• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స్వీయ పరీక్ష చేసుకుంటున్నారా?

 

 

ప్రతిభను మార్కుల ఆధారంగా కొంతవరకే అంచనా వేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరి సామర్థ్యానికీ మార్కులొక్కటే కొలమానం కాదు కదా... విద్యార్థులైనా, ఉద్యోగార్థులైనా తమను తాము పూర్తిగా అర్థంచేసుకోవాలంటే ‘స్వీయ పరీక్ష’ ఎంతో అవసరం. 

 

మన బలాలూ, బలహీనతలేమిటి? ఆలోచనా విధానం ఎలా ఉంది? సానుకూలంగా ఆలోచిస్తున్నామా, పదేపదే ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయా? మన ఆలోచనా ధోరణి, దృక్పథం ఎలా ఉంటోంది... చాలామందిలో ఈ సందేహాలుంటాయి. వీటన్నింటికి గురించీ ఓ అవగాహన రావాలంటే ‘స్వీయ పరీక్ష’ చేసుకోవాల్సిందే. 

 

ఇది స్వీయ సామర్థ్యాలను అర్థంచేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని వాటిని చేరుకోవడానికి తోడ్పడుతుంది. విద్యార్థిగా, ఉద్యోగార్థిగా ప్రయాణం సాఫీగా సాగేలా చేసి ఉన్నత స్థాయికి చేరుకునేలా చేస్తుంది. 

 

లక్ష్యాలేమిటి?

ప్రస్తుతం మీరెక్కడున్నారు? భవిష్యత్తులో ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఎంతోగానో తోడ్పడుతుంది. కొంతమంది ఊహల్లో విహరిస్తూ వాస్తవానికి దూరంగా ఉండే లక్ష్యాలను ఏర్పాటుచేసుకుంటారు. వాటిని సాధించలేదని నిరాశపడుతుంటారు. అలాకాకుండా పొరపాటును గుర్తించి సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తుంది. 

 

సాధించిన విజయాలు: ఇవి మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుతాయి. మీ శక్తి సామర్థ్యాలను మీకు తెలిసేలా చేస్తాయి. మీ ప్రయాణానికి దిశా నిర్దేశం చేస్తాయి. ఆ మార్గంలో ప్రయాణించి మీ గమ్యాన్ని చేరుకునేలా చేస్తాయి. 

 

బలాలు, బలహీనతలు: బలహీనతలను గుర్తించి, అధిగమించడానికి ప్రయత్నించడం పైకి కనిపించేంత సులువైన పనికాదు. బలహీనతలను అధిగమించడాన్ని సవాలుగా తీసుకోవాలి. లక్ష్యసాధనకు అడ్డుగా ఉన్నవాటిని దాటి ముందుకు వెళ్లడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి. బలాలను గుర్తించి లక్ష్యసాధనకు సోపానాలుగా మలచుకోవాలి. 

 

శక్తిసామర్థ్యాలు: లక్ష్యాలను సాధించడానికి ఇవి ఎంతో అవసరం. అయితే పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాలి. 

 

విస్తృతంగా ఆలోచించాలి: చాలామంది తమ బలాలను గుర్తించినంత తేలిగ్గా బలహీనతలను గుర్తించలేరు. దాంతో కొన్ని విషయాల్లో ఎందుకు విఫలమవుతున్నారో తెలియక ఇబ్బంది పడుతుంటారు. బలహీనతలను గుర్తిస్తే వాటిని అధిగమించడానికి సులువుగా ప్రయత్నించవచ్చు. మనల్ని మనం నిజాయతీగా విశ్లేషించుకుంటేనే ఇది సాధ్యం. 

 

ప్రశాంతంగా: స్వీయ పరీక్ష చేసుకోవడానికి తొందర ఎంతమాత్రం పనికిరాదు. సరిపడినంత సమయం తీసుకుని నిదానంగానే పూర్తిచేయాలి. సరైన ప్రదేశాన్ని ఎంచుకుని కూర్చుని ప్రశాంతంగా ఆలోచిస్తూ ఈ ప్రక్రియను పూర్తిచేయాలి.

 

ఇలా చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. స్వీయపరీక్ష ద్వారా మీరు ఎక్కడెక్కడ వెనకబడ్డారో తెలుసుకుంటే వాటిని అధిగమించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు. 

 

మీరు సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తున్నట్టు తెలిస్తే దాన్ని సవరించుకోవచ్చు. కొందరు స్నేహితులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని వినియోగిస్తుంటారు. మరికొందరు వినోదానికే తమ సమయాన్ని కేటాయిస్తుంటారు. ఇవి ప్రస్తుతానికి బానే ఉంటాయిగానీ భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడవు. ఈ విషయాన్ని గుర్తిస్తే దిద్దుబాటు చర్యలను ప్రారంభించవచ్చు. 

 

‣ ఎవరో మీ లోపాలను ఎత్తిచూపే బదులు... స్వీయ పరీక్షలో ఎక్కడెక్కడ వెనకబడ్డారో మీరే గుర్తించి సరిదిద్దుకోవడం మంచిదే కదా! 

 

‣ ఇదంతా ఎవరి మెప్పు కోసమో చేయడం లేదు. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం కోసమే చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు! 

Posted Date : 09-06-2021 .