‌ మార్కెటింగ్, మార్కెటింగ్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్, క్వాలిటీ డిజైన్‌ అండ్‌ కంట్రోల్, సిక్స్‌ సిగ్మా, సప్లై చెయిన్, కన్జ్యూమర్‌ బిహేవియర్, మార్కెటింగ్‌ ఎనలిటిక్స్, బిజినెస్‌ స్టాటిస్టిక్స్, ఆపరేషన్స్‌ రిసెర్చ్‌..ఇలా 48 రకాల కోర్సులు నేర్చుకోవచ్చు. ఎంబీఏ, బీబీఎం, బీబీఏ చదువుతున్నవారితోపాటు సాధారణ విద్యార్థులు సైతం నేర్చుకోవడానికి అనువుగా ఇవి ఉంటాయి.
 

మ్యాథ్స్‌: లీనియర్‌ ఆల్జీబ్రా, ఇంజినీరింగ్‌ మ్యాథ్స్, కాలిక్యులస్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌...ఇలా చాలా అంశాలున్నాయి. 
 

ఫిజిక్స్‌: క్వాంటమ్‌ మెకానిక్స్, ఫైబర్‌ ఆప్టిక్స్, ఎల ్రక్టోమాగ్నటిజం, ఎక్స్‌పరిమెంట్‌ ఫిజిక్స్, ఆప్టికల్‌ సెన్సార్స్‌ ..మొదలైనవి ఉన్నాయి. 
 

కెమిస్ట్రీ: ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, క్వాంటిటేటివ్‌ మెథడ్స్‌ ఇన్‌ కెమిస్ట్రీ..ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ, పీజీ కెమిస్ట్రీ విద్యార్థులకు ఇవి ఉపయోగం. 
 

మల్టీ డిసిప్లినరీ: ఎథిక్స్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ ప్రాక్టీస్, ఇంట్రడక్షన్‌ టు రిసెర్చ్, థర్మో డైనమిక్స్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఎసెన్షియల్స్‌...తదితర అంశాలు ఉన్నాయి. 
 

ఇంజినీరింగ్‌లో...
 

కంప్యూటర్‌ సైన్స్‌: ఈ విభాగంలో అందిస్తోన్న కోర్సులు బీఎస్‌సీ, బీసీఏ, ఎమ్మెస్సీ సీఎస్, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్‌ కోర్సులు చదువుతోన్న విద్యార్థులతోపాటు సాధారణ గ్రాడ్యుయేట్లకు సైతం ఎంతో ఉపయోగకరం. సీ++, జావా, పైతాన్, డీబీఎంఎస్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్, డేటా సైన్స్, డేటా ఎనలిటిక్స్, మెషిన్‌ లర్నింగ్, డీప్‌ లర్నింగ్, వీఎల్‌ఎస్‌ఐ, టెస్టింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, క్రిప్టోగ్రఫీ..ఇలా 53 అంశాల్లో ఆసక్తి ఉన్నవాటిని నేర్చుకునే సౌలభ్యం ఉంది. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో సేవలందించాలనుకునేవారికి ఇవి అనువైనవి. 
 

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌: సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్, నెట్‌వర్క్‌ ఎనాలిసిస్, ఐసీ డిజైన్, పవర్‌ సిస్టమ్స్, కంట్రోల్‌ ఇంజినీరింగ్, ఫొటోనిక్స్, ఆప్టికల్‌ ఇంజినీరింగ్‌..ఇలా 57 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 
 

మెకానికల్‌: పవర్‌ ప్లాంట్‌ ఇంజినీరింగ్, థర్మో డైనమిక్స్‌ లాస్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్‌ అండ్‌ కంట్రోల్‌.. మొత్తంగా 69 కోర్సులు అందిస్తున్నారు. 
 

సివిల్‌: ల్యాండ్‌ స్కేప్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ సైట్‌ ప్లానింగ్, మోడర్న్‌ బేసిక్‌ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్, స్ట్రక్చర్‌ డైనమిక్స్, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌...ఇలా భిన్న అంశాల్లో వివిధ వ్యవధులతో కోర్సులు అందిస్తున్నారు.  
 

టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరింగ్, ఓషన్‌ ఇంజినీరింగ్‌ల్లోనూ పాఠాలు అందుబాటులో ఉన్నాయి.
 

ఎమోషనల్‌ ఇంటలిజెన్స్, సీ, జర్మన్, జావా, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, టెస్టింగ్, డేటా సైన్స్, డేటా ఎనలిటిక్స్, మెషిన్‌ లర్నింగ్, పైథాన్‌.. కోర్సులెన్నో ఉన్నాయి.
 

బ్యాంక్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే... తదితర పోటీ పరీక్షల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ కోర్సు అందిస్తున్నారు. 
 

ఐఐటీ ప్రవేశాలకోసం జేఈఈకి సిద్ధమవుతున్నవారి కోసం, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకోసం.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో క్లిష్టమైన అంశాలను తేలికగా అర్థం చేసుకునేలా బోధించడానికి ప్రొఫెసర్లు అందుబాటులో ఉన్నారు. 
 

ఆసక్తిగా, అందరినీ ఆకట్టుకునేలా రాయాలని ఆశించేవారికోసం ఎఫెక్టివ్‌ రైటింగ్‌ కోర్సును అభ్యసించవచ్చు.  
 

కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సాధారణ గ్రాడ్యుయేట్లకు, ఆసక్తి ఉన్నవారికోసం బేసిక్‌ కోర్సులతో పాటు అడ్వాన్స్‌డ్‌ కోర్సులూ లభిస్తున్నాయి.
 

ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, వ్యవహార నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆశించేవారు సాఫ్ట్‌స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులో చేరిపోవచ్చు.
 

ప్రభావవంతంగా మాట్లాడడం ఎలాగో ఆచరణాత్మకంగా తెలుసుకోవడానికి ‘స్పీకింగ్‌ ఎఫెక్టివ్‌లీ’ కోర్సు ఎంచుకుంటే చాలు. 

Posted Date : 07-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌