• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్వ్యూల్లో ఈ పొరపాట్లు చేయవద్దు!

ఈ మధ్యే ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కిషోర్‌ వివిధ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. సీనియర్లను అడిగి ఇంటర్వ్యూలో ఎలా వ్యవహరించాలనే విషయంలో కొన్ని సలహాలూ తీసుకుంటున్నాడు. ఎలా ప్రవర్తించాలో చెబుతూ చాలామంది చాలా సలహాలు ఇచ్చారు. దుస్తుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలనీ, ఇంటర్వ్యూ చేసే వ్యక్తులను మర్యాదగా పలకరించాలనీ... ఇలా చాలా విషయాలు చెప్పారు. వీటన్నిటికంటే ముందు ఏమేం చేయకూడదో తెలిస్తే మరింత జాగ్రత్తగా ఉండొచ్చని ఆలోచిస్తున్నాడు కిశోర్‌. నిజమే. చేయకూడనివాటిని తెలుసుకుని గుర్తుంచుకుంటే జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

సాధారణంగా ఇతరులను సంప్రదించి, చక్కని భాషను ఉపయోగించి మరీ  రెజ్యూమెను ఆకర్షణీయంగా రూపొందిస్తారు అభ్యర్థులు. కానీ ఇంటర్వ్యూలో మాత్రం ఇతరుల సహాయ సహకారాలు తీసుకునే అవకాశం ఉండదు. మీ ఆహార్యం, మాటతీరు ఆధారంగా అతి తక్కువ సమయంలోనే అక్కడ ఫలితం తేలిపోతుంది. అంటే.. ఉన్న ఆ కొద్దిపాటి సమయంలోనే మిమ్మల్ని మీరు ఉద్యోగానికి అర్హులని నిరూపించుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిది. అవేమిటో తెలుసుకుందామా... 

నిర్లక్ష్యం పనికిరాదు 

ఇంటర్వ్యూకు వెళ్లే ముందు చాలామంది ఎలా ప్రవర్తించాలి, ఎలా జవాబులు చెప్పాలనే విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ ఆ సంస్థకు సంబంధించిన విషయాల మీద వారికి ఎలాంటి అవగాహనా ఉండదు. ఈ నిర్లక్ష్యం ఎంతమాత్రం సరికాదు. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో వివరాలను తెలుసుకోవాలి. టర్నోవర్, వ్యాపార విషయాలు, దానికి సంబంధించిన వర్తమాన అంశాల గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగొచ్చు. వీటన్నిటి గురించీ మీకు కాస్త అవగాహన ఉంటే వెంటనే సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆ సంస్థ వ్యాపార అభివృద్ధి కోసం ఏమైనా మార్పులను సూచించమని అడిగినా ఎలాంటి తడబాటూ లేకుండా చక్కగా చెప్పగలగాలి. 

క్లుప్తంగా సమాధానాలు  

కొంతమంది ఇంటర్వ్యూలో ముక్తసరిగా సమాధానాలు చెబుతుంటారు. ఎక్కువగా మాట్లాడితే ఎదుటివారు ఏమనుకుంటారోననే భయంతో అవును అనో, కాదు అనో మాత్రమే చెబుతుంటారు. ఇలాంటి సమాధానాలు మీ అనాసక్తికి అద్దం పడతాయి. ఇంటర్వ్యూకు హాజరుకావడం మీకిష్టంలేదనే అభిప్రాయానికి ఎదుటివారు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగని ప్రతి విషయానికీ అతిగా స్పందించి, అత్యుత్సాహంతో మాట్లాడటమూ మంచిదికాదు. అవసరమైనంత మేరకు మర్యాదగా మాట్లాడితే సరిపోతుంది. 

అయిష్టంగా.. ఇబ్బందిగా 

కొంతమంది అభ్యర్థులు ఇంటర్వ్యూ గది నుంచి ఎప్పుడు బైట పడదామా అన్నట్టుగా ఎదురుచూస్తుంటారు. అయిష్టంగా, ఇబ్బందిగా కూర్చుని అటూఇటూ కదులుతుంటారు. ఎదురుగా కూర్చున్నవారు మిమ్మల్ని ఓ కంట కనిపెడుతుంటారనే విషయాన్ని మర్చిపోతుంటారు. ఇలాంటి ప్రవర్తన ఇంటర్వ్యూ చేసేవారికి చిరాకు పుట్టిస్తుంది. అయిష్టంగా కూర్చున్న మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టకుండా త్వరగా బయటకు పంపే అవకాశమూ లేకపోలేదు. అంటే.. మీ ప్రవర్తన ద్వారా ఎదుటివారికి మీరే పరోక్షంగా సంకేతం అందించినట్టు అవుతుంది. అలాకాకుండా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా మార్చుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అతిచొరవ సరి కాదు 

కొంతమంది అభ్యర్థులు మరీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది కూడా మంచి పద్ధతికాదు. తమకు అన్ని విషయాలూ తెలుసన్నట్టుగా ఉంటారు. ఎదుటివారిని పూర్తిగా ఏ విషయం చెప్పనివ్వకుండా మధ్యలోనే అందుకుని మాట్లాడేస్తుంటారు. ఇదంతా ఎదుటివారికి ఇబ్బందిని కలిగిస్తుంది. అభ్యర్థి మీద సదభిప్రాయం ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పడానికి సిద్ధంకావాలి. ఎక్కువగా మాట్లాడటం, అయిష్టంగా సమాధానం చెప్పడం రెండూ సరైనవి కావని తెలుసుకోవాలి. 

ఇతరులతో పోల్చుకోవద్దు 

కొంతమంది అభ్యర్థులు తమతోపాటుగా ఇంటర్వ్యూకు హాజరైనవారి వివరాలను తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకుని అంతటితో వదిలేయకుండా... వాళ్లతో తమని పోల్చుకుని బాధపడుతుంటారు. తమకంటే ఎదుటివాళ్ల విద్యార్హతలు, అనుభవం ఎక్కువగా ఉంటే.. వాళ్లకే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని నిరుత్సాహపడిపోతుంటారు. ఇంటర్వ్యూకు హాజరుకాకముందే ఫలితం ప్రతికూలంగా ఉంటుందని బాధపడటం ఎంతవరకు సమంజసం? ఇలా ప్రతికూలంగా ఆలోచిస్తున్నారంటే మీ చేతిలో ఉన్న చక్కని అవకాశాన్ని జారవిడిచినట్టే అవుతుంది. దీన్నో సవాలుగా తీసుకుని మీకంటే ఎక్కువ అర్హతలు ఉన్నవారితో మీరు పోటీ పడాలి. అవరోధాలు ఎన్ని ఎదురైనా.. అంతిమంగా విజయాన్ని అందించేది సానుకూల దృక్పథమే అని నిరూపించాలి. 
 

Posted Date : 09-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌