• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చిట్టి చేతులు అద్భుతాలు చేశాయ్‌!

 తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో విజేతల ఆవిష్కరణలు

అవసరాలే ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అదే పంథాలో ఆలోచించిన ఈ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు పడుతున్న కష్టాలను గుర్తించి మెదడుకు పదునుపెట్టారు. వినూత్నంగా యోచించి సమస్యలకు సులభ సాధ్యమైన పరిష్కారాలు చూపారు. అందుకే రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నిర్వహించిన ‘తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ పోటీలలో మొదటి మూడు బహుమతులను సొంతం చేసుకున్నారు. వరసగా రూ.75వేలు, రూ.50వేలు, రూ.35వేల నగదుతో పాటు మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి తదితరుల నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

ఊళ్లో దొరికే వాటితో శానిటరీ పాడ్లు

ఆవిష్కరణ పేరు: శ్రీ రక్ష ప్యాడ్లు
విద్యార్థుల పేర్లు: అనిత, జ్యోతి, శైలజ
పాఠశాల: మున్కనపల్లి ఉన్నత పాఠశాల, తుర్కపల్లి మండలం, యాదాద్రి జిల్లా
పేద యువతులు, మహిళలు శానిటరీ ప్యాడ్లు వాడాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. దానికి తోడు వాటిని ప్లాస్టిక్‌ లాంటి వాటితో తయారుచేస్తారు. ఫలితంగా దురద రావడం, కేన్సర్‌కి దారితీయడం లాంటి దుష్ఫలితాలకు అవకాశం ఉంది. తద్భిన్నంగా ఔషధ గుణాలున్న మొక్కలను వినియోగించి ప్యాడ్లను తయారుచేశారీ విద్యార్థులు. ఊళ్లలో దొరికే గుర్రపు డెక్క, వేప, పసుపు, మెంతులు, సబ్జా గింజల మిశ్రమంతో పర్యావరణ హితంగా వాటిని రూపొందించారు. ఒక్కో ప్యాడ్‌ ఖర్చు రూ.2 మాత్రమే. వీరి ఆలోచనకు మొదటి బహుమతి దక్కింది.

అలర్జీలు రాని చాక్‌పీసు

ఆవిష్కరణ పేరు: సేంద్రియ చాక్‌పీసు
విద్యార్థుల పేర్లు: పి.హర్షిత్‌వర్మ, కె.రుద్ర
పాఠశాల: మోడల్‌ స్కూల్‌, బంగారిగూడ, ఆదిలాబాద్‌
పాఠశాలలో బ్లాక్‌బోర్డు(నల్లబల్ల)పై రాసేందుకు వినియోగించే సుద్దముక్క(చాక్‌పీసు)ల తయారీకి జిప్సమ్‌ లాంటి రకరకాల రసాయనాలు వాడుతుంటారు. ఫలితంగా వాటితో రాస్తున్నప్పుడు, చెరిపివేస్తున్నప్పుడు దుమ్ముకణాలు రేగి కళ్లల్లో పడి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. అలర్జీ కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు బియ్యం పిండి, సుద్దమట్టితో చాక్‌పీసులను తయారు చేశారీ విద్యార్థులు. వీరి ఆవిష్కరణకు మూడో బహుమతి దక్కింది.

రైతులకు శ్రమ తగ్గించే సంచి...

ఆవిష్కరణ పేరు: బహుళ ప్రయోజనాల సంచి
విద్యార్థుల పేర్లు: ఎ.అభిషేక్‌, కె.రాజేష్‌, సీహెచ్‌.వేణు
పాఠశాల: దంతాలపల్లి ఉన్నత పాఠశాల, మహబూబాబాద్‌ జిల్లా
రైతులు కూరగాయలు, పత్తి, మిర్చి తదితర పంటలను కోయడానికి ఒక చేత్తో సంచి, బుట్ట, బకెట్‌ లాంటి వాటిని పట్టుకుని వాడుతుంటారు. ఇక చిన్న మొక్కలకు ఎరువులు వేయడానికి వంగి, లేవడం తప్పనిసరి. దానివల్ల శారీరకంగా ఇబ్బంది తప్పదు. దీన్ని గమనించిన విద్యార్థులు రైతులకు, రైతుకూలీలకు రకరకాలుగా ఉపయోగపడే సంచికి రూపమిచ్చారు. దాన్ని వీపు, ముందు భాగంలో జాకెట్‌లా ధరించవచ్చు. దానికి వెనుకా, ముందూ ఉండే జేబుల్లో పంట ఉత్పత్తులను తెంపి వేసుకోవచ్చు. ఆ సంచి వల్ల రెండు చేతులతో పంటను కోయవచ్చు. ఎరువులను సైతం జేబులో పోసి వదులుతూ ఉంటే మొక్కల వద్ద పడతాయి. ఫలితంగా వంగాల్సిన అవసరం ఉండదు. దీనికి రెండో బహుమతి దక్కింది.

- ఈనాడు, హైదరాబాద్‌

Posted Date : 05-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌