• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈ ప‌ద్ధ‌తులు పాటిస్తే.. ఇత‌ర భాష‌లూ తేలికే!

నేటి పోటీ ప్రపంచంలో ఎదగాలంటే ఒక్క మాతృభాష సరిపోదు. అవసరాలకు అనుగుణంగా ఇత‌ర ప్రాంతీయ భాషలు, విదేశీ భాషలను నేర్చుకోవాలి. అమ్మో.. మన భాషే సరిగా రాదు. ఇంకా ఇతర భాషలా.. అంటూ చాలామంది కొత్త లాంగ్వేజీలను తెలుసుకోడానికి వెనకాడుతుంటారు. అంత భయపడాల్సిన పనేమీ లేదు. కొన్ని మెలకువలు పాటిస్తే ఏ భాషపైనైనా తేలిగ్గా పట్టు సాధించవచ్చు. 
కెరియర్ అభివృద్ధిలో భాగంగా విదేశాల‌కు వెళ్లాలంటే మాతృభాషతోపాటు జాతీయ, అంతర్జాతీయ భాషలు తెలిసి ఉండాలి. ఎన్ని భాషలు తెలిస్తే అంత ప్రయోజనం ఉంటుంది. అందుకే కొన్ని పాఠశాలలు విద్యార్థులకు ఫ్రెంచ్‌, జర్మన్‌అంటూ పలు విదేశీ భాషలనూ నేర్పిస్తుంటాయి. కొందరు పెద్దయ్యాక ఇతర భాషలు నేర్చుకోవడం మొదలుపెడతారు. అదీ మంచి పరిణామమే. నేర్చుకోవడానికి వయసుతో పనిలేదు. ఎవరైనా, ఎప్పుడైనా కొత్త భాషలు నేర్చుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కోచింగ్‌, ఆన్‌లైన్‌క్లాసులు తీసుకునే ఇన్‌స్టిట్యూట్‌లు, యాప్స్‌అందుబాటులో ఉన్నాయి. 

చిన్న చిన్న లక్ష్యాలు
నేర్చుకోవడం ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఎవరైనా భాషలో ప్రావీణ్యం సంపాదించ‌డం క‌ష్టం. కాబట్టి, నిరుత్సాహపడవద్దు. నేర్చుకోవడంలో చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. కొత్త భాషకు చెందిన కొన్ని పదాలను మొదట తెలుసుకోవాలి. వాటి అర్థం ఏంటి? ఏ సందర్భాల్లో వాటిని వాడతారో గమనించాలి. పదాల గురించి తెలుసుకుంటున్న కొద్ది  ఉత్సాహం.. నమ్మకం పెరుగుతాయి. ఆ తర్వాతే వాక్యాలు.. వ్యాకరణంపై దృష్టి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. 

ఒక్కొక్క‌రికీ ఒక్కో పంథా
కొత్త భాషను నేర్చుకోవడంలో ఒక్కొక్కరికీ ఒక్కో పంథా ఉంటుంది. మొదటి నుంచే కొందరు వినడం ద్వారా, మరికొందరు మాట్లాడటం ద్వారా, ఇంకొందరు చదవడం ద్వారా నేర్చుకుంటుంటారు. ఏ విధానంలో నేర్చుకోవడం సులభంగా ఉందో అభ్యర్థులు గుర్తించాలి. దాన్నే పాటించడానికి ప్రయత్నించాలి. రోజూ సాధన చేయాలి. సాధన చేయడం ద్వారానే ప్రావీణ్యం సాధ్యమవుతుంది. అలా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవాలని ఇతరులు చెప్పే వాటి గురించి పట్టించుకోకపోవడం మంచిది. కొన్ని సార్లు నేర్చుకునే పంథా మారడం వల్ల భాషపై ఆసక్తిపోయే అవకాశం ఉంటుంది.


ఆసక్తులూ కొత్త భాషలోనే..
నేర్చుకునే భాషని రోజువారీ జీవితంలో భాగం చేయాలి. ఆసక్తులను కొత్త భాషలో వ్యక్తం చేసేందుకు, అనుసరించేందుకూ ప్రయత్నించాలి.  ఉదాహరణకు సినిమాలు ఇష్టమైతే..  నేర్చుకునే భాషకు చెందిన సినిమాలను చూడాలి.  ఆ భాష పాటలను వినాలి. నిత్యం ఉపయోగించే పదాలను కొత్త భాషలో పలకడం ప్రారంభించాలి. రోజూ కాకపోయినా.. అప్పుడప్పుడైనా ఇలా చేస్తూ ఉండటం మంచిది. తద్వారా ఎంత తొందరగా భాషపై పట్టు కుదురుతోందో తెలుస్తుంది.

త‌ర్జుమా చేసుకుంటే త్వరగా పట్టు
సాధారణంగా ఎదుటివాళ్లతో మాట్లాడే ముందు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలని అనే విషయాలపై ఒక అంచనా ఉంటుంది. ఆ ఆలోచనలు మాతృభాషలో ఉంటాయి.  వేరే భాషలో మాట్లాడాలనుకుంటే ముందుగా మాతృభాషలో అనుకొని.. దాన్ని కొత్త భాషలోకి తర్జుమా చేసి మాట్లాడ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. ఇదంతా మొదట్లో కాస్త కష్టంగానే ఉంటుంది. చేస్తున్న కొద్దీ తేలికవుతుంది. నేర్చుకుంటున్న భాషలోనే ఆలోచించడం సాధ్యపడుతుంది. ఇందుకోసం కొత్త భాషలోనే ప్రశ్నలు వేసుకొని, సమాధానాలు వెతుక్కుంటే త్వరగా పట్టు సాధించవచ్చు.

Posted Date : 15-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌