• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంట‌ర్న్‌షిప్‌ల‌కు ఇలా స‌న్న‌ద్ధ‌మ‌వ్వండి!

 నియామ‌క సంస్థ‌ల‌ను మెప్పించే మెల‌కువ‌లు

కొవిడ్‌ పరిణామాల కారణంగా ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇదే కొనసాగుతోంది. అలాగే చాలా సంస్థలు విద్యార్థులకు ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటిని రిమోట్‌/ ఆన్‌లైన్‌ / వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లనీ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇంటర్న్‌షిప్‌లనీ వ్యవహరిస్తున్నారు. ఇవి ఏయే రంగాల్లో అందుబాటులో ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 

విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్నీ, నైపుణ్యాలనూ అందించే ఇంటర్న్‌షిప్‌లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గత ఏడాది దాదాపు 76 శాతం మంది విద్యార్థులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేశారు. ఈ ఏడాదీ అదే ధోరణి కనిపిస్తోంది.  ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ వేదికగా దరఖాస్తు చేసుకోవచ్చు. తమ విద్యార్హతలూ, ఆసక్తులకు అనుగుణంగా ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలి.  ఉదాహరణకు మీరు మేనేజ్‌మెంట్‌ స్టూడెంట్‌ అయితే... బిజినెస్‌ డెవలపర్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్‌ రిసోర్సెస్, ఆపరేషన్స్‌ మొదలైన విభాగాల్లో రిమోట్‌  ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తున్న ప్రధాన రంగాలు

 కిందటి ఏడాది మేనేజ్‌మెంట్‌ రంగం అత్యధికంగా.. అంటే 45 శాతం వరకూ ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించింది. మార్కెటింగ్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, సేల్స్, డిజిటల్‌ మార్కెటింగ్, బ్రాండింగ్, కస్టమర్‌ సర్వీస్, మార్కెట్‌ రిసెర్చ్, ఫైనాన్స్, హ్యుమన్‌ రిసోర్సెస్, ఆపరేషన్స్‌ విభాగాల్లో ఈ ఇంటర్న్‌షిప్‌లు ఉన్నాయి. 

మీడియా రంగం కంటెంట్‌ రైటింగ్, జర్నలిజం, ఎడిటోరియల్, బ్లాగింగ్, కాపీ రైటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, పబ్లిక్‌ రిలేషన్స్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో 25 శాతం అవకాశాలు కల్పించింది. 

మేనేజ్‌మెంట్, మీడియా తర్వాత ఇంజినీరింగ్‌ రంగం 18 శాతం ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించింది. దీంట్లో ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఆండ్రాయిడ్‌ అండ్‌ ఐఓఎస్‌ యాప్‌ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్, సి.ఎ.డి.డిజైన్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఐఓటీ, వెబ్‌ డెవలప్‌మెంట్, గేమ్‌ డెవలప్‌మెంట్‌ మొదలైన విభాగాలున్నాయి. 


ఇంటర్న్‌షిప్‌ వేదికల్లో కొన్ని..

https://internshala.com/

www.letsintern.com/

www.stumagz.com/in/discover

www.twenty19.com/

www.internworld.in/index.aspx

దరఖాస్తు ఎలా?

మీ అర్హతలకు తగిన అవకాశం ఎక్కడ ఉంటుందో చూసుకుని దరఖాస్తు చేయాలి. సంబంధిత వేదికలో మీ పేరును రిజిస్టర్‌ చేసుకుని రెజ్యూమె పంపాలి. రెజ్యూమెలో మీ ఇంటర్న్‌షిప్‌కు అవసరమైన నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఉదాహరణకు కంటెంట్‌ రైటింగ్‌ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేస్తున్నట్లయితే... ఇంగ్లిష్‌ రాయడంలో మీకున్న నైపుణ్యాన్ని తెలియజేయాలి. అలాగే పాఠశాలలో, కళాశాలలో ఇంగ్లిష్‌ రాయడంలో మీరు చూపించిన ప్రావీణ్యాన్నీ ఉదాహరణగా పేర్కొనవచ్చు. 

రెజ్యూమెను ఆసక్తికరంగా రూపొందించిన తర్వాత వివిధ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేయొచ్చు. ప్రొఫైల్, స్టైపెండ్‌ స్థాయి, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మొదలైన ఫిల్టర్లను ఉపయోగించి ఆసక్తి, అర్హతలకు తగినదాన్ని ఎంచుకోవాలి. 

వీటిని గుర్తుంచుకోండి..

వివిధ సంస్థలకు విద్యార్థుల నుంచి అసంఖ్యాకంగా దరఖాస్తులు వస్తుంటాయి. అర్థవంతంగా, ఆకట్టుకునే విధంగా దరఖాస్తును రూపొదించినట్లయితే ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. అలా చేయాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. 

స్పష్టంగా.. సూటిగా:

ప్రతి విద్యార్థి రెజ్యూమెను ఎక్కువసేపు పరిశీలించేంత సమయం ఉద్యోగావకాశం కల్పించే సంస్థలకు ఉండదు. రిక్రూటర్‌ ఒక్కో రెజ్యూమెకు సగటున 7.4 సెకండ్ల సమయాన్ని మాత్రమే కేటాయించగలరని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కంపెనీ అవసరాలకు మీరెలా సరిపోతారనే విషయాన్ని స్పష్టంగా దరఖాస్తులో చెప్పగలగాలి. జాబ్‌ డిస్క్రిప్షన్‌లోని ప్రధాన పదాలను రెజ్యూమెలో స్పష్టంగా తెలియజేయాలి. ఇలాచేస్తే ఆటోమేటెడ్‌ సిస్టమ్‌లో రెజ్యూమెలను పరిశీలించడం ఎంప్లాయర్‌కు సులువవుతుంది. దరఖాస్తులో తాజా అనుభవం, కళాశాలలో సాధించిన విజయాలను గురించి ముందుగా రాయాలి. మీ అనుభవం ప్రస్తుతం చేయబోయే ఉద్యోగానికి ఏ విధంగా ఉపయోగపడగలదో వివరించాలి. 

మిమ్మలే ఎందుకు తీసుకోవాలి: ఫలానా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి మీరు చాలా ఆసక్తిగా ఉన్నారనే విషయాన్ని రెజ్యూమెలో తెలియజేయాలి. దరఖాస్తు చేసిన ఇతర అభ్యర్థులతో సమానంగానే మీకూ విద్యార్హతలు ఉంటాయి. కానీ ఇతరుల కంటే మీరు ఏవిధంగా ప్రత్యేకమనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలగాలి. అంటే.. మీ గురించి మీరు గొప్పలు చెప్పమని అర్థంకాదు. కానీ ఇంటర్న్‌షిప్‌ చేయడానికి మీరెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారనే విషయాన్ని ఆసక్తికరంగా తెలియజేయాలి.

అనుకూలంగా ఉండాలి: ప్రతి సంస్థకూ కొన్ని ప్రత్యేక విధి విధానాలూ, ప్రత్యేక అవసరాలూ ఉంటాయి. వాటికి అనుకూలంగా మీరు పనిచేస్తారనే భరోసాను కల్పించాలి. ఇంటర్న్‌షిప్‌ కోసం మొక్కుబడిగా జనరల్‌ ఈమెయిల్స్‌ పంపకుండా.. నిర్దిష్టంగా ఉండేలా చూసుకోవాలి. మీ వ్యక్తిత్వానికీ¨, ఉత్సాహానికీ అద్దం పట్టే కవర్‌ లెటర్‌ రాయాలి. 

క్లుప్తంగా: మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలో తెలిపే కవర్‌ లెటర్‌ రాసిన తర్వాత వెంటనే పంపించేయకుండా కాస్త సమయం తీసుకుని జాగ్రత్తగా దాన్ని మరోసారి చదివాలి. పెద్దపెద్ద వాక్యాలు లేకుండా క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలి. చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పకూడదు. సుమారుగా 250-300 పదాల్లో ఉత్తరాన్ని ముగించేలా చూడాలి. 

ఏమేం అవసరం?

ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌ చేయటం కోసం మీకు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌లాప్, ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. వీటితోపాటుగా కొన్ని నైపుణ్యాలూ ఉండాలి.

​​స్వతంత్రంగా పనిచేసే నేర్పు: ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌లో స్వతంత్రంగా పనిచేసే నైపుణ్యం తప్పనిసరి. ఇక్కడ మీ పనిని ఎవరూ పర్యవేక్షించరు. ఏవైనా సలహాలు, సూచనలు అవసరమైనా ఇవ్వడానికి అనుభవజ్ఞులూ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా పనిచేసే నైపుణ్యం ఉండాలి. కేటాయించిన పనిని ప్రతిభావంతంగా పూర్తిచేయగలగాలి. ఇందుకోసం మీకు మీరే స్ఫూర్తిగా నిలవాలి. 

సాంకేతికత: మీరు మారుమూల ప్రాంతంలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని బృందానికి తెలియజేస్తూ ఉండాలి. దీనికోసం సాంకేతికంగా స్వతంత్రంగా వ్యవహరించే నైపుణ్యం మీకుండాలి. పనిలో భాగంగా కొత్తకొత్త వినియోగదారులను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో భాగంగా వర్చువల్‌ మీటింగ్‌లలోనూ పాల్గొనాల్సి ఉంటుంది. వీటన్నింటిలోనూ రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలు ఎంతో   అవసరం. 

చురుకుదనం: అన్ని రకాల సదుపాయాలు ఉండే కార్యాలయం నుంచి పనిచేయడం వేరు. అరకొర సౌకర్యాలతో మారుమూల ప్రాంతాల నుంచి పనిచేయడం వేరు. వేర్వేరు పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ చురుగ్గా పనిచేసే నైపుణ్యం ఉండాలి. 

సమయపాలన: ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడూ కొన్ని అవరోధాలూ ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ తట్టుకుంటూ సమయపాలన పాటించాల్సి ఉంటుంది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ఇదెంతో అవసరం. వర్చువల్‌ మీటింగ్‌లకు సమయానికి హాజరుకావాలి. కాలం మీకెంత విలువైందో ఇతరులకూ అంతే విలువైందనే విషయం గుర్తించాలి.

ఆదాయం ఇలా: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గతంలో కంటే ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌లకు ప్రాధాన్యం పెరిగింది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికీ, అనుభవం గడించడానికీ విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యార్థులు అనుభవంతోపాటుగా సర్టిఫికెట్, లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్, స్టైపెండ్‌ సంపాదింవచ్చు. అంతేకాదు- నెలకు రూ.1,000 నుంచి 45,000 వరకు ఆర్జించవచ్చు. గత ఏడాది విద్యార్థులు పొందిన సగటు స్టైపెండ్‌ నెలకు రూ.5,000. 

ఇలా చేయొద్దు 

కవర్‌ లెటర్‌ రెజ్యూమ్‌కు సుదీర్ఘమైన నకలుగా ఉండకూడదు. అంటే రెజ్యూమెలో రాసిన అంశాలను ఇక్కడ మళ్లీ ప్రస్తావించకూడదు. ఇంతకుముందు ఇంటర్న్‌షిప్‌ చేసినట్లయితే దాంట్లో సాధించిన విజయాలను క్లుప్తంగా వివరించాలి. మీకున్న ఇతర అభిరుచులూ, వాటిలో మీరు సాధించిన విజయాలను తెలియజేయవచ్చు. 

రాసేటప్పుడు దోషాలు దొర్లకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా మరోసారి చదివి అక్షర, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. అంతా సరిగానే ఉన్నట్టుగా మీకు అనిపించినా సరే.. ఒకసారి మీ స్నేహితులతోనో తోబుట్టువులతోనో చదివించాలి. వారి అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకుని అవసరమైతే కొన్ని మార్పులు చేయొచ్చు. 

అరిగిపోయిన పాత పదాలూ, పదబంధాలను ఉపయోగించకూడదు. ఉదాహరణకు ఫాస్ట్‌ లెర్నర్, హార్డ్‌ వర్కింగ్‌ లాంటి పదాలను వాడకపోవడమే మంచిది. వీటి బదులుగా లెడ్, డిజైన్డ్, డెవలప్‌డ్, కాన్సెప్చులైజ్డ్‌ లాంటి క్రియాశీలక పదాలను వాడ‌టం మంచిది. 

- స‌ర్వేష్ అగ‌ర్వాల్‌, సీఈఓ, ఇంట‌ర్న్‌శాల‌

Posted Date : 13-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌