• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంట‌ర్‌తోపాటే ఎంసెట్‌కూ స‌న్న‌ద్ధ‌త‌

మేటి స్కోరుకు నిపుణుల సూచ‌న‌లు

కాస్తశ్ర‌ద్ధ‌, స‌రైన వ్యూహంతో విజ‌యం

అరకొరగా విన్న ఆన్‌లైన్‌ తరగతులు.. కొంతలో కొంత మేలన్నట్టు సిలబస్‌ తగ్గింపు. క్రమంగా దగ్గరపడుతున్న పరీక్షలు. సమయమేమో తక్కువ. చాలామంది ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి ఇది! అయితే నిరాశ పడనక్కర్లేదు. సబ్జెక్టులను అవగాహన చేసుకుని పట్టు సాధించడానికి పూర్తిస్థాయిలో నిమగ్నం కావాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో!   

ఈ ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రతి పరీక్షా నిజంగా ‘పరీక్షే’! కరోనా ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా రెండో సంవత్సరం సిలబస్‌ మొత్తం దాదాపుగా ‘ఆన్‌లైన్‌’ ద్వారానే విన్న కారణంగా పాఠ్యాంశాలపై పూర్తి పట్టు అంత సులభం కాదు. అవకాశం లేకనో, ఇతర కారణాల వల్లనో అన్ని తరగతులూ విననివారున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వృత్తి విద్యాకోర్సుల్లో చేరేందుకు ‘ఎంసెట్‌’ రాయడం తప్పనిసరి. ఈ విద్యాసంవత్సరం ఆఫ్‌లైన్‌ తరగతులు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. దీంతో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు గానీ, ఎంసెట్‌ లాంటి పోటీపరీక్షలకు గానీ సమయం తక్కువగా ఉంది. ఇంటర్‌ పరీక్షలతో పాటే ఎంసెట్‌కీ ఒకే సమయంలో సన్నద్ధమవటం సరైన వ్యూహం! 

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు (ఐపీఈ) మే లోనూ, ఎంసెట్‌ జులైలోనూ నిర్వహించనున్నారు. ఉన్న కొద్దిసమయంలో ఏం చేస్తామని ఊరుకోకుండా ఉన్న సమయంలో ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే రెండు రకాల పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించవచ్చు. ఎంసెట్‌ 160 ప్రశ్నలకు ఉంటుంది. 

ఇంజినీరింగ్‌ విభాగంలో గణితం-80, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ- 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. మెడికల్‌ విభాగంలో వృక్షశాస్త్రం-40, జంతుశాస్త్రం-40, భౌతికశాస్త్రం-40, రసాయనశాస్త్రం-40 చొప్పున ప్రశ్నలొస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 160  మార్కులు. కాలవ్యవధి 180 నిమిషాలు. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష. రుణాత్మక మార్కులు లేనందున అన్ని ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించవచ్చు. ఎంపీసీ విద్యార్థులు కనీసం 80/160, బైపీసీ వారు 130/160 మార్కులు లేదా ఆపైన సాధిస్తే మంచి ర్యాంకును సొంతం చేసుకోవచ్చు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర సిలబస్‌లో తొలగించిన 30% పాఠ్యాంశాలను వదిలిపెట్టి మిగిలిన 70%పై దృష్టి సారించాలి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలోని పాఠ్యాంశాల్లో ఎలాంటి తొలగింపూ ఉండదు. కాబట్టి, అన్ని అంశాల్లో పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలి. ప్రశ్నలు మొత్తం తెలుగు అకాడమీ పుస్తకాల నుంచే ఉంటాయి. ఆ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి.

రసాయన శాస్త్రం

దీనిలో సరైన సన్నద్ధత ఎంసెట్‌లో ఎక్కువ మార్కులు పొందడానికి సాయపడుతుంది. అకాడమీ పుస్తకం నుంచి సన్నద్ధమవుతూ కీలకమైన అంశాలతో తమ సొంత నోట్స్‌ తయారు చేసుకోవాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో నేమ్‌డ్‌ రియాక్షన్స్, రీయేజెంట్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. వాటిని సాధన చేయాలి. ఇన్‌ఆర్గానిక్‌లో నేమ్‌డ్‌ ప్రాసెస్‌లు, పటాలు, పట్టికలు, గ్రాఫ్‌లు, మూలక ధర్మాలపై అధ్యయనం చేయాలి.

భౌతిక రసాయనశాస్త్రంలో ఫార్ములాలు, ఫార్ములా ఆధారిత ప్రశ్నలపై దృష్టి సారించాలి. అన్ని ఫార్ములాలు, వాటిలోని కాన్‌స్టంట్‌ విలువలను నోట్సుగా తయారుచేసుకోవాలి. అకాడమీ పాఠ్యపుస్తకంలో ఉదాహరణ ప్రశ్నలు, సాల్వ్‌డ్‌ ప్రాబ్లమ్స్‌పై ఎక్కువ దృష్టిపెట్టడం మంచిది. అకాడమీ పుస్తకంలో ప్రతి అధ్యాయం చివర్లో ఇచ్చిన ప్రాక్టీసు ప్రశ్నలు, సమీకరణ అంశాలను కచ్చితంగా చదవాలి.కెమికల్‌ బాండింగ్, పీ‡రియాడిక్‌ టేబుల్, స్టేట్స్‌ ఆఫ్‌ మేటర్, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ లాంటి పాఠ్యాంశాలు ఎంతో ముఖ్యం.

ఇంటర్‌ బోర్డు పరీక్షల కోణంలో విద్యార్థులు కొన్ని క్లిష్టతరమైనవిగా భావించిన అంశాలను చాయిస్‌ విధానం మేరకు వదిలేస్తారు. కానీ ఆ విడిచిపెట్టిన అంశాలు ఎంసెట్‌లో ముఖ్యమైన అంశాలైతే తప్పనిసరిగా వాటిని నేర్చుకోవాలి.

భౌతిక శాస్త్రం

సుమారు 30% ప్రశ్నలు నేరుగా వస్తాయి. ఫిజిక్స్‌లో ఫార్ములాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ఉపయోగించడంలో నేర్పు సాధించాలి. వర్క్, పవర్, ఎనర్జీ, సిస్టమ్‌ ఆఫ్‌ పార్టికిల్స్, రొటేషనల్‌ మోషన్, లాస్‌ ఆఫ్‌ మోషన్, మోషన్‌ ఇన్‌ ఎ ప్లేన్, మూవింగ్‌ చేంజెస్‌ అండ్‌ మాగ్నటిజమ్, గ్రావిటేషన్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, హీట్, థర్మోడైనమిక్స్‌ మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది.

షార్ట్‌కట్‌ ఫార్ములాలు, కాన్సెప్ట్‌ ఆధారిత షార్ట్‌నోట్సును రెండు, మూడుసార్లు పునశ్చరణ (రివిజన్‌) చేయాలి. కనీసం 3 గంటల సమయం పునశ్చరణకు కేటాయించాలి. వేగవంతమైన రివిజన్‌ కోసం కాన్సెప్ట్స్, ఫార్ములాలకు హ్యాండ్‌ బుక్‌ను తయారు చేసుకోవాలి. అకాడమీ పుస్తకాన్నీ, గత ప్రశ్నపత్రాలనూ తప్పనిసరిగా సాధన చేయాలి.

జీవ శాస్త్రం 

జంతు, వృక్ష శాస్త్రాల్లో 80/80 మార్కులు సాధించడానికి పరిశీలించాల్సిన అంశాలు.. 

కొవిడ్‌ కారణంగా ఈ విద్యాసంవత్సరంలో ఏయే చాప్టర్లను తొలగించారు? 

చాప్టర్‌- వెయిటేజీ 

సన్నద్ధ ప్రణాళిక

ఈ విషయాలను అర్థం చేసుకుని, సన్నద్ధమైతే బయాలజీలో మంచి మార్కులు సాధించవచ్చు. వెయిటేజీ దృష్ట్యా మొదటి సంవత్సరం సిలబస్‌లో 50- 55%, రెండో సంవత్సరం 45-50% ప్రశ్నలుంటాయి.
జంతుశాస్త్రం: ప్రథమ సంవత్సర సిలబస్‌లో.. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం; జంతు వైవిధ్యం; జంతు జీవ నిర్మాణం; జీవావరణం- పర్యావరణం; జంతు వైవిధ్యం-2 ముఖ్యమైనవి. రెండో సంవత్సరంలో.. మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం-2; మానవ ప్రత్యుత్పత్తి; జన్యుశాస్త్రం- అనువంశిక వ్యాధులు ముఖ్యమైనవి.

వృక్షశాస్త్రం: మొదటి సంవత్సరంలో- మొక్కలు స్వరూపశాస్త్రం; మొక్కలు నిర్మాణశాస్త్రం; కణ శాస్త్రం; లైంగిక ప్రత్యుత్పత్తి; వృక్షరాజ్యం; జీవ వర్గీకరణ చూసుకోవాలి. రెండో సంవత్సరంలో.. శరీరధర్మశాస్త్రం: కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, వృక్ష హార్మోన్లు; జన్యుశాస్త్రం; బయోటెక్నాలజీ; మాలిక్యులర్‌ బయాలజీ; మైక్రోబ్స్‌ హ్యూమన్‌ వెల్ఫేర్‌ చాలా ముఖ్యమైనవి.

పరీక్ష రాసేటపుడు ప్రశ్నలను పూర్తిగా చదవాలి. ఆప్షన్లనూ ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి (ప్రశ్నల్లో కరెక్ట్, ఇన్‌కరెక్ట్‌ స్టేట్‌మెంట్లు అని అడుగుతుంటారు). 

సులభమైన ప్రశ్నలను గుర్తించి, సమాధానాలు పూర్తిచేయాలి. 

కఠినమైన ప్రశ్నలకు ఎలిమినేషన్‌ ద్వారా సమాధానాలు రాబట్టుకోవాలి. 

బయాలజీ తేలికైన సబ్జెక్టులే కదా అని అతివిశ్వాసంతో ప్రశ్నలను అసంపూర్తిగా చదివి, సమాధానాలు ఇవ్వకూడదు. 

40-45 నిమిషాల్లో బయాలజీ పూర్తిచేసుకుని ఫిజిక్స్, కెమిస్ట్రీ చేయాలన్న తొదరలో తప్పులు చేయొద్దు. 

తెలుగు అకాడమీ చాప్టర్లన్నింటినీ క్షుణ్ణంగా చదవాలి. 

గత సంవత్సర ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లను సాధన చేయాలి. 

బయాలజీ ప్రశ్నలు సరిపోల్చడం, స్టేట్‌మెంట్‌ క్వశ్చన్లు, అసర్షన్‌ అండ్‌ రీజన్, తప్పు-ఒప్పులు వంటివి ఉంటాయి. కాబట్టి, ప్రశ్న మొత్తాన్నీ పూర్తిగా చదివాకే సమాధానమివ్వాలి. 

ప్రతి చాప్టర్‌కు సంబంధించి పునశ్చరణ చేసుకుని, ప్రశ్నలన్నీ సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.

1. ఐపీఈతోపాటు ఎంసెట్‌ రాసేవారు రోజూ ప్రణాళిక ప్రకారం చాప్టర్లను విభజించుకుని సన్నద్ధమవ్వాలి. 

2. పాఠ్యపుస్తకాలను చదువుతూ సాధన చేయాలి. 

3. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులకూ కొంత సమయం కేటాయించటం మేలు. 

4. ఒక్కో చాప్టర్‌ చొప్పున సన్నద్ధమై చాప్టర్లవారీ టెస్టులు రాయాలి. 

5. ఎంసెట్‌కు ముందు కొన్ని గ్రాండ్‌ టెస్ట్‌లు రాయగలిగితే ఉపయోగం. 

6. ప్రతిరోజూ కొంత సమయం పునశ్చరణకు కూడా కేటాయించాలి. 

7. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సేకరించి, విశ్లేషించి వాటిలోని అంశాలను నేర్చుకోవాలి.

గణిత శాస్త్రం

ఎంసెట్‌ ప్రశ్నల సరళిని పరిశీలిస్తే... ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి ప్రశ్నలు సగం సగం చొప్పున వచ్చే అవకాశముంది.

ప్రథమ సంవత్సరం: ఆల్జీబ్రా- 7%; ట్రిగనామెట్రీ- 12%; వెక్టార్‌ ఆల్జీబ్రా- 7%; కోఆర్డినేటెడ్‌ జామెట్రీ-12%; కాల్‌క్యులస్‌-12% 

ద్వితీయ సంవత్సరం: ఆల్జీబ్రా- 25%; కోఆర్డినేటెడ్‌ జామెట్రీ-12%; ఇంటిగ్రల్‌ కాల్‌క్యులస్‌-13%

వెయిటేజీకి అనుకూలంగా తమకు అవగాహన ఉన్న టాపిక్‌లను మరికొంత పట్టు వచ్చేవిధంగా- కనీసం 50/80 మార్కులు సాధించేలా చూసుకోవాలి. అకాడమీ, ఎంసెట్‌ మెటీరియల్‌ల నుంచి సాధన చేయాలి. ఫార్ములాలను వీలైనంతవరకు ప్రతిరోజూ మననం చేసుకోవాలి. సినాప్సిస్, పాయింట్స్, చాప్టర్‌ ప్రారంభించే ముందు ఓసారి పునశ్చరణ చేయాలి.  సమయపాలన చాలా అవసరం. సాధన సమయంలోనూ ఒక గంటలో కనీసం 30-40 సమస్యలు సాధించేలా సాధన ప్రారంభించాలి. క్రమంగా ఆ సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేయాలి. సాధన సమయంలోనూ క్లిష్టతరమైన, సుదీర్ఘమైన ప్రశ్నలను వదిలి, చివర్లో చేసేలా సాధన చేయాలి. 


 

Posted Date : 11-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌