• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CV First Site‌: సి.వి. @ ఫస్ట్‌ సైట్‌!

ఫలితాన్నిచ్చే పది సూత్రాలు

‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అనేది ఎంతవరకూ వాస్తవమో గానీ... సి.వి. (కరిక్యులమ్‌ వీటే) విషయంలో మాత్రం తొలి చూపునకు ఎంతో ప్రాధాన్యం! చూసీ చూడంగానే నచ్చేలా దాన్ని తయారు చేస్తేనే అనుకూల ఫలితానికి ఆస్కారం. ఉద్యోగ సాధనలో కీలకమైన ఈ తొలి అడుగు ప్రాముఖ్యం గ్రహించకుండా సీవీని యాంత్రికంగా, అశ్రద్ధగా, అస్పష్టంగా తయారుచేస్తే అది రిక్రూటర్‌ను మెప్పించలేదు. సుదీర్ఘంగా సకల వివరాలతో నింపినా అసలుకే మోసం. ఇలాంటి పొరపాట్లు చేస్తే అది ‘ట్రాష్‌ ఫోల్డర్‌’లో చేరిపోవటం ఖాయం. మరి సమర్థంగా సీవీని తయారుచేసుకునేదెలా? నిపుణుల సూచనలు తెలుసుకుందాం!

ఎంబీఏ చదివిన అభిరామ్‌ ప్రముఖ నియామక సంస్థలెన్నింటికో ఉద్యోగ దరఖాస్తు చేస్తుకున్నాడు. కానీ అతడు ఆశించినంతగా రాత పరీక్షలకూ, ఇంటర్వ్యూలకూ పిలుపు రావడం లేదు. తగిన విద్యార్హతలు, అనుభవం సాధించినా తనకు నియామక దశలకు ఎందుకు పిలుపు రావటం లేదో అతడికి అర్థంకావడం లేదు. 

అభిరామ్‌ స్నేహితుడు రాకేష్‌ మాత్రం ప్రయత్నాలు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే చకచకా పరీక్షలకు హాజరై ప్రతిభ చూపాడు. త్వరలోనే ఉద్యోగం సంపాదించాడు. దాంతో అతణ్ణి కలిసి సలహా అడిగాడు అభిరామ్‌. స్నేహితుడు నియామక సంస్థలకు పంపుతున్న సీవీని పరిశీలించాడు రాకేష్‌. అది అనాసక్తికరంగా, మొక్కుబడిగా ఉండటం గ్రహించాడు. ఆ విషయమే చెప్పి.. వీలైనంత మెరుగ్గా సీవీని రూపొందించుకోమని సలహా ఇచ్చాడు!

తగిన విద్యార్హతలు, పని అనుభవం ఉన్నప్పటికీ ఆకట్టుకునే విధంగా కరిక్యులమ్‌ వీటేను రూపొందించకపోతే ఎలాంటి ఫలితమూ ఉండదు. విద్యార్హతలు, ప్రతిభాపాటవాల గురించి పొందిగ్గా అక్షర రూపంలో పొందుపరిస్తే అభ్యర్థి రచనాశైలి మీద సదభిప్రాయం కలుగుతుంది. తర్వాతి దశలకు పిలుపు వచ్చి ఉద్యోగ సాధన సులువవుతుంది. అందుకే సీవీని లోప రహితంగా, ఆకట్టుకునే విధంగా రూపొందించటం అంత అవసరం. 

1. స్పష్టంగా.. ఆకట్టుకునేలా..

లక్ష్య సాధనకు తోడ్పడే కరిక్యులమ్‌ వీటే ఎప్పుడూ స్పష్టంగా, ఆకట్టుకునే విధంగా ఉండాలి. రాయాలనుకున్న విషయాలను ఎలాంటి గందరగోళం లేకుండా రాయాలి. సీవీని తయారుచేసిన తర్వాత దాన్ని అభిప్రాయ సేకరణ కోసమంటూ  ఇతరులకు చూపించాల్సిన అవసరం లేదు. అందులో రాసిన విషయాలు మీకు సంతృప్తికరంగా ఉంటే చాలు. అలాగే ఎలాంటి విమర్శలకూ అవకాశం లేకుండా కరిక్యులమ్‌ను రూపొందించాలి. అందులో రాసిన విషయాలు కల్పితాలుగా, అసంబద్ధంగా ఉంటే చెత్తబుట్టలోకో, ట్రాష్‌ ఫోల్డర్‌లోకో చేరడం ఖాయం. ఇంటర్వ్యూకు ఎంపికచేసిన అభ్యర్థుల జాబితాలో మీ పేరు ఉండాలంటే.. కరిక్యులమ్‌ వీటే స్పష్టంగా, ఆకర్షణీయంగా ఉండాల్సిందే.

2. ఎక్కువగా రాయొద్దు

గతంలో చేసిన ఉద్యోగాలు, ఆ సందర్భంగా నిర్వర్తించిన విధుల గురించి కొంతమంది వివరంగా రాస్తుంటారు. దీనివల్ల ఉపయోగం ఉండదు. పేజీల కొద్దీ రాసిన సీవీని చూడటానికి రిక్రూటర్లు అంతగా ఆసక్తి చూపించరు. వివరంగా రాస్తే మంచిదనే ఉద్దేశంతో కొందరు తమ ఉద్యోగానుభవాలూ, అభిరుచుల గురించి ఎక్కువ రాసేస్తుంటారు. సాధారణంగా రిక్రూటర్లు ఐదారు సెకన్ల వ్యవధిలోనే సీవీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. కాబట్టి సీవీ ఎప్పుడూ ఒకటి, రెండు పేజీల్లోనే క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలి.

3. దేనికైనా ఒకటేనా..

కొంతమంది అభ్యర్థులు ఒక్కసారి కరిక్యులమ్‌ వీటేను తయారుచేసి దాన్నే అన్ని రకాల పోస్టులకూ పంపేస్తుంటారు. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు. దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి అనువుగా సీవీని రూపొందించుకోవటం తప్పనిసరి. దరఖాస్తు చేస్తోన్న ఉద్యోగంలో ఎలాంటి విధులను నిర్వర్తించాల్సి ఉంటుందో తెలుసుకోవాలి. వాటికి అనుగుణంగా.. కష్టమైజ్‌డ్‌ సీవీని తయారుచేయాలి. రిక్రూటర్లు అడిగే సమాచారానికి మీ సీవీ సమాధానంలా ఉండాలన్నమాట. 

4. అవాస్తవాలు వద్దు

ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో అవాస్తవాలు, అబద్ధాలతో సీవీని నింపేయకూడదు. తర్వాత అవన్నీ నిజంకాదని తేలినప్పుడు మిమ్మల్ని బ్లాక్‌లిస్టులో పెట్టే ప్రమాదం ఉంది. డాక్యుమెంట్లు, రిఫరెన్సుల విషయంలో అవాస్తవాలు రాయకూడదు. పరిశీలనలో అవన్నీ అబద్ధాలని తేలితే ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంటుంది. కెరియర్‌కు మచ్చ ఏర్పడుతుంది.

5. ఫొటో జోడింపు ఎలా?

వంద మాటలు చెప్పలేని విషయాన్ని ఒక్క చిత్రం చెబుతుందంటారు. కాబట్టి సీవీకి మీ ఫొటోను జత చేయడం మర్చిపోవద్దు. అయితే అది సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. సినిమా, మోడలింగ్‌ అవకాశాల కోసం ఫొటో పంపుతున్నట్టుగా ఆర్భాటంగా ఉండకూడదు. 

6. నైపుణ్యాల ప్రస్తావన

మీరు ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో.. దానికి అవసరమైన నైపుణ్యాల గురించి సీవీలో ప్రస్తావించాలి. ఉదాహరణకు ఉద్యోగ ప్రకటనలో... పైతాన్, ట్యాలీ నైపుణ్యాలు అవసరమని చెప్పారనుకుందాం. మీరు సీవీలో ఆ విషయం ప్రస్తావించకుండా  ‘నేను చాలా శ్రద్ధగా, కష్టపడి పనిచేస్తాను’ అంటూ జనరల్‌గా రాయటం అర్థ్ధరహితమే అవుతుంది. మీకు సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఎంతమేరకు ఉన్నాయనే విషయాన్ని తెలిపితే సరిగ్గా సరిపోతుంది. 

7. విధులు కాదు.. విజయాలు

కొంతమంది గతంలో నిర్వహించిన విధులూ, వాటి విశేషాలన్నీ వివరంగా సీవీలో ఏకరవు పెడుతుంటారు. సీవీలో ఇవన్నీ పొందుపరిచే అవకాశం ఎంతవరకూ ఉంటుందనేది ఆలోచించరు. చేసిన విధులకు బదులుగా మీరు వ్యక్తిగతంగా సాధించిన విజయాల గురించి రాస్తే సీవీ రిక్రూటర్లను ఆకట్టుకుంటుంది.

8. సరిచూసుకున్నాకే..

కరిక్యులమ్‌ వీటేను రూపొందించిన తర్వాత ఒకసారి సరిచూసుకోవాలి. రాసిన దాంట్లో అక్షర దోషాలు ఉండొచ్చు. అడ్రస్‌లో పొరపాటు ఉండొచ్చు. లేదా సెల్‌ఫోన్‌ నంబర్, ఈ-మెయిల్‌ ఐడీలోనూ తప్పులు దొర్లొచ్చు. రాసిన వాటిని ఒకసారి సరిచూసుకుంటే దొర్లిన తప్పులను దిద్దుకోవచ్చు. ఉదాహరణకు సెల్‌ఫోన్‌ నంబరే తప్పు రాసి చూసుకోలేదు అనుకుందాం. మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం పిలవడానికి ఫోన్‌ చేసినా అది మీకు చేరదు. నంబర్‌ ఇవ్వటంలో అశ్రద్ధ చూపారు కాబట్టి మీకు ఉద్యోగం అవసరం లేదేమోననే అభిప్రాయానికి రిక్రూటర్‌ రావచ్చు. 

9. క్లుప్తంగా అంకెల్లో..

సీవీలో అక్షరాలను మాత్రమే కాదు, అవసరమైన చోట అంకెలనూ వాడాలి. కచ్చితమైన సమాచారాన్ని తెలియజేసే సమయంలో అంకెలను ఉపయోగించొచ్చు. ఉదాహరణకు సేల్స్‌ జాబ్‌ కోసం సీవీ తయారుచేస్తున్నారనుకోండి.. మీరు చేసిన అమ్మకాల వివరాలను వివరించుకుండా.. క్లుప్తంగా అంకెల్లో రాస్తే రిక్రూటర్‌కు మీ పనితీరు చక్కగా బోధపడుతుంది. 

10. సాధించిన విజయాలు

గతంలో సాధించిన విజయాల గురించి రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో మీ గురించి మీరు మరీ గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా ఉండకూడదు. అలాగని చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ముక్తసరిగానూ ఉండకూడదు. విషయానికి ప్రాధాన్యం ఇస్తూనే ఆకట్టుకునే విధంగా తెలియజేయాలి.
 

Posted Date : 18-08-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌